దేశ జనాభాలో మధ్యవయస్కులు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సమర్థంగా నిర్వహించాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ- ఆరోగ్య వ్యవస్థను మెరుగు పరచడం ఎంతో అవసరమని కరోనా మహమ్మారితో ఎదురైన అనుభవాలు చెబుతున్నాయి. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ప్రజల జీవితాలను రక్షించే క్రమంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సమష్టి చర్యలతో దేశంలో మలేరియా, క్షయ, కుష్ఠు, మాతాశిశు మరణాలు, హెచ్‌ఐవీ వంటి ప్రజారోగ్య సమస్యలకు పరిష్కారం లభించింది. సామాజిక వృద్ధికి శాస్త్రీయ పురోగతి, ఆరోగ్య సంరక్షణ చర్యలను జోడించడం వల్ల జనన, మరణాల రేటు తగ్గింది. అయితే, సాంక్రామిక వ్యాధులు, ఇతర రోగాల ప్రభావంతో ఆరోగ్య వ్యవస్థలు కొట్టుమిట్టాడుతున్నాయి. సార్స్, ఔషధాలకు లొంగని క్షయ, హెచ్1ఎన్1 వంటి వ్యాధులు ఇబ్బందికరంగా మారాయి.
భవిష్యత్తు ఆశాజనకం
ఆర్థిక వనరుల లోటు, అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల ఆరోగ్య రంగంలో అసమానతలు పెరిగిపోయాయి. మరోవైపు మేధా సంపత్తి హక్కులకు సంబంధించి వాణిజ్యపరమైన అంశాలపై అంతర్జాతీయ వేదికల్లో చర్చలు కొనసాగుతుండటం ఆరోగ్య వ్యవస్థకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సేవలు సరిగ్గా అందకపోవడం, ప్రజల్లో బీమా వ్యవస్థ విస్తృతి తక్కువగా ఉండటం, దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతుండటం సహా ఎన్నో సవాళ్లను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎదుర్కొంటోంది. మౌలిక వసతులను విస్తరించడం, విధానాలను మెరుగు పరచడం సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా ఆరోగ్య వ్యవస్థను సామాన్యుడికి అందుబాటులోకి తేవచ్చు. ఎన్ని లోపాలున్నా- ఆరోగ్య సంరక్షణ రంగంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎలెక్ట్రానిక్ వైద్య రికార్డులను ఉపయోగించాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. దీనివల్ల కృత్రిమ మేధతో రోగుల సమాచారాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుని, మెరుగైన చికిత్స అందించవచ్చు. సాంకేతికత మెరుగుపడి టెలికాం బ్యాండ్‌విడ్త్ అందుబాటులోకి రావడం వల్ల టెలీమెడిసిన్, టెలీ-కన్సల్టింగ్ ద్వారా వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకూ చేరుతున్నాయి.
డిజిటల్ రంగానిది కీలక పాత్ర
సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతుండటం వల్ల జబ్బు చేసినప్పుడే చికిత్స తీసుకోవడమనే పద్ధతి కాకుండా- అనునిత్యం ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే, నేటి ఆరోగ్య సంరక్షణ నమూనా నిలకడ లేమితో సతమతమవుతోంది. ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ రూపాంతరం చెందాల్సి ఉంది. అందులో కీలక పాత్ర డిజిటల్ రంగానిదే. వినియోగదారుడికి ప్రాధాన్యమిస్తూ ఆరోగ్య సంరక్షణ వైపు అడుగులు వేయడం వల్ల భవిష్యత్తులో ఈ వ్యవస్థ భిన్నరీతిలో ఉండే అవకాశం ఉంది. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మరింత బాధ్యతాయుతంగా ఉండేందుకు ఇది దోహద పడుతుంది. వైద్య సేవలు మరింత సులభంగా అర్థమయ్యేందుకు, సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఉపకరిస్తుంది. 'భారత్‌లో తయారీ' కార్యక్రమంతో దేశీయంగా వైద్య పరికరాలను తయారు చేసే వారికి ప్రోత్సాహం లభిస్తోంది. ఫలితంగా ఒకప్పుడు దిగుమతి చేసుకునే స్టెంట్లు, ఇంప్లాంట్లు వంటి వాటి ధరలు తగ్గాయి. అదే సమయంలో దేశంలోని విధానాలు, నియంత్రణ సంస్థలూ సాంకేతికతకు చోటివ్వాలి. తగిన నియంత్రణలు అమలు చేస్తూనే ఆన్‌లైన్ ఫార్మసీలను పెంచాలి. ఇప్పుడిప్పుడే ఇంటి వైద్యానికి డిమాండ్ పెరుగుతోంది. మొబైల్ ఫోన్ల ద్వారా 24 గంటల పాటు అందుబాటులో ఉండే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దేశంలోని మొత్తం రోగాల్లో జీవనశైలికి సంబంధించిన వ్యాధుల వాటా పెరుగుతుండటం వల్ల ప్రత్యేక చికిత్సలకూ డిమాండ్ హెచ్చే అవకాశముంది.
పెరుగుతున్న అసమానతలు
భారత ఆరోగ్య సంరక్షణ రంగం పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారుతోంది. ముఖ్యంగా సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు రెండో శ్రేణి, మూడో శ్రేణి మార్కెట్లకు చేరువయ్యేందుకు ఉపయోగ పడుతుండటం కలిసి వస్తోంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో అదనపు విలువ జోడించేందుకు డిజిటల్ విధానాలు తోడ్పడుతున్నాయి. హార్డ్‌వేర్‌తో పాటు ఇతర విషయాల్లో సంభవిస్తున్న మార్పులు సాంకేతిక-భౌతిక ప్రపంచాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తుడిచి పెట్టేస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో ఆసుపత్రుల వివరాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ సెన్సర్లు, పరికరాలు ఉన్న హార్డ్‌వేర్ ఉపకరణాల కలయికతో వినియోగదారులకు నచ్చిన సమయంలో, తక్కువ ధరలకు మెరుగైన చికిత్స అందించేలా సర్వీస్ ప్రొవైడర్లు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో పలు పట్టణాల్లో ప్రపంచస్థాయి వైద్యం అందుతుంటే, గ్రామీణ భారతంలో మాత్రం కనీస ఆరోగ్య సంరక్షణ సదుపాయాలూ కొరవడ్డాయి. ఫలితంగా ఆరోగ్య వ్యవస్థలో పట్టణ- గ్రామీణ వ్యవస్థల మధ్య అసమానతలు పెరిగిపోయాయి. అయితే, ప్రస్తుతం దేశంలో ఆరోగ్య సంస్కరణలు మొదలయ్యాయి. ఈ ప్రయాణం సవాళ్లతో కూడుకున్నప్పటికీ- అవకాశాలు, ఫలితాలు స్ఫూర్తిదాయకం. నిర్దేశించుకున్న ఆరోగ్య సంరక్షణ కల్పనను సాధించి, అత్యుత్తమ ఆరోగ్య సేవలను ప్రజలకు అందించే సత్తా భారత్‌కు ఉంది.
- డాక్టర్ అనిల్ కృష్ణ గుండాల (హృద్రోగ నిపుణులు)
ఇదీ చదవండి : '18 ఏళ్లు నిండితే వ్యాక్సిన్'..అని కేంద్రం చెప్పినా..!