ETV Bharat / opinion

2020 రివ్యూ: భారత్​ వ్యూహాత్మక ప్రస్థానం

మానవ జీవన గతిని మార్చేసిన సంవత్సరం 2020. కరోనాతో పాటు మరెన్నో సంక్షోభాలకు నెలవైంది. ఓ వైపు కరోనా దెబ్బకు ప్రపంచమంతా విలవిలలాడుతూంటే సందట్లో సడేమియాలాగా చైనా తన పన్నాగాలకు మరింత పదును పెట్టింది. భారత సరిహద్దుల్లో అలజడులు సృష్టించి.. ఆక్రమణలకు పాల్పడటం వంటి వింత పోకడలతో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు అడ్డదారులు తొక్కుతోంది. మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, కరోనా టీకాపై ఆధిపత్యం సరేసరి. ఈ నేపథ్యంలో ప్రపంచ యవనికపై భారత్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది.?

china policies are dangerous to world
చైనా దుందుడుకు చర్యలకు​ కళ్లెం వేయాల్సిందే
author img

By

Published : Dec 28, 2020, 7:31 AM IST

2020 సంవత్సరం.. గడచిన వందేళ్లలో ఇంతలా చరిత్ర గతిని మార్చేసిన, మార్చేయబోతున్న సంవత్సరం మరొకటి లేదు. కరోనా మహమ్మారిని వెంట తీసుకొచ్చిన ఈ సంవత్సరం మనకు తెలిసిన జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రపంచమంతా ఆ వైరస్‌ను కట్టడి చేయడానికి సతమతమవుతుంటే, ఇదే సందు అనుకుని చైనా భారత సరిహద్దులో చొరబాట్లకు దిగింది. మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్‌ సరస్సు వద్ద రెండు దేశాల సైనికులు ముఖాముఖి తలపడ్డారు. తరవాత జూన్‌లో చైనీయుల దొంగదాడిలో 20మంది భారత జవాన్లు మరణించారు. చైనా పక్షాన భారీ ప్రాణనష్టం జరిగినా, బీజింగ్‌ వివరాలు బయటపెట్టలేదు. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలు మొదలుకొని హిమాలయాల వరకు చైనా దుందుడుకు పోకడలు పేట్రేగాయి. దీంతో ఇంతకాలం కాగితాలపైనే ఉన్న చతుర్భుజి(క్వాడ్‌)ని వ్యూహపరంగా ముందుకు తీసుకెళ్లడానికి అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ అడుగులు వేస్తున్నాయి. క్వాడ్‌ సభ్యులైన భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబెలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ ప్రతిష్ఠాత్మక పురస్కారమైన లీజియన్‌ ఆఫ్‌ మెరిట్‌ను ప్రకటించారు. ఇది చైనా దూకుడుకు పగ్గాలు వేయాలన్న అగ్రరాజ్య తపనకు అద్దం పడుతోంది.

బీజింగ్‌ పన్నాగాలకు 'క్వాడ్‌'తో కళ్లెం!..

