ETV Bharat / opinion

ట్రంప్‌ రాజేసిన నెగళ్లు! అమెరికాలో విద్వేష విషధూమం - అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికాలో ట్రంప్‌ అధికారంలోకి వచ్చిననాటి నుంచే ప్రజాస్వామ్య పునాదులపై దెబ్బకొడుతూ వచ్చారు. నియమబద్ధంగా నడుచుకునే అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. ఉన్నతాధికారులను, మంత్రులను చీటికిమాటికి తొలగించడమే కాదు- ప్రభుత్వ పదవుల్లో ఖాళీలను భర్తీచేయకుండా వదిలేశారు. గూఢచారి నివేదికలపై అపనమ్మకం వ్యక్తంచేస్తూ ఆ యంత్రాంగం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం వంటి దుందుడుకు చేష్టలతో అమెరికా పాలనా వ్యవస్థను బలహీనపరచారు.

American
ట్రంప్‌ రాజేసిన నెగళ్లు! అమెరికాలో విద్వేష విషధూమం
author img

By

Published : Jan 20, 2021, 5:31 AM IST

నాలుగేళ్ల క్రితం వరకు ప్రజాస్వామ్యానికి, న్యాయపాలనకు ఆదర్శంగా వెలిగిన అమెరికా నేడు తిరుగుబాట్లతో అధికారం చేతులు మారే నియంతృత్వ దేశాలను తలపిస్తోందంటే- అదంతా... డొనాల్డ్‌ ట్రంప్‌ చలవే. కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బైడెన్‌, కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా దేశమంతటా ట్రంప్‌ అనుయాయులు సాయుధ తిరుగుబాటుకు పాల్పడవచ్చని, అందులో భద్రతాదళాల సభ్యులూ పాల్గొనే ప్రమాదం ఉందని ఎఫ్‌.బి.ఐ. అనుమానిస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి వాషింగ్టన్‌లో ఏకంగా 25,000 మంది నేషనల్‌ గార్డ్స్‌ సిబ్బందిని మోహరించారు. సాధారణంగా అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి ఎనిమిది నుంచి 10 వేల మంది భద్రతా సిబ్బందిని నియోగిస్తారు. ఈసారి తిరుగుబాటు భయంతో అంతకు రెండున్నర రెట్లమందిని మోహరించడమే కాదు- వారి భావజాలం, పూర్వాపరాల గురించి వారంరోజుల ముందు నుంచే ఆరాతీసి మరీ వాషింగ్టన్‌కు పంపారు. సాయుధ తిరుగుబాట్లతో సైనిక నియంతలు అధికారంలోకి రావడం ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల్లో జరుగుతుందే తప్ప ప్రజాస్వామ్య జ్యోతి అయిన అమెరికాలో జరగనే జరగదని భావించినవారంతా ట్రంప్‌ అనుయాయుల దెబ్బకు బిత్తరపోయారు. ఈ విపరిణామం ఆకస్మికమేమీ కాదు.

యంత్రాంగం నిర్వీర్యం

ట్రంప్‌ అధికారంలోకి వచ్చిననాటి నుంచే ప్రజాస్వామ్య పునాదులపై దెబ్బకొడుతూ వచ్చారు. నియమబద్ధంగా నడుచుకునే అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. ఉన్నతాధికారులను, మంత్రులను చీటికిమాటికి తొలగించడమే కాదు- ప్రభుత్వ పదవుల్లో ఖాళీలను భర్తీచేయకుండా వదిలేశారు. గూఢచారి నివేదికలపై అపనమ్మకం వ్యక్తంచేస్తూ ఆ యంత్రాంగం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం వంటి దుందుడుకు చేష్టలతో అమెరికా పాలనా వ్యవస్థను బలహీనపరచారు.

అమెరికాలో శ్వేతజాతివారు 2045కల్లా మైనారిటీగా మారిపోతారని 2018 జన గణనలో తేలినప్పటి నుంచి వారిలో అభద్రతా భావం పెరిగింది. దీనికి తోడు నల్లజాతివారి పట్ల దుర్విచక్షణ ఉండనే ఉంది. ప్రజల్లో జాతిపరంగా, రాజకీయ పరంగా ఏర్పడిన చీలికను అంతర్జాలంలో వ్యాపించిన తప్పుడు ప్రచారాలు, కుట్ర సిద్ధాంతాలు మరింత తీవ్రం చేశాయి. శ్వేతజాత్యహంకారులు, అతిమితవాదులు పాకించిన వెర్రిమొర్రి సిద్ధాంతాలకు ట్రంప్‌ తన అబద్ధాలతో వంతపాడారు. 2020 అధ్యక్ష ఎన్నికలకు ముందు నుంచే తపాలా ఓటింగ్‌లో పెద్ద మోసం జరుగుతుందని సామాజిక మాధ్యమాల్లో ఒక ఉద్యమంగా వదంతులు వ్యాపించాయి. విజయాన్ని తన చేతుల్లోనుంచి లాగేసుకుని జో బైడెన్‌ అక్రమంగా గెలిచారని ట్వీట్‌ చేయడం ద్వారా ట్రంప్‌ ఈ వదంతులకు ప్రాణం పోసి పార్లమెంటుపై దాడికి ఊతమిచ్చారు. ఈ ఉదంతంలో పాల్గొని దోషారోపణకు గురైన కొందరు అతిమితవాద సంస్థల సభ్యులు పార్లమెంటు (క్యాపిటల్‌ హిల్‌) భవనంపై దాడి చేయాలని కొన్ని వారాల ముందు నుంచే ఆన్‌లైన్‌లో సంభాషించుకున్నారు. ఈ అతిమితవాదుల్లో క్యుఏనన్‌ వర్గం తీరే వేరు. ప్రభుత్వ, వ్యాపార వర్గాల్లో, సమాచార సాధనాల్లో కొందరు ప్రచ్ఛన్న కుట్రదారులు ఉన్నారని, వారు బాలలతో వికృతి రతి జరుపుతూ సైతానును ఆరాధించే దుష్టులని క్యుఏనన్‌ వర్గీయులు నమ్ముతారు. ఈ ప్రచ్ఛన్న కుట్రదారులు ట్రంప్‌ను గద్దె దించాలని పన్నాగం పన్నారని విశ్వసిస్తారు. మరోవైపు మతోన్మాదులు సైతానును ఉటంకిస్తూ ఈ కుట్రవాదాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉద్ధృతంగా వ్యాపింపజేశారు. కొవిడ్‌ కాలంలో ఈ తరహా పిచ్చి సిద్ధాంతాలను నమ్మేవారు ఎక్కువయ్యారు. ఎంతగా అంటే, 2020 మొదట్లోనే ఫేస్‌బుక్‌లో క్యుఏనన్‌ సభ్యులు 581 శాతం పెరిగారు. ఫేస్‌బుక్‌తో పాటు ట్విటర్‌, రెడిట్‌, యూట్యూబ్‌ లలో ఈ బాపతు ప్రచారాలు ఉద్ధృతమయ్యాయి.

అమెరికా కాంగ్రెస్‌ అభ్యర్థులలో 97 మంది క్యుఏనన్‌ సిద్ధాంతాలను సమర్థించారు. వారిలో ఒకరు ఎన్నికయ్యారు కూడా. దీన్నిబట్టి, అతిమితవాదులను ఓటుబ్యాంకుగా పరిగణించే ధోరణి పెరుగుతోందని అవగతమవుతోంది. దీన్ని తమ బలంగా భావించి అతిమితవాదులు ప్రజాస్వామ్యంపై దాడికి తెగించారు. కరోనా నుంచి రక్షణకు మాస్కులు ధరించాలనడం వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి అని వారంతా భావిస్తారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలంతా తప్పక మాస్కులు ధరించాలని ఆదేశిస్తామని, 10 కోట్ల టీకా డోసులు వేస్తామని, విద్యార్థులను మళ్ళీ స్కూళ్లకు పంపుతామని కొత్త ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ డిసెంబరు 29న ట్వీట్‌ చేశారు. దాంతో ఏష్లీ బ్యాబిట్‌ అనే క్యుఏనన్‌ వర్గీయురాలు కమలపై బూతులకు లంకించుకున్నారు. జనవరి ఆరో తేదీన క్యాపిటల్‌పై జరిగిన దాడిలో బ్యాబిట్‌ కూడా పాల్గొని పోలీసు తూటాకు బలైపోయారంటే, క్యుఏనన్‌ కుట్ర సిద్ధాంతాలను ఎంతగా తలకెక్కించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాంటివారు ఎందరో ఉండబట్టి ట్రంప్‌ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైనా రికార్డుస్థాయి ఓట్లు సాధించి, తన విజయాన్ని బైడెన్‌ దొంగిలించారని ఆరోపించగలిగారు. ట్రంప్‌ ఈసారి ఓడిపోయినా 2024 ఎన్నికల్లో మళ్ళీ పోటీచేస్తానంటున్నారు. అబద్ధాలు, వెర్రిమొర్రి సిద్ధాంతాలను నమ్ముతూ ఆయన వెనక నడిచేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి, అమెరికా ప్రజాస్వామ్యానికి ట్రంప్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఈ ముప్పును దృష్టిలో ఉంచుకొని బైడెన్‌, కమల ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ బందోబస్తు చేశారు.

కిమ్మనని రిపబ్లికన్లు...

ట్రంప్‌ ఎంత అప్రజాస్వామికంగా, అస్థిరంగా వ్యవహరిస్తున్నా, పాలక రిపబ్లికన్‌ పార్టీ ఆయన్ను సమర్థిస్తూ వచ్చిందే తప్ప- ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించలేదు. రిపబ్లికన్లు ఇంతకాలం అనుసరించిన విధానా
లు, ప్రచారం చేసిన భావాలకు ట్రంప్‌ ప్రతీక అని నమ్మిన వర్గాలు గత ఎన్నికల్లో ఆయన్ను గెలిపించాయి. ఇప్పుడు ఉన్నట్టుండి ట్రంప్‌ను వ్యతిరేకిస్తే ఆ ఓటుబ్యాంకు దూరమవుతుందని భయపడినందువల్లే రిపబ్లికన్లు కిమ్మనకుండా ఉన్నారు. పార్లమెంటు భవనంపై ట్రంప్‌ వర్గీయుల దాడి కొందరు రిపబ్లికన్లలో అంతర్మథనాన్ని ప్రేరేపిస్తున్నా- అది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే.

విస్తరించిన ఆర్థిక అసమానతలు

అదే సమయంలో అమెరికా ప్రజాస్వామ్యం ఇంతగా బలహీనపడటానికి కేవలం ట్రంప్‌నే కారణంగా చూపడం సరికాదు. ఈ డిజిటల్‌ యుగంలో ఆర్థిక అసమానతలు విస్తరించి అమెరికన్‌ స్వప్నం చెదిరిపోవడమే అసహన ధోరణులు ప్రబలడానికి ప్రధాన కారణం. టెక్నాలజీ కంపెనీల ఆవిర్భావం తరవాత అమెరికా నుంచి సంప్రదాయ పరిశ్రమలు చైనాకు తరలిపోయి నిరుద్యోగం విజృంభించింది. మరోవైపు అమెరికా రాజకీయాల్లో ధన ప్రాబల్యం విజృంభించి, సామాన్యుల వాణికి విలువ లేకుండా పోతోంది. ఆర్థిక, జాతిపరమైన అసమానతలను సరిదిద్దనిదే అమెరికా నిజమైన ప్రజాస్వామ్యంగా వర్ధిల్లలేదు!

- ఏఏవీ ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.