కేంద్ర ప్రభుత్వం ఓ బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయబోతోందనే కథనాలపై మేధా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. తాము ఏర్పాటుచేస్తున్నది జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్) అని, అది బ్యాడ్ బ్యాంక్ కాదని ఇటీవల భారతీయ బ్యాంకుల సంఘం 74వ వార్షిక సమావేశంలో వివరించారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల వద్ద పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏల)ను విక్రయించి, సొమ్ము రాబట్టడం ఎన్‌ఏఆర్‌సీఎల్ లక్ష్యమని పేర్కొన్నారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఎన్‌పీఏలను ఎన్‌ఏఆర్‌సీఎల్ స్వాధీనం చేసుకుంటుందని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు తోడు భారత రుణ పరిష్కార కంపెనీ (ఎన్‌డీఆర్‌సీఎల్)నీ సర్కారు నెలకొల్పింది. ఇది ఎన్‌ఏఆర్‌సీఎల్ తరఫున ఆస్తుల విక్రయ సంస్థగా పనిచేస్తుంది. ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు రూ.30,600 కోట్ల పూచీకత్తు నిధిని సైతం కేంద్రం ఏర్పాటు చేసింది.
సవాళ్లు ...
ఎన్‌ఏఆర్‌సీఎల్ మొదట బ్యాంకుల నుంచి పారు బాకీలను కొనుగోలు చేసి, వాటి విలువలో 15 శాతాన్ని బ్యాంకులకు చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతానికి ప్రభుత్వం తరఫున సురక్షా రసీదులు ఇస్తుంది. పారుబాకీలను ఎన్‌డీఆర్‌సీఎల్ సాయంతో మార్కెట్లో విక్రయించగా వచ్చే నగదును వాణిజ్య బ్యాంకులకు అందజేస్తుంది. ఒకవేళ ఎన్‌పీఏలను అమ్మలేకపోయినా, నష్టానికి అమ్మినా పూచీకత్తు నిధి నుంచి నష్టాన్ని భర్తీచేస్తారు. మొదటి దశలో ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు రూ.90,000 కోట్ల ఎన్‌పీఏలను బదిలీ చేసి, రూ.13,500 కోట్ల సొమ్మును రాబట్టగలుగుతారని అంచనా. ఈ ప్రక్రియ కొనసాగిన కొద్దీ బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఎన్‌పీఏలను సెక్యూరిటీల రూపంలో సెకండరీ మార్కెట్లో విక్రయించడం ద్వారా ఎన్‌ఏఆర్‌సీఎల్ ఏ మేరకు సొమ్ము రాబట్టగలుగుతుందనేది ప్రధాన ప్రశ్న. అత్యధిక ఎన్‌పీఏలను బ్యాంకులు పారుబాకీలుగా పరిగణిస్తున్నాయి. అటువంటి వాటిని సెక్యూరిటీలుగా మార్చినంత మాత్రాన కొనుగోలుదారులు ముందుకొస్తారా అనే సందేహం తలెత్తుతోంది.
ఒకవేళ కొనుగోలు చేసినా వాటి మీద ఏమాత్రం రాబడి వస్తుందన్నది మరో ప్రశ్న. పైగా పాలనాపరమైన అనుమతులను వేగంగా ఇవ్వడంపై ఎన్‌పీఏల విక్రయ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఎన్‌పీఏల సమస్య మనం అనుకున్నదానికన్నా తీవ్రమైనదని ఈ జులైలో రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదికను బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో 7.48శాతంగా ఉన్న ఎన్‌పీఏల నిష్పత్తి వచ్చే ఏడాది మార్చికి 9.8శాతానికి పెరుగుతుందని రిజర్వు బ్యాంకు అంచనా. అసలు ఈ నిష్పత్తి 11.22 శాతానికి చేరే అవకాశమూ లేకపోలేదని పేర్కొంది. ఏతావతా బ్యాంకులు, వాటి దగ్గర నుంచి రుణాలు తీసుకున్న కంపెనీల ఖాతాపుస్తకాల్లో పారు బాకీలు కదలకుండా ఉంటాయి. వాటిని కరిగించాల్సిన బాధ్యత మళ్ళీ ఎన్‌ఏఆర్‌సీఎల్‌పై పడుతుంది. అంటే దాని మీద ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. అసలు ఎన్‌పీఏలను ఎన్‌ఏఆర్‌సీఎల్ ఏ విధంగా వసూలు చేయబోతోంది, అందుకు ఏదైనా ప్రత్యేక యంత్రాంగం ఉందా అనే ప్రశ్నలూ ఉద్భవిస్తున్నాయి.
మొండి బాకీలను వసూలు చేయడంలో ఎన్‌ఏఆర్‌సీఎల్ తన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలేవైనా నిర్వహిస్తుందా అనేదీ చూడాలి. ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు విశేష అధికారాలు ప్రసాదించినట్లు కనిపించడంలేదు. బాకీల వసూలుకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే చట్టమేదీ లేకపోవడంతో చివరకు దాని పరిస్థితి మామూలు బ్యాంకుల మాదిరిగానే తయారయ్యే అవకాశం ఉంది. ఈ లోపాన్ని తక్షణం సరిదిద్దాలి.
బ్యాంకింగ్ రంగాన్ని సంస్కరిస్తే యావత్ ఫైనాన్స్ రంగమూ బాగుపడుతుంది. రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎన్‌పీఏలను, ఇతర ఒత్తిళ్లను తట్టుకోగల ఆర్థిక సత్తా మన బ్యాంకులకు ఉండటం కారుచీకట్లో కాంతి పుంజంలా కనిపిస్తోంది. భారతీయ బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయి కాబట్టి ఆటుపోట్లను సమర్థంగా అధిగమించగలవు. అసలు పారుబాకీలకు అవకాశమివ్వని రీతిలో బ్యాంకుల రుణ కార్యక్రమం ముందుకుసాగాలి.
పారుబాకీలను ఎన్‌ఏఆర్‌సీఎల్ తలకెత్తుకోవడం వల్ల వాణిజ్య బ్యాంకులపై భారం తగ్గే మాట నిజమే. దీన్ని సాకుగా తీసుకుని బ్యాంకులు మళ్ళీ విచక్షణారహితంగా ఎడాపెడా అప్పులిచ్చేస్తే, పరిస్థితి మొదటికొస్తుంది. ఎన్‌పీఏలు మరోసారి కొండల్లా పెరిగిపోతాయి. విధానకర్తలు ఇటువంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. రుణగ్రహీతల అర్హత, స్తోమతను కచ్చితంగా అంచనా వేసి, రుణ వసూలుపై నిఘా వేయడానికి బ్యాంకుల్లో ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొల్పాలి. వేగంగా లాభాలు ఆర్జించాలనే కోరికను వదిలి, ఇచ్చిన రుణాలను సక్రమంగా తగిన వడ్డీతో వసూలు చేసుకోవడానికి బ్యాంకులు ప్రాధాన్యమివ్వాలి. తీసుకున్న రుణాలను తిరిగి తీర్చేయాలనే చైతన్యం కలిగిన రుణ గ్రహీతలను పెంపొందించుకోవాలి. దీన్ని సుస్థిర రుణ వితరణ కార్యక్రమంగా అభివర్ణించవచ్చు. ఇలాంటి క్రమశిక్షణ అలవడినప్పుడు ఎన్‌పీఏల బెడద తప్పుతుంది. అన్నింటికీ మించి బ్యాంకులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ తీరును సంస్కరించాలి.
బ్యాంకింగ్ రంగాన్ని సంస్కరిస్తే యావత్ ఫైనాన్స్ రంగమూ బాగుపడుతుంది. రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎన్‌పీఏలను, ఇతర ఒత్తిళ్లను తట్టుకోగల ఆర్థిక సత్తా మన బ్యాంకులకు ఉండటం కారుచీకట్లో కాంతి పుంజంలా కనిపిస్తోంది. భారతీయ బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయి కాబట్టి ఆటుపోట్లను సమర్థంగా అధిగమించగలవు. అసలు పారుబాకీలకు అవకాశమివ్వని రీతిలో బ్యాంకుల రుణ కార్యక్రమం ముందుకుసాగాలి. బ్యాడ్ బ్యాంక్ అనేది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే తప్ప, దానివల్ల బ్యాంకుల పునాదులేమీ పటిష్ఠం కావు. సుస్థిర రుణ వితరణ, వసూలు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా బ్యాంకులు తమకు తామే స్థిరత్వాన్ని సంపాదించాలి.
వాటికే ప్రయోజనం
బ్యాడ్ బ్యాంక్ ఆలోచన ఇప్పటిది కాదు. 1980ల నుంచే దాని ప్రస్తావన కనిపిస్తుంది. మొదట అమెరికా, స్వీడన్‌లలో బ్యాడ్ బ్యాంకులు ఏర్పడ్డాయి. పారుబాకీల వసూలులో అవి విజయవంతం కావడంతో బెల్జియం, ఫిన్లాండ్, మలేసియా, ఇండొనేసియాల్లోనూ బ్యాడ్ బ్యాంకులను ఏర్పరచారు. 2008లో అమెరికా- చిక్కుల్లో పడిన ఆస్తుల వసూలు కార్యక్రమం (టార్ప్) ప్రారంభించగా, 2009లో ఐర్లాండ్ జాతీయ ఆస్తుల నిర్వహణ సంస్థ (నామా)ను నెలకొల్పింది. ఎన్‌పీఏల వల్ల దెబ్బతిన్న బ్యాంకులకు తగిన మూలధనాన్ని సమకూర్చకుండా కేవలం పారుబాకీలను వేరు చేస్తే ప్రయోజనం ఉండదని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ పేర్కొంది.
మొదటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకునే బ్యాంకులకు చాలా తక్కువ ఎన్‌పీఏలు ఉంటాయి. సరైన ప్రణాళికతో వ్యవహరించడం వల్ల అటువంటి బ్యాంకులు పెద్దయెత్తున రుణ వితరణ కొనసాగించినా ఎన్‌పీఏల శాతం తక్కువగానే ఉంటుందని అధ్యయనాలు చాటుతున్నాయి. అలాంటి వాటికే బ్యాడ్ బ్యాంక్ వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎన్‌ఏఆర్‌సీఎల్ తగిన చట్టపరమైన అధికారాలతో ముందుకు సాగితే దేశానికి ఆర్థిక భద్రత సమకూరుతుంది.
-డాక్టర్ మహేంద్రబాబు కురువ
ఇదీ చదవండి: Fuel Price Hike: పెట్రో మంట.. ముడి చమురు ధరలు పైపైకి..!