అవినీతి అడుసులో ఈదులాడటం సమకాలీన రాజకీయ సంస్కృతిగా పరిఢవిల్లుతున్న దేశం మనది. అన్ని స్థాయుల్లో అవినీతిని సాంతం మట్టగించాకే సింగపూర్ లాంటి దేశాలు అగణిత అభివృద్ధిని సాధించిన రుజువులు కళ్లకు కడుతున్నా- మంచివైపు చూపు సారించని వంచన రాజకీయాలే ఏడు దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో గజ్జెకట్టి ఆడుతున్నాయి. అవినీతి కాళియ మర్దనం చేసేందుకు 1963లో ఏప్రిల్ ఒకటి ఆల్‌ఫూల్స్ డే నాడు కేదస (సీబీఐ) ఆవిర్భవించింది. పోనుపోను రాజుగారి గుర్రం గాడిదైందన్నట్లుగా దాని పనిపోకడలు భ్రష్టు పట్టిపోవడం వల్ల మొదట్లో సీబీఐ అంటే- 'కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్'గా పరువు మాసింది. దరిమిలా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి గూటి చిలుకలా మారిపోగల కళను ఆపోశన పట్టి ఏలిన వారి రాజకీయ ప్రయోజనాన్ని సాధించి పెట్టగల పనిముట్టుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంది. ఇంత ఘనత సాధించిన కేదసను సాధారణ సమ్మతి ద్వారా తమతమ రాష్ట్రాల్లోకి అనుమతిస్తే కోరి కొరివితో తలగోక్కున్నట్లు అవుతుందన్న వెరపుతో పలు రాష్ట్రాలు ఆంక్షల కొరడా ఝళిపిస్తున్నాయి. తాజాగా ఝార్ఖండ్‌తో కలిపి ఏడు రాష్ట్రాలు తమ పరగణాల్లో సీబీఐ ఇష్టారీతి దర్యాప్తుల్ని ఆమోదించేది లేదని తేల్చిచెప్పాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు పెళుసుబారిన వాస్తవాన్ని, అంతకుమించి జాతి ద్రోహమనదగ్గ అవినీతిని రాజకీయ సులోచనాల్లో నుంచి వీక్షించే దగుల్బాజీ ధోరణులనీ ఈ పరిణామాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఆ వైనం చిత్తగించండి!
దర్యాప్తునకు ఇబ్బందులు..
రాజకీయ ప్రత్యర్థుల దుంప తెంచేందుకు కేంద్ర నిఘా దర్యాప్తు సంస్థల్ని అడ్డగోలుగా వాడిన నైచ్యం ఆత్యయిక స్థితి కాలంలోనే పెచ్చరిల్లింది. విమర్శకుల నోళ్లు మూయించడానికి, పార్టీ నిధుల సేకరణకూ కేదస సేవల్ని సంజయ్‌గాంధీ విస్తృతంగా వినియోగిస్తే, తన ఏలుబడిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై కక్షపూరిత దాడులకు సీబీఐని ఉసిగొల్పడం ద్వారా రాజీవ్‌గాంధీ చరిత్రకెక్కారు. కీలక నేతల రాజకీయ విధేయతల్ని మార్చడానికీ దర్యాప్తు సంస్థలు ఉపయోగపడేంతగా వాతావరణం భ్రష్టు పట్టిపోయిందిప్పుడు! ఏ రాష్ట్రమైనా సాధారణ సమ్మతి తెలిపిన పక్షంలో- భారతీయ శిక్షాస్మృతిలోని 184 సెక్షన్ల కింద, కేంద్ర ప్రభుత్వ చట్టాల పరిధిలోకి వచ్చే 63 నేరాలూ ఘోరాల్ని కేదస స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోగలుగుతుంది. దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎస్‌పీఈ) చట్టంలోని ఆరో విభాగం- దిల్లీ ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో తప్ప తక్కినచోట్ల దర్యాప్తునకు ఆయా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని నిర్దేశిస్తోంది. కేసులవారీగా ఆయా రాష్ట్రాల అనుమతులు తీసుకోవాల్సి రావడం వల్ల దర్యాప్తునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న కేదస- ఆ నిబంధనను తొలగించాలని 2013లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. కేదస దర్యాప్తునకు న్యాయపాలికే ఆదేశించిన సందర్భాల్లో రాష్ట్రాల నుంచి అనుమతులు పొందాల్సిన అవసరం లేకపోవడం కొంత ఊరటనిచ్చేదే అయినా- కేంద్రంలోని అధికార పక్షం పెంపుడు జాగిలంలా మారబట్టే సీబీఐకి రాష్ట్రాల నుంచి తిరస్కారాలు ఎదురవుతున్నాయని చెప్పక తప్పదు. ఆ మాటకొస్తే పోలీసు వ్యవస్థను, బ్యూరోక్రసీని దుర్వినియోగపరచి రాజకీయ ప్రత్యర్థుల్ని రాచి రంపాన పెట్టడంలో రాష్ట్రాలూ ఏమాత్రం వెనకబడి లేవు. ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు అంటున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధ పాలన ద్వారా ప్రజాశ్రేయానికి పూచీ పడాల్సిన వ్యవస్థలు- పాలక పక్షాల రాజకీయ ప్రయోజనాలకు కొమ్ముకాస్తుండటమే నగుబాటు!