క్వాడ్‌ ప్రధానంగా చైనాపై ఎక్కుపెట్టినదే అయినా, ఇది భారత్‌ చిరకాల నేస్తం రష్యాకు ఆందోళన కలిగిస్తోంది. దిల్లీ ఇక అమెరికా ప్రాబల్యంలోకి వెళ్లిపోతుందని మాస్కో కలవరం. అమెరికా సైతం భారత్‌ మీమాంస విడిచిపెట్టి చైనాతో నేరుగా ఢీకొనాలని తొందరపెడుతోంది. ప్రస్తుతం సంప్రదింపుల వేదికగా ఉన్న క్వాడ్‌ ఇక సాధికారంగా వ్యవస్థాగత రూపం ధరించడమే తరువాయి. మరోవైపు అమెరికా స్థానంలో తానే అగ్రరాజ్యంగా ఎదగాలని చైనా ఆరాటపడుతోంది. తన విస్తరణ కాంక్షకు భారత్‌ అడ్డుతగిలే అవకాశం ఉంది కాబట్టి మన పొరుగు దేశాలను దూరం చేయాలని చూస్తోంది. భారత్‌కు అత్యంత సన్నిహిత నేస్తమైన నేపాల్‌లో బీజింగ్‌ పన్నాగాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. వీటిని భగ్నం చేయడానికి భారతదేశమూ బరిలో దిగింది. నేపాల్‌తో భౌగోళిక విభేదాలను పరిష్కరించుకోవడానికి భారత ప్రభుత్వ ప్రతినిధులు నేపాలీ సర్కారుతో చర్చలు జరుపుతున్నారు. బ్రహ్మపుత్ర మీద 60 గిగావాట్ల భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మించడానికి చైనా సమాయత్తం కావడం భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌కూ ఆందోళనకరమే. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద డామ్‌ అయిన త్రీగోర్జెస్‌నూ మించిపోనున్న బ్రహ్మపుత్ర ప్రాజెక్టుకు చైనా కొత్త పంచవర్ష ప్రణాళికలో స్థానం కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు బంగ్లాను ఆర్థికంగా దెబ్బతీసి, లక్షల సంఖ్యలో శరణార్థులు భారత్‌కు వలస వచ్చేలా పురిగొల్పుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను తమ ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో కీలక భాగస్వామిగా చేర్చుకోవాలనుకొంటున్నామని అమెరికా ప్రకటించింది. నేపాల్‌కు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రతిపాదించడం ద్వారా ఆ దేశం చైనా పరిధిలోకి వెళ్లిపోకుండా అడ్డుకోవాలని చూస్తోంది.

ఇదీ చదవండి: బ్రెగ్జిట్ వాణిజ్య​ ఒప్పందంతో భారత్​కు లాభమెంత?

చైనా కుత్సిత వ్యూహాలు..

త్వరలో ఐరోపా సమాఖ్య (ఈయూ), చైనాల మధ్య సమగ్ర పెట్టుబడుల ఒప్పందం కుదరనున్నది. అయితే ఈ విషయంలో తొందరపడవద్దని బైడెన్‌ సర్కారు ఒత్తిడి తెస్తోంది. దీన్ని కాదని ఈయూ ముందుకువెళుతుందా అన్నది కీలక ప్రశ్న. ట్రంప్‌ జమానాలో ఈయూతోపాటు అనేక చిరకాల నేస్తాలు అమెరికాకు దూరమయ్యాయి. బైడెన్‌ ఆ తప్పును సరిదిద్దబోతున్నారు. ఈయూ చైనా ప్రాబల్యంలోకి వెళ్లకుండా ఆర్థిక, వ్యూహపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఫలితంగా అంతర్జాతీయ వ్యూహ సమీకరణలు అట్లాంటిక్‌ మహాసముద్రం నుంచి ఇండో-పసిఫిక్‌కు మారనున్నాయి. అందుకే భారతదేశం ఐరోపా దేశాలతో వ్యాపార, వ్యూహపరమైన సంబంధాలను పటిష్ఠం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. హిందూ మహాసముద్ర తీర దేశాల సంఘంలో ఫ్రాన్స్‌కు సభ్యత్వం కల్పించడానికి గట్టిగా కృషిచేస్తోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో జర్మనీ, నెదర్లాండ్స్‌ల భాగస్వామ్యాన్ని స్వాగతిస్తోంది. ఈయూకు దూరం జరుగుతున్న బ్రిటన్‌తో ఆర్థిక సహకారం పెంచుకోవడానికి అడుగులు వేస్తోంది. మున్ముందు అమెరికా-చైనాల మధ్య ముదరనున్న వైరంలో పూర్తిగా అమెరికావైపు మొగ్గకుండా తనకంటూ కార్యనిర్వహణ స్వేచ్ఛ ఉండాలని దిల్లీ ఆశిస్తోంది. భారత్‌ బహుళధ్రువ ప్రపంచాన్ని కోరుకుంటుంటే చైనా ద్విధ్రువత్వాన్ని సాధించాలనుకొంటోంది. దీనికి తన ఆర్థిక ఆధిపత్యాన్ని సాధనంగా చేసుకొంటోంది. సైబర్‌ గూఢచర్యంతో ఇతర దేశాల్లోకి చొచ్చుకుపోతోంది.

