రెండెకరాలున్న రైతులు ఓ పది కోళ్లు, రెండు పాడి గేదెలు, నాలుగైదు జీవాలను పోషించుకోగలిగితే- ఇంటి అవసరాలకు కావలసిన మొత్తం ఏదో ఒక రూపంలో సమయానుకూలంగా అందుతుంటుంది. అలాగే పెరడులోని ఖాళీ స్థలంలో కూరగాయలు సాగు చేసి ఇంటికి కావలసినవి తీసి పక్కన పెట్టుకుని మిగిలిన పంటను మార్కెట్లో అమ్ముకోవాలి. దీనినే సమగ్ర వ్యవసాయ విధానమంటారు. వేణ్నీళ్లకు చన్నీళ్లలా ఇలా రైతు ఆదాయం బహుముఖంగా విస్తరిస్తున్న కొద్దీ చేతిలో రూపాయి లేదనే చింత ఉండబోదు. ఇది కొత్త పద్ధతేమీ కాదు. ఇలా గుడ్లు, పాలు, పెరుగు, మాంసం, కూరగాయలు, టెంకాయ, రెండెకరాల్లో వేసిన పంటల నుంచి వచ్చే ఫలసాయం విక్రయిస్తూ నిత్యం చేతిలో డబ్బులు ఉంచుకునే శక్తి రైతులకు ఉంటుంది. కవ్వ మాడిన ఇంట కాసులుండు అనే సామెత ఉండనే ఉంది. చిన్న రైతులిలా సమగ్ర సేద్య పద్ధతులు ఆచరిస్తూ బహుముఖ ఆదాయాన్ని పొందగలిగితే ఇంటి ఖర్చులను తీర్చుకోవడంతో పాటు లాభసాటి సేద్యానికి మార్గం సుగమం చేసుకోగలుగుతారు. గ్రామసీమల్లో ఇటువంటి ఆరోగ్యకర పరిస్థితులే తిరిగి పండగ వాతావరణాన్ని నెలకొల్పగలుగుతాయి.
అవరోధాల ముళ్లబాటలో సాగే రైతులు తమ జీవనాన్ని సుఖమయం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. దేశంలో 86శాతం చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వీరంతా అప్పుల సేద్యంతో తిప్పలు పడుతున్నవారే. సేద్యాన్ని లాభసాటిగా మార్చుకునే అవకాశాలు అందుబాటులో ఉన్నా సమగ్ర వ్యవసాయ విధానాలకు దూరంగా జరిగి నష్టాలతో సహవాసం చేస్తున్నారు. సేద్యంలో లాభమైనా నష్టమైనా అది మనం అనుసరించే విధానాన్ని బట్టే ఉంటుంది. పావు ఎకరం నుంచి రెండు మూడు ఎకరాల పొలంలోనే సమగ్ర వ్యవసాయ విధానాలు ఆచరించి శెహభాష్ అనిపించుకున్న వారి స్ఫూర్తి నేటి రైతులకు ఆచరణీయం.
ప్రణాళికాబద్ధంగా ముందుకు...
సేద్యం ఆధునికతను సంతరించుకుంటూ దిగుబడుల సాధనలో రికార్డులు బద్దలవుతున్నా సగటు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. నైపుణ్యాలకు సానపట్టడం ఎంత ముఖ్యమో సమగ్ర సేద్య పద్ధతులను అనుసరించడమూ అంతే ప్రధానం. బడుగు రైతులు బతికి బట్టకట్టాలంటే సాగు ఖర్చులు తగ్గించుకుంటూ నేలను కాపాడుకునేలా ద్విముఖ వ్యూహాలు అనుసరించడం తప్ప, గత్యంతరం లేదు. ఇటీవలి కాలంలో సంప్రదాయ సేద్య రీతుల్ని అనుసరించిన రైతులందరివీ విజయగాథలే. ఆరోగ్యకరమైన జీవనాన్ని అందుకోవాలంటే ప్రాకృతిక సాగు తప్పనిసరి. కొందరు ఎకరా రెండెకరాలతోనే లాభాల బాట పడుతున్నారు. మరికొందరు పదెకరాలు సాగు చేసినా సరైన ఫలితాలు అందుకోలేకపోతున్నారు. ఇందుకు కారణాలను, దొర్లుతున్న తప్పిదాలను విశ్లేషించి పాఠాలు నేర్చే ఓపిక, శ్రద్ధ సైతం రైతులకు ఉండటం లేదు.
పొలాన్ని చిన్న చిన్న మడులుగా విభజించుకుని పలు రకాల ఆకుకూరలను ఒకదాని తరవాత ఒక పంట వచ్చేలా ప్రణాళిక ప్రకారం సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నవారున్నారు. పరిస్థితులకు తగ్గట్టు సేద్యం చేయడం, మార్కెట్ తీరుతెన్నులను విశ్లేషించుకునే శక్తి, స్థానిక మార్కెట్లే లక్ష్యంగా సాగుకు దిగడం వంటి వ్యూహాలు వారిని విజయపథంలో నిలబెడుతున్నాయి. కేరళలోని కన్నూర్ జిల్లా కొక్కదావ్ గ్రామానికి చెందిన జోషీ మాథ్యూ అతడి భార్య జూలీ- ఇద్దరూ సమగ్ర వ్యవసాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. వారికున్న పాతిక సెంట్ల భూమిలో పండ్లు, కూరగాయ చెట్లతో పాటు కోళ్లు, బాతులు ఇంటి వెనక స్థలంలో ఉన్న చిన్న నీటి కుంటలో చేపల్ని, పండ్ల తోటల మధ్య తేనెటీగలను పెంచుతున్నారు. ఇలా గుడ్లు, మాంసం, చేపలు, తేనె, పండ్లు, కూరగాయలను విక్రయించడం ద్వారా తమ కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నారు. సేద్యాన్ని, జీవితాన్ని లాభసాటిగా మలచుకోగలిగారు. పంటల సాగంటే రైతుకు విధిగా ఒక ప్రణాళిక ఉండితీరాలి. ఒక వినియోగదారుడిగా రైతుకు నిత్య జీవితంలో అవసరమయ్యేవి, అంగట్లో కొనేవాటిని సాధ్యమైనంత వరకు వారి చేలోనే పండించేలా ఉండాలి. ఆదర్శ తెలుగు రైతు గుడివాడ నాగరత్నం నాయుడు అనుభవ సారమిదే. ధాన్యం, పాలు పెరుగు, పసుపు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి బొండాం, టెంకాయ, కూరగాయలు, ఆకుకూరలు... ఇలా ఇంటి అవసరాలకు సరిపడా పొలం నుంచి పొందినవాడే నిజమైన రైతు అంటారాయన. పేద రైతులు తమకున్న రెండెకరాలను ఇలా తీర్చిదిద్దుకోగలిగితే ఏ రైతూ నష్టపోయే దుస్థితి రాదు. రంగారెడ్డి జిల్లా అమీర్‌పేట రైతు సుఖవాసి హరిబాబు, హైదరాబాదుకు చెందిన పైడిమర్రి చంద్రశేఖర్‌ల వ్యవసాయ విధానాలు పదుగురికీ స్ఫూర్తినిస్తున్నాయి. ప్రకృతి సేద్యంలో వారు అనుసరిస్తున్న పద్ధతులను చూసి నేర్చుకునేందుకు పలు రాష్ట్రాల నుంచి రైతులు వస్తున్నారు. అలాగే తెనాలి ప్రాంతం అనంతవరం రైతు కాకాని శివన్నారాయణ ప్రకృతి వ్యవసాయంలో సాధించిన ఫలితాలకు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రశంసలు దక్కాయి. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో ఆయన తన సాగు ఖర్చుల్ని ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.3,500కి తగ్గించుకుని ఎకరాకు రూ.70వేల ఆదాయం పొందుతున్నారు. వీరి కష్టాన్ని గుర్తించిన ప్రపంచ ఆహార కార్యక్రమం వారు ఆయన అనుసరించిన సాగు విధానంపై ఒక లఘు చిత్రాన్ని నిర్మించారు.
లాభాల సాగు
భూమి నుంచి సాధ్యమైనంత వరకు పోషకాలను గుంజేసుకుంటూ చేసే సేద్యంవల్ల భూసారం క్షీణించి నేలలు నిస్సారమవుతున్నాయి. పంటను ఆశించే చీడపీడలు పురుగుమందుల్ని తట్టుకునే శక్తిని సంపాదించుకున్న ప్రతిసారీ అంతకంటే గాఢత కలిగిన మందులు చల్లాల్సి వస్తోంది. కృష్ణా జిల్లాతోపాటు వికారాబాద్‌లో పలు రకాల పంటలు పండిస్తున్న ప్రకృతి రైతు విజయరామ్ కనీసం చరవాణి కూడా వాడరు. దేశీయ వంగడాలకు పెద్దపీట వేసి ఆయన చేసే సేద్యం అత్యంత నాణ్యత కలిగి ఉంటుంది. ఇలాంటి నాణ్యత కలిగిన సేంద్రియ ఉత్పత్తుల కోసం మళ్లీ వినియోగదారులు కొందరు అధిక ధరలు పెట్టి కొనుగోలు చేస్తుండటమే విచిత్రం. సంప్రదాయ విత్తనాలతో సేద్యంలో మూడు బస్తాలు తక్కువైనా నేల సారం బాగుంటుంది. రసాయన రహిత వ్యవసాయానికి భూమి అలవాటు పడి మూడేళ్లలో మంచి దిగుబడులు వచ్చేలా చేస్తుంది. సంప్రదాయ సేద్యంలో దిగుబడులు తగ్గుతాయనే భయాలున్నాయి. ఓపిక పడితే దానివల్ల మానవాళికి చేకూరే ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన చెబుతున్నారు. సేంద్రియ సేద్య విధానాలకు ప్రాచుర్యం లభించడంవల్ల ముందు సాగు ఖర్చులు తగ్గుతాయి. నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. నేల ఆరోగ్యంగా ఉంటుంది. పర్యావరణంపై దుష్ప్రభావాలు ఉండవు. బహుముఖంగా విస్తరించి వ్యవసాయాన్ని ఫలప్రదంగా తీర్చిదిద్దుకొంటేనే రైతన్నకు నిజమైన సంక్రాంతి.
- అమిర్నేని హరికృష్ణ