'సామర్థ్యం, సచ్ఛీలతల పరంగా ప్రజానీకం మీ నుంచి అత్యున్నత ప్రమాణాల్ని ఆశిస్తుంది. ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలి. పరిశ్రమ నిష్పాక్షికత నిజాయతీ- ఈ మూడూ సీబీఐ ధ్యేయం కావాలి. ఎల్లప్పుడూ విధిపట్ల విధేయతకే ప్రథమ ప్రాధాన్యం దక్కాలి'- కేదస వ్యవస్థాపక సంచాలకులుగా పద్మభూషణ్ డీపీ కోహ్లి అవినీతి నిరోధక అధికార శ్రేణులకు చేసిన మార్గదర్శనమది. వ్యవస్థలు ఎంత గొప్పవి అయినా, వాటికి సారథ్యం వహించే వ్యక్తుల సచ్ఛీలత, సామర్థ్యం, రుజువర్తనలతోనే అవి రాణిస్తాయన్న అంబేడ్కర్ వ్యాఖ్యల్ని గుర్తుచేసుకొంటే- కేదస ఇంతగా దిగజారిపోవడానికి మూలకారణమేమిటో ఇట్టే బోధపడుతుంది.
సుప్రీంకోర్టు ఆదేశాలు
రెండు పుష్కరాల నాటి జైన్ హవాలా కేసు విచారణ సందర్భంగానే కేంద్ర సర్కారు పంజరంలో చిలుకలా కేదస మారిందని గుర్తించిన సుప్రీంకోర్టు- దానికి కార్యనిర్వాహక స్వేచ్ఛ కల్పిస్తూనే జవాబుదారీతనం మప్పే కీలక ఆదేశాన్ని వెలువరించింది. ఆనాడు ఎన్‌ఎన్‌వోరా, బీజీ దేశ్‌ముఖ్, ఎస్‌వి గిరి సభ్యులుగా కమిటీ వేసి 70కిపైగా సూచనలున్న యాభై పేజీల నివేదిక రాబట్టి- 45 విస్పష్ట ఆదేశాలతో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి వాటికిగల రాజకీయ బంధనాల్ని తెగతెంచింది. బ్రిటన్‌లోని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ తరహాలో సమర్థ నిష్పాక్షిక సంస్థను నెలకొల్పి- కేదస, ఈడీలు ప్రారంభించే దర్యాప్తుల పర్యవేక్షణ బాధ్యత దానికి అప్పగించాలనీ సూచించింది. నిందితుల విడుదలలో ప్రాసిక్యూషన్ వైఫల్యం ప్రస్ఫుటమైతే, విధి నిర్వహణలో వైఫల్యానికి సంబంధిత అధికారిని జవాబుదారీ చెయ్యాలని గిరిగీసింది. అన్నింటికీ మించి సంయుక్త కార్యదర్శి ఆపై అధికారుల అవినీతి కేసుల దర్యాప్తునకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తున్న ‘సింగిల్ డైరెక్టివ్’ను చెత్తబుట్టలోకి విసిరేసింది. 1997 నాటి ఆ ఉత్తర్వులు తు.చ.తప్పక అమలై ఉంటే- అవినీతి పూరిత దేశాల జాబితాలో ఇండియా ఇంకా కొనసాగేదా? ఏటా లక్షా 30 వేల కోట్ల రూపాయల నల్లధనం దేశం దాటి పోతుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చిందన్న కేంద్ర నిఘా సంఘం మొత్తుకోళ్లను దేశం నిర్వేదంతో పరికించేదా?
తప్పు చేస్తే దేశాధ్యక్షుణ్నే బోనెక్కించగల స్థాయిలో అమెరికాలో ప్రాసిక్యూషన్ వ్యవస్థ రాణిస్తోంది. బ్రిటన్‌లో ఒక దేశద్రోహం కేసులో రాజకీయ కారణాలతో నేరాభియోగాన్ని ఉపసంహరించడానికి నిర్ణయించిన రామ్‌సే మెక్ డొనాల్డ్ ప్రభుత్వాన్ని ప