పేద దేశాలకూ టీకా అందించనున్న ఇండియా..

ట్రంప్‌ హయాములో తీవ్ర సమస్యాత్మకంగా మారిన హెచ్‌ 1బి వీసాల విషయంలో బైడెన్‌ భారత్‌కు ఉపకారం చేసే విధానాలను చేపట్టనున్నారు. భారత్‌ తదితర క్వాడ్‌ దేశాలను, ఐరోపానూ కలుపుకొనిపోతూ చైనా పట్ల కటువైన వైఖరి అవలంబించనున్నారు. రుణ ప్రలోభాలతో వర్ధమాన దేశాలను తన పరిధిలోకి లాక్కుంటున్న చైనాను నియంత్రించి నిజమైన అంతర్జాతీయ సహకారం సాధించడానికి కృషి జరగనుంది. ఈ కృషిలో భారత్‌ చురుకైన పాత్ర పోషించనున్నది. కొవిడ్‌ టీకాల ఉత్పత్తి, పంపిణీలో భారత్‌ పోషించబోయే కీలక పాత్ర దీనికి నిదర్శనం. ఈ టీకాలను సంపన్న దేశాలు గుండుగుత్తగా కొనుగోలు చేస్తుంటే, పేద దేశాలు బిక్కమొహం వేస్తున్నాయి. ఆ దేశాలకు భారత్‌ సరసమైన ధరలకు టీకాలు అందించబోతున్నది. సైబర్‌ భద్రత, అంతరిక్ష శోధన, వాతావరణ మార్పుల నిరోధంలో అమెరికా, చైనాల వైరుధ్యాలు ప్రస్ఫుటమవుతున్నాయి. చైనా సైబర్‌ గూఢచర్యంతో తమ రహస్యాలను కాజేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ట్రంప్‌ పారిస్‌ వాతావరణ ఒప్పందాన్ని తుంగలో తొక్కగా, చైనా ఎలెక్ట్రిక్‌ వాహనాల వాడకంతో కాలుష్యానికి అడ్డుకట్టవేయాలనుకొంటోంది. భారతదేశం పారిస్‌ వాతావరణ ఒప్పంద లక్ష్యాల సాధనలో అందరికన్నా ముందంజలో ఉంది. చంద్ర, కుజ గ్రహాల వద్దకు రాకెట్లను ప్రయోగించడం ద్వారా అంతరిక్ష శోధనలో అగ్రగామినని చాటుకొన్నది. ఏతావతా రానున్న దశాబ్దంలో అమెరికా కానీ, చైనా కానీ ఏకచ్ఛత్రాధిపత్యం వహించే అవకాశం లేదు. పరస్పర సహకారంతోనే ప్రపంచం పురోగమించగలుగుతుంది. రాబోయేది బహుళ ధ్రువ ప్రపంచమేనని గమనించి భారత్‌ తదనుగుణమైన విధానాలను చేపట్టాలి.

ఇదీ చదవండి: బ్రిటన్-ఈయూ మధ్య ఎట్టకేలకు కుదిరిన ఒప్పందం​

ఐరాస ధోరణిపై అసంతృప్తి..

ఐక్యరాజ్యసమితిలో చైనా ప్రాబల్యం పెరిగిపోవడం అమెరికాతోపాటు భారత్‌కూ రుచించడం లేదు. సమితి 75వ వార్షికోత్సవంలో, సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అసంతృప్తిని వెలిబుచ్చారు. మారుతున్న కాలానికి తగినట్లు ఐక్యరాజ్యసమితి కూడా మారాలని పిలుపిచ్చారు. భద్రతా మండలిలో వీటో అధికారం గల శాశ్వత సభ్యదేశ హోదా కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా పూర్తి మద్దతు ఇస్తానంటున్నా- చైనా మోకాలడ్డుతోంది. భారత్‌-అమెరికా వ్యూహాత్మక సహకార ఒప్పంద నిర్మాతల్లో ఒకరైన జో బైడెన్‌ దిల్లీకి మద్దతు కొనసాగించనున్నారు.

- ఏఏవీ ప్రసాద్​

ఇదీ చదవండి: చైనాలో అట్టహాసంగా కొత్త ఏడాది వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.