కరోనా దెబ్బకు అతలాకుతలమైన రంగాల్లో పర్యటకం ముఖ్యమైనది. ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఏడాది కాలంగా ఉపాధి కోల్పోయారు. కరోనా తగ్గుముఖం పట్టడం, టీకా అందుబాటులోకి రావడంతో అన్ని రంగాలూ తేరుకుంటున్నాయి. వాటితోపాటే పర్యటకంపైనా ఆశలు చిగురిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడంలో ఈ రంగానిది కీలక పాత్ర. చలనచిత్ర, ఆరోగ్య, ఆధ్యాత్మిక, పర్యావరణ, క్రీడ, సాంస్కృతిక, వైద్య, సాహస క్రీడల విభాగాల్లో పర్యటకపరంగా భారత్‌కు మంచి పేరుంది. విభిన్న మతాలు, సంస్కృతులు, వారసత్వాలు, ప్రాంతాలు, వాతావరణాలతో పర్యటకానికి భారత్ పట్టుగొమ్మలా మారింది. ఆధ్యాత్మిక పర్యటకం దేశ, విదేశీ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచ ఆర్థిక వేదిక 2019లో వెలువరించిన ప్రయాణ, పర్యటక పోటీ నివేదికలో భారత్ స్థానం 34. ఇందులో మరింత మెరుగైన స్థానం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సన్నాహాల్ని ముమ్మరం చేసింది. 2022 నాటికి పర్యటకానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు దేశంలోని 15 ప్రముఖ పర్యటక స్థలాలను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే ప్రజలకు పిలుపిచ్చారు. అంతలోనే కొవిడ్ మహమ్మారి విరుచుకుపడటంతో పర్యటక రంగం కుదేలైంది. తాజా పరిణామాలతో పర్యటకుల సంఖ్య పెరిగి, గత వైభవం దిశగా అడుగులు పడతాయనే ఆశాభావం ఇప్పుడిప్పుడే ఏర్పడుతోంది.
ప్రణాళికలతో ముందుకు
ప్రపంచ ఆర్థిక వేదిక 2019 నివేదిక ప్రకారం మన జీడీపీలో ప్రయాణ, పర్యటక రంగం వాటా 4.9 శాతం. 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లలో మన దేశంలో ఈ రంగం 63 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి మన దేశంలో పర్యటక రంగం దాదాపు 3.9 కోట్ల మందికి ఉపాధి చూపింది. దేశంలో పర్యటక రంగానికి ఉన్న అపార అవకాశాలను చాన్నాళ్లక్రితమే గుర్తించడంతో ఇన్‌క్రెడిబుల్ ఇండియా, అతిథిదేవోభవ వంటి ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభించారు. స్వదేశ్ దర్శన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని 77 పర్యటక ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.6,035 కోట్లు కేటాయించింది. 2020-21 బడ్జెట్‌లో ఇదే పథకం కింద ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటక సర్క్యూట్ల అభివృద్ధికి మరో రూ.1,200 కోట్లు ఇస్తామని ప్రకటించింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనదేశంలో తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యం అందుతుండటంతో అభివృద్ధి చెందుతున్న దేశాలు, తృతీయ ప్రపంచ దేశాల ప్రజలు వైద్యం కోసం భారత్‌కు వస్తున్నారు. దీన్నే వైద్య పర్యటకంగా పిలుస్తున్నారు. దీనికోసం విదేశీయులకు మెడికల్ వీసా (ఎం-వీసా) జారీ ప్రక్రియను ప్రభుత్వం సరళతరం చేసింది.
నిలిచిన కేరళ
2018, 2019 వరదలు, 2020లో కరోనా కారణంగా పర్యటక రంగం తలకిందులైనా, కేరళ రాష్ట్రం తట్టుకొని నిలబడింది. 2018లో పర్యటకుల రాక బాగా తగ్గిపోయినా 2019లో పుంజుకుంది. ఆ సంవత్సరం దేశ, విదేశీ పర్యటకుల రాకలో 17.2 శాతం వృద్ధి నమోదవడం విశేషం. గత 24 సంవత్సరాల్లో ఇదే అత్యధికం. 2019లో దాదాపు 1.96 కోట్ల మంది పర్యటకులు కేరళలో పర్యటించారు. తద్వారా రూ.4,500 కోట్ల ఆదాయాన్ని సముపార్జించినట్లు నివేదికలు చెబుతున్నాయి. పర్యటక రంగానికి సరికొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇటీవలే ఏపీ సర్కారు కొత్త పర్యటక విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నష్టాల్లో ఉన్న హోటళ్లకు రుణాలు ఇప్పించడం, కొన్నాళ్లపాటు రుణ చెల్లింపులపై మారటోరియం విధించి ఆ సమయంలో వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించడం వంటి ప్రోత్సాహకాలను ప్రకటించింది. పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించి మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు నిర్ణయించింది. తెలంగాణలోనూ పర్యటక రంగాన్ని గట్టెక్కించే చర్యలు మొదలయ్యాయి. కరోనా పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది.
విదేశీ పెట్టుబడులు
పర్యటక రంగంపై ఆధారపడిన దాదాపు 5.5 కోట్ల మందిలో 70 శాతం నిరుద్యోగులుగా మారే ప్రమాదముందంటూ 'భారతీయ పర్యటక, ఆతిథ్యరంగ సంఘాల సమాఖ్య' ఇటీవల ప్రధాని మోదీకి రాసిన లేఖలో వివరించింది. ఈ రంగం కోలుకునే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. కొవిడ్ నుంచి దేశం కోలుకుంటున్న నేపథ్యంలో పర్యటక రంగ అభివృద్ధికి దారి చూపాలంటూ 'భారత పర్యటక నిర్వాహకుల సంఘం(ఐఏటీఓ)' కూడా ఇటీవల ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలను పునరుద్ధరించడం, ఈ-వీసాలు, పర్యటక వీసాల జారీని సులభతరం చేయడానికి ఓ మార్గసూచీని రూపొందించాలంటూ అభ్యర్థించింది. దీంతో ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెట్టింది. ముందుగా దక్షిణాసియా దేశాల పర్యటకులు, ప్రయాణికులు దేశంలోకి రావడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఆతిథ్య, పర్యటక రంగాల్లో వందశాతం పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలను అనుమతించే దిశగా గట్టి కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ప్రణాళికలు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ప్రయత్నాలు ఫలప్రదమై దేశంలో పర్యటక రంగానికి గత వైభవం దక్కితే దేశానికి ఆర్థికంగా, ఉపాధిపరంగా ఎంతో మేలు జరుగుతుంది.
- కృష్ణంరాజు తాళ్ల , రచయిత
ఇదీ చదవండి: తూర్పు లద్దాఖ్‌లో చైనా నయవంచన!