దేశాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య వాయు కాలుష్యం! పంట వ్యర్థాలను రాశులుగా పోసి తగులబెట్టడంవల్ల కాలుష్య ధూమం గాలిలోకి చేరి ప్రజలను ఏ స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేయగలదో కొన్నేళ్లుగా అనుభవమవుతూనే ఉంది. గతంతో పోలిస్తే సమస్య పరిధి ఇప్పుడు మరింత విస్తరించింది. చలికాలం సమీపిస్తుండటంతో వాయవ్య భారతావనికి చెందిన రైతులు పంట కోతలకు రంగం సిద్ధం చేస్తున్నారు. పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించి, కాలుష్యాన్ని కట్టడి చేస్తామని కేంద్రం సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రకటించడమేగానీ- క్షేత్రస్థాయిలో చేస్తోంది శూన్యం! కరోనా మహమ్మారి కారణంగా సమస్య ఈసారి మరింత విజృంభించే ప్రమాదం కొట్టిపారేయలేనిది.
ఊహకందనిది..
పంట వ్యర్థాలను తగులబెట్టడం- పర్యావరణానికి చేటు తెస్తున్న అతిపెద్ద సమస్య. పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాలను దగ్ధం చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. మరో రెండు వారాల్లో వ్యర్థాల పరిమాణం గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది. మునుపటితో పోలిస్తే పరిస్థితులు ఈసారి మరీ తీవ్రంగా ఉన్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు, గాలుల వేగం మందగించడం వంటివి ఈసారి తెరమీదకు వచ్చిన కొత్త సమస్యలు. ఊపిరితిత్తుల పనితీరును దెబ్బకొడుతూ మరోవంక కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. పంట వ్యర్థాలతో అనర్థం ఇలాంటి పరిస్థితుల్లో వాయు కాలుష్యం ముమ్మరిస్తే దానివల్ల తలెత్తే ఆరోగ్య సంక్షోభం ఊహకందనిది!
ప్రభుత్వంపైనా బాధ్యత..
అటవీ పర్యావరణ విభాగాధిపతులు దిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాధికారులతో కిందటివారం విస్తృతంగా చర్చించారు. పర్యావరణానికి చేటు చెయ్యని పద్ధతిలో పంట వ్యర్థాలు వదిలించుకోవడంపై చర్చించి- కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు వారు ప్రయత్నించారు. పంట వ్యర్థాలను త్వరితగతిన కరిగించి, వాటిని సేద్యానికి అక్కరకొచ్చే ఎరువుగా మార్చేందుకు ఉద్దేశించిన 'పుసా డీకంపోజర్' విధానాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ ఈసారి ప్రయోగాత్మకంగా పరీక్షిస్తామని, ఫలితాలనుబట్టి వచ్చే ఏడాది దీన్ని విస్తృతంగా అమల్లోకి తీసుకువస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రయోగాలను మరీ ఇంత ఆలస్యంగా ఎందుకు మొదలుపెట్టారన్నదే ఇక్కడ ప్రశ్న! ఇంటికి మంటలు అంటుకున్న క్షణంలో... నీళ్లకోసం బావిని తవ్వేందుకు తపనపడ్డట్లుగా ఉంది ఈ వ్యవహారం. ఉత్తర భారతాన్ని ఈ సమస్య నాలుగేళ్లుగా వణికిస్తున్నప్పుడు- ప్రయోగాలను వేగంగా పూర్తిచేసి చక్కటి పరిష్కారాలతో ముందుకు రావలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దిల్లీలో ఇప్పటికే వాయు నాణ్యత దిగనాసిగా ఉంది. ఉరుముతున్న కాలుష్యం దిల్లీ పరిసర ప్రాంత ప్రజల జీవనాన్ని దుర్బరంగా మారుస్తోంది. సాధారణంగా అక్టోబరు మాసం తరవాత దిల్లీ గగనతలం కాలుష్యభరితంగా మారుతూ ఉంటుంది. పంట వ్యర్థాలను విచ్చలవిడిగా మంటల్లో కాల్చేయడమే ఇందుకు ముఖ్య కారణం.
నిర్దిష్ట కార్యాచరణతోనే..
పంట వ్యర్థాలను ఎలా వదిలించుకోవచ్చన్న దానిపై దిల్లీలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ కొన్ని రోజుల క్రితం ప్రయత్నాలు మొదలయ్యాయి. నిజానికి ఈ ప్రయోగాలన్నీ మే లేదా జూన్ నెలల్లో మొదలుపెట్టి ఉంటే ఇప్పటికి ఫలితాలపై ఒక స్పష్టత వచ్చేది. రెండు పంటల మధ్యకాలంలో వ్యర్థాలను వదిలించుకోవడానికి చాలినంత సమయం లేక రైతులు వాటిని సాధారణంగా తగులబెడుతుంటారు. వ్యర్థాలపై ప్రయోగాలు చేస్తున్నవారు ఈ విషయాన్ని గుర్తించారా అన్నది తేలాల్సి ఉంది. వాయు కాలుష్యం, వ్యర్థాలను తగులబెట్టడం వంటి సమస్యలను నిర్దిష్ట కార్యాచరణతోనే ఎదుర్కొనగలం. అమలు గతి పట్టించుకోకుండా కేవలం ప్రణాళిక పత్రాలు తయారు చేసుకుంటూ వెళ్ళినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. కరోనా నేపథ్యంలో వాయు కాలుష్యం మానవ ఆరోగ్యానికి పెను సవాళ్లు విసురుతోంది. శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నవారికి కాలుష్యం ఏ స్థాయిలో ఇబ్బంది కలిగిస్తుందో కొత్తగా చెప్పనవసరం లేదు. కాలుష్యానికి వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సమీక్షించడానికి 'వార్ రూమ్'ను ఏర్పాటు చేయనున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు. కాలుష్యంవల్ల ఊపిరితిత్తులకు కలిగే ప్రమాదాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సమగ్ర కార్యాచరణతో సత్వరం ముందుకు రావాల్సి ఉంది. ప్రజారోగ్యాన్ని, కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ముందడుగు వేయాల్సిన సందర్భమిది.
- నియమిక సింగ్
ఇదీ చూడండి: భారత్‌లోని ఆ 8 బీచ్‌లకు 'బ్లూ ఫ్లాగ్' గుర్తింపు