ఏడు దశాబ్దాలకు పైగా భారతావని నుదుట రుధిర సిందూరమైన జమ్మూకశ్మీరంలో స్థానిక ఎన్నికల సందడి- సరికొత్త రాజకీయ పునరేకీకరణను కళ్లకు కడుతోంది. ఈ నెల 28 నుంచి మొదలై ఎనిమిది అంచెలుగా సాగి డిసెంబరు 19న ముగిసే మొట్టమొదటి జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) పోలింగ్ ప్రక్రియ- దరిమిలా మూన్నాళ్లకు ఫలితాల ప్రకటనతో ఓ కొలిక్కి రానుంది. పంచాయతీ రాజ్ వ్యవస్థలో మూడో అంచె అయిన డీడీసీలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపేలా సంబంధిత చట్టాన్ని కేంద్రం అక్టోబరు 17న సవరించింది. ప్రతి జిల్లాను 14 ప్రాదేశిక నియోజక వర్గాలుగా విభజించి మొత్తం డీడీసీల్లోని 280 స్థానాలకు, వాటితోపాటే ఖాళీగా ఉన్న 12 వేల పంచాయతీ సీట్లకు, మరో 230కిపైగా పట్టణ స్థానిక సంస్థల స్థానాలకూ ఎన్నికలు జరుపుతున్నారు. రెండేళ్లనాడు ఇవే రోజుల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలకు, నిరుడు 370 అధికరణ రద్దు తరవాత జరిపిన బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికలకు రాజకీయ స్పందన అరకొరగానే ఉండటం గమనార్హం.
ప్రధాన రాజకీయ స్రవంతి పక్షాల నేతల్ని గృహనిర్బంధం నుంచి విముక్తం చేశాక పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) పేరిట ఏకతాటి మీదకొచ్చిన పార్టీలు ఉమ్మడి అజెండాతో కదులుతుండటంతోనే దీర్ఘశ్రుతిలో సాగుతోంది రాజకీయ కోలాహలం! ముంబయి ముట్టడి జరిగిన నవంబరు 26న పెను విధ్వంసానికి జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు కుట్రపన్నారన్న హెచ్చరికలు, లక్షకుపైగా కేసులు 1640 మరణాలకు కారణమైన కొవిడ్ మరింతగా కోర చాస్తుందన్న ఆందోళనల నడుమ ఈ ప్రజాతంత్ర క్రతువు సాగనుంది. జమ్మూకశ్మీరుకు పూర్వస్థితి పునరుద్ధరణే అజెండాగా గుప్కార్ కూటమి ప్రచారం సాగుతుంటే, లేశమాత్రంగానైనా ఆ అవకాశం లేదంటున్న భాజపా- జాతి వ్యతిరేక శక్తులుగా కూటమిని తూర్పారపడుతోంది. ఎన్నికల్ని గెలిచే రాజకీయాలు కాదు, ప్రజాభిమానం చూరగొనే రాజనీతిజ్ఞతతో పార్టీలు స్పందించాల్సిన కీలక తరుణమిది!
కశ్మీర్ సమస్యను ఇన్సానియత్ (మానవత్వం), జమ్‌హురియత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ (మతసామరస్యానికి ప్రోదిచేసే కశ్మీరీ సంస్కృతి) సూత్రాల ఆధారంగా పరిష్కరించగలమని భారతరత్న వాజ్‌పేయీ 2003లో సూచించారు. జ్ఞాతివైరంతో దహించుకుపోతూ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న దాయాది దేశానికి మెరుపు దాడులతో బుద్ధి చెప్పిన మోదీ ప్రభుత్వం- ఇంటిని చక్కదిద్దుకునే యత్నమంటూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేయడం స్థానిక జనావళికి ఏ మాత్రం మింగుడు పడేది కాదు! కీలక సరిహద్దు రాష్ట్రంలో అంచెలవారీ స్థానిక పాలనకు ఊతమిచ్చేలా సత్వర ఎన్నికలతో ప్రజాతంత్ర క్రతువును నిష్ఠగా నిర్వహిస్తున్న కేంద్రప్రభుత్వం- వాజ్‌పేయీ ప్రస్తావించిన తక్కిన రెండు సూత్రాలపైనా దృష్టి సారించాలి.
కారుణ్యం, సమాచార మార్పిడి, సహజీవనం, విశ్వాస పరికల్పన, విధానాల్లో స్థిరత్వం అనే పంచశీలతో చిరశాంతికి పాదుచేస్తామని 2017లో మోదీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వాటిలో ఒకటైన విశ్వాస పరికల్పన- నేటి అవసరం. భిన్నవాదనలతో ప్రజల ముందుకు వెళ్ళి వారి మద్దతు కూడగట్టడమే ప్రజాస్వామ్య సారం! అయిదేళ్లలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా జమ్మూకశ్మీర్‌ను తీర్చిదిద్ది, పరిస్థితులు కుదుటపడ్డాక రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన ఎన్‌డీఏ సారథ్యం- స్థానిక ఆకాంక్షలకు గొడుగు పట్టే ప్రగతిశీల అజెండాతో గాయపడిన కశ్మీరీల మనసును గెలవాల్సిన సమయమిది. స్థానిక సంస్థల ఆర్థిక సత్తాను పెంచేలా 2018 జనవరిలో ప్రత్యేక పంచాయతీ బడ్జెట్‌తో పీడీపీ-భాజపా ప్రభుత్వం ఎన్నదగిన చొరవ కనబరచింది. దుందుడుకు రాజకీయాలకు భిన్నమైన వినూత్న, విజ్ఞతాయుత చొరవతోనే మానసిక అగాథాన్ని పూడ్చి, కశ్మీరీలతో సౌభ్రాతృత్వ వారధి నిర్మించగలిగేది!