Karnataka Elections 2023 : కర్ణాటకలో సాధారణ మెజార్టీకి అవసరమయ్యే స్థానాల్లో నాలుగోవంతైన 28 సీట్లు బెంగళూరు అర్బన్‌లోనే ఉన్నాయి. 224 అసెంబ్లీ సీట్లు ఉన్న కర్ణాటకలో 12.5 శాతం నియోజకవర్గాలు, 20శాతం ఓటర్లు బెంగళూరు అర్బన్ జిల్లాలోనే ఉన్నారు. అయితే జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేకపోవటం, అధ్వానమైన రోడ్లు, చినుకుపడితే చెరువులా మారే రహదారులు, వ్యర్థాల నిర్వహణలో లోపాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, అన్నింటికీ మించి అవినీతి ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి.
నీటిగుండంగా అర్బన్
కరోనా, రెండేళ్లపాటు వదలని వర్షాలు బెంగళూరు ప్రజలను తీవ్ర అసహనానికి గురిచేశాయి. 2022 మార్చి నుంచి మే వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బెంగళూరులోని 40శాతం ప్రాంతాలు ముంపునకు గురైయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకైక ఐటీ క్లస్టర్‌గా ఎదిగిన బెంగళూరు అర్బన్ వర్షాలకు నీటిగుండంగా మారింది. ఐటీ కార్యాలయాలు ఉండే మహదేవపుర, బెళ్లందూరు, కోరమంగళ, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లోని ఐటీ కార్యాలయాలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై, ఓఆర్‌ఆర్ ఐటీ సమాఖ్య మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నపాటి వర్షాలకే బెంగళూరు రోడ్లు గుంతలమయంగా మారటంపై బయోకాన్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు వ్యక్తంచేసిన అసంతృప్తి ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల నగరాన్ని నిర్లక్ష్యం చేశారనే ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. 2020 సెప్టెంబరు 10న బీబీఎంపీ కాల పరిమితి ముగిసినా ఇంతవరకూ ఎన్నికలు నిర్వహించలేదు. ఎమ్మెల్యేలందరికీ ఆ తీవ్రత తగిలేదే అయినా అధికార పక్షంపై ఆ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. బొమ్మై ప్రభుత్వంపై ప్రజల్లోని అసంతృప్తి పట్ల కమలం పెద్దలు కలవరం చెందుతుండగా ప్రధాని మోదీ ప్రభావం తమ అవకాశాలను మళ్లీ దెబ్బతీస్తుందేమోనని కాంగ్రెస్ కంగారుపడుతోంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే అని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
ఓటింగ్‌లో మాత్రం అంతంతమాత్రం!
పేరుకే బెంగళూరు.. కాస్మోపాలిటన్ నగరంగా, భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందినా ప్రతి ఎన్నికల్లోనూ అతి తక్కువ పోలింగ్ నమోదవుతోంది. కర్ణాటక వ్యాప్తంగా 70 శాతం, బెంగళూరు గ్రామీణంలో 80శాతం పోలింగ్ నమోదైనా బెంగళూరులో ఏనాడూ 60శాతానికి మించి ఓటింగ్ నమోదు కాలేదు. పట్టణ ప్రాంతాల్లో భాజపాకు తిరుగులేదని అనుకుంటున్నా ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్‌కే ఆదరణ లభిస్తోంది.
బెంగళూరు అర్బన్ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 2008 ఎన్నికల్లో భాజపా 18, కాంగ్రెస్ 10 స్థానాలు గెలుపొందాయి. ఆ తర్వాత జరిగిన 2013, 2018 ఎన్నికల్లో హస్తం పైచేయి సాధిస్తూ వచ్చింది. గతఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు వచ్చినా.. తర్వాత సంభవించిన రాజకీయ మార్పులతో కమలనాథుల బలం పెరిగింది. అయితే ఈసారీ కూడా బెంగళూరు అర్బన్‌లో కాంగ్రెస్, భాజపా మధ్యే పోటీ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత, ఈసారి సీనియర్లను పక్కనపెట్టి 60మందికిపైగా కొత్తవారికి టికెట్లు ఇవ్వటం భాజపాకు అతిపెద్ద సవాల్‌గా నిలుస్తోంది.
శాంతినగర, బెంగళూరు సెంట్రల్, సి.వి.రామన్ నగర, పులకేశినగరలో తమిళ ఓటర్ల ప్రభావం ఉండగా మహదేవపుర, బీటీఎం లేఔట్, యెలహంక, హెబ్బాళ, యశ్వంతపుర, కేఆర్‌పురలో తెలుగు ఓటర్లు, శివాజీనగర, చామరాజపేటలో ముస్లింలు, చిక్కపేటలో హిందీ ఓటర్లు గెలుపోటములను నిర్ణయిస్తారు. కమలనాథులు అంటున్నట్లు బెంగళూరు అర్బన్ జిల్లాలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి భాజపా సత్తా చాటుతుందా లేక వరుసగా మూడోసారి కూడా హస్తవాసి కొనసాగుతుందా అన్నది మే 13న తేలనుంది.