సమస్త జీవజాలానికి చెట్టూ చేమకూ ప్రాణావసరమైన నీటిని ప్రతి ఒక్కరూ ప్రాణప్రదంగా చూసుకోవాలి. దశాబ్దాలుగా ప్రభుత్వాలు, ప్రజల్లో ఆ స్పృహ కొరవడబట్టే జాతి నెత్తిన జలగండం మున్నెన్నడూ లేనంతగా ఉరుముతోంది. దేశవ్యాప్తంగా 60 కోట్లమంది తీవ్రనీటి ఎద్దడితో దురవస్థల పాలవుతున్నారని, 2030నాటికి అందుబాటులోని నీటికంటే అవసరాలు రెండింతలు అధికం కానున్నాయని నీతి ఆయోగ్ రెండున్నరేళ్ల క్రితం వెల్లడించింది. 70శాతం నీటి వనరులు కలుషితమవుతున్నాయని, పర్యవసానంగా ఏటా రెండు లక్షలమంది అభాగ్యులు అకాల మృత్యువాత పడుతున్నారన్న నాటి అధ్యయనం.. దేశ ప్రయోజనాలు ఇలా నీరుగారిపోయి సంభవించే నష్టం జీడీపీలో ఆరుశాతంగా ఉండనుందనీ స్పష్టీకరించింది. కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే వాన నీటి సంరక్షణపై గ్రామ సర్పంచులకు 12 భాషల్లో వ్యక్తిగత లేఖలు రాసిన ప్రధాని మోదీ.. తాజాగా వంద రోజుల కార్యాచరణకు కూడి రావాలని ప్రజానీకానికి పిలుపిస్తున్నారు.
నిర్లక్ష్యానికి భారీ మూల్యం
వర్షకాలం వచ్చేలోగా చుట్టుపక్కలున్న జల వనరుల్ని బాగు చేసుకొని వాన నీటి సంరక్షణకు సిద్ధం కావాలని, 'వర్షాన్ని ఒడిసిపడదా'మంటూ జల్‌శక్తి మంత్రిత్వశాఖా ప్రచారోద్యమం చేపట్టనుందనీ మోదీ 'మన్ కీ బాత్'లో వెల్లడించారు. నీటి సంరక్షణను ఉమ్మడి బాధ్యతగా గుర్తించాలన్న మోదీ సందేశంలో 2003 నాటి వాజ్‌పేయీ చొరవ ప్రస్ఫుటమవుతోంది. ఆనాడు తెలుగునాట ఉద్యమస్ఫూర్తితో సాగిన జలయజ్ఞం దేశానికి మేలుకొలుపు అయిన నేపథ్యంలో నదులు చెరువులు దొరువుల ప్రక్షాళనకు అందరూ కృషి చేయాలని, సరసమైన ధరల్లో నీటి పరిరక్షణ సాంకేతికతను శాస్త్రవేత్తలు అందించాలనీ వాజ్‌పేయీ అభిలషించారు. అందుకు దీటైన కార్యాచరణ లేకపోబట్టే.. నీటి వనరులు నిర్లక్ష్యానికి గురై పెను ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భూతాపంతో రుతువులు గతి తప్పి దాహార్తి సీమల్లోనూ ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్కతాటిపై జనం కదిలితేనే కన్నీటి కాష్ఠాలు చల్లారేది!
భూగర్భ జలాల్నీ తోడేస్తున్న ఘోరం
'చెరువు పూడు-ఊరు పాడు' అన్న నానుడి భారతావనిలో నీటి వనరుల సంరక్షణ స్పృహ ఎంత బలీయంగా ఉండేదో వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గల జనాభాలో, జంతుజాలంలో చెరో 18శాతానికి పురిటిగడ్డ అయిన ఇండియాలో మంచినీటి వనరులున్నది నాలుగు శాతమే. దారుణ నిర్లక్ష్యంతో వాటిని శిథిలావస్థకు చేర్చిన నేరం, భూగర్భ జలాల్నీ ఇష్టారీతిన తోడేస్తున్న ఘోరం- ఏటికేడు మంచినీటి కటకటను ముమ్మరం చేస్తున్నాయి. 70శాతం వర్షాలు పట్టుమని వంద రోజుల్లో కురిసిపోతుంటే, వాటిని జాగ్రత్తగా ఒడిసిపట్టడం చేతకాక, తక్కిన రోజుల్లో నీటి అవసరాలు తీరే దారిలేక దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. కొన్ని దశాబ్దాలక్రితం దేశీయంగా ఏటా తలసరి నీటి లభ్యత 5000 ఘనపు మీటర్లు ఉండగా నేడది 1486 ఘనపు మీటర్లకు పడిపోయింది.
2031నాటికి తలసరి నీటిలభ్యత 1367 ఘనపు మీటర్లకు దిగిపోవడమే కాదు, నీటి నాణ్యతా దిగనాసిగా ఉండనుందన్న అధ్యయనాల వెలుగులో.. ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న ఆలోచనల్ని అందరూ విడనాడాలి. వర్షాల రూపేణా ఇండియా ఏటా పొందుతున్న జలరాశి నాలుగు లక్షల కోట్ల ఘనపు మీటర్లు అయినా వినియోగించుకోగలుగుతున్నది అందులో నాలుగోవంతే! రెండు లక్షల కోట్ల ఘనపు మీటర్ల వాననీటిని పకడ్బందీ జాతీయ ప్రణాళికతో ఒడిసి పట్టగలిగితే.. నీటి మిగులు దేశంగా ఇండియా సాధించగలిగేది ఆత్మ నిర్భరతే! భారత్‌తో పోలిస్తే నాలుగోవంతు వాననీటి వసతిగల ఇజ్రాయెల్.. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకొని ఆధునిక సాంకేతిక ఉపాయాలతో అపాయాన్ని తప్పించగలిగింది. అక్కడి భూగర్భ జల మట్టాల పెరుగుదలా ఇండియాకు అనుసరణీయ మార్గాన్ని బోధిస్తోంది. తాగునీటి బెంగ తీర్చే గంగావతరణానికి ప్రతి పౌరుడూ అపర భగీరథుడై కదలాలి. సుజలాలతో దేశం సుఫలం కావాలంటే, జల సంరక్షణ ఊరూవాడా జనయజ్ఞంగా సత్య నిష్ఠతో సాగాలి!
ఇదీ చూడండి: బంగాల్ బరిలో నెగ్గేదెవరు- దీదీ హ్యాట్రిక్ కొడతారా?