Bastar Maoist Affected Areas : ఛత్తీస్‌గడ్‌లోని బస్తర్ ప్రాంతం మావోయిస్టుల కంచుకోట. భారీ ఎత్తున భద్రతా బలగాలు ఉంటేనే గానీ రాజకీయ నాయకులు పర్యటించడానికి ఏమాత్రం సాహసించని ప్రాంతం. బస్తర్ రీజియన్‌లో ఏడు జిల్లాలు కంకేర్, నారయణ్‌పూర్, కొండగావ్, బస్తర్, దంతేవాడ, బీజాపూర్, సుక్మా ఉన్నాయి. ఈ ఏడు జిల్లాలో పరిధిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జగదల్‌పూర్ సిటీ, బస్తర్, చిత్రకూట్, దంతేవాడ, కొంట, బీజాపుర్, కొండగావ్, కంకేర్, భానుప్రతాప్‌పూర్, అంతగడ్, కేష్కల్ నియోజకవర్గాలు బస్తర్ పరిధిలోనివే. భద్రత పరంగా ఈ 12 నియోజకవర్గాలు అత్యంత సున్నితమైనవి. దట్టమైన అడవులు, కొండలతో నిండిన ఈ ప్రాంతంలో గిరిజనుల జనాభానే 70శాతం వరకు ఉంటుంది.
బస్తర్‌లో మావోయిస్టుల ఆధిపత్యం కనిపిస్తుంది. అనేకమంది రాజకీయ నాయకులను మావోయిస్టులు హత్యచేశారు. అందుకే ఈ ప్రాంతంలో నేతల పర్యటనలే కాదు ఎన్నికల నిర్వహణ కూడా కత్తిమీద సామే. అందుకే 90 స్థానాలున్న ఛత్తీస్‌గడ్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలివిడత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 20 నియోజకవర్గాల్లో నవంబరు 7న పోలింగ్ జరగనుంది. మిగిలిన 90 స్థానాలకు నవంబరు 17న పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే 20 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు బస్తర్ రీజియన్‌లోనే ఉన్నాయి. 12 నియోజకవర్గాల నుంచి 128 మంది పోటీకి నిలిచారు.
బస్తర్ రీజియన్‌లో గత ఎన్నికలకు ఈసారి ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. అదే నక్సల్స్ ప్రభావిత 120 గ్రామాల ప్రజలు స్వాతంత్ర్యం తర్వాత సొంత ఊర్లోనే ఓటు వేసే అవకాశం దక్కింది. ఈ మేరకు ఏడు జిల్లాల్లో 126 కొత్త పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. బస్తర్ రీజియన్‌లోని చాలా గ్రామాల్లో పోలింగ్ నిర్వహణే కష్టంగా ఉండేది. మావోయిస్టుల భయంతో ఈ 120 గ్రామాల్లో ఇప్పటివరకు పోలింగ్ బూత్‌లనే ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసినా భయంతో మరో చోటుకు బదిలీచేసేవారు. సురక్షిత ప్రాంతంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేవారు. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు 10 కిలోమీటర్ల వరకూ ప్రయాణించి ఓటు వేయాల్సి వచ్చింది. ఈసారి వారు సొంత ఊర్లోనే అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా 54 వేల మందికి.. ప్రయాణం చేసి ఓటు వేసే బాధ తప్పింది.
ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించిన ఎన్నికల సంఘం కొత్త పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసి మరీ.. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. గత ఐదేళ్లలో ఈ గ్రామాల్లో.. 60కుపైగా పోలీసు క్యాంపులను ఏర్పాటు చేశారు. తద్వారా ఆ ప్రాంతంలో పోలీసుల ప్రాబల్యం పెరిగి మావోయిస్టుల ఆధిపత్యం బాగా తగ్గింది. తద్వారా అక్కడ ప్రజలకు కూడా.. భద్రతా బలగాలపై నమ్మకం పెరిగింది. ఆయా గ్రామాల్లో పోలింగ్ పార్టీలకు ఎన్నికల సంఘం ఇప్పటికే శిక్షణ కూడా ఇస్తోంది.
మావోయిస్టుల భయం లేకుండా ప్రజలు ఓటు వేసే విధంగా బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో బలగాలను మోహరించినట్లు.. పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తొలి విడత ఎన్నికలకు ప్రత్యేక పోలీసులు బలగాలు, DRG, STF, కోబ్రా దళాలు, CRPF, ఐటీబీపీ, వంటి కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించినట్లు చెప్పారు. స్థానిక పోలీసులు వారికి అదనంగా ఉంటారని చెప్పారు. భద్రతా పరమైన సమస్యలతో బలగాల సంఖ్యను చెప్పేందుకు ఉన్నతాధికారులు ఇష్టపడడంలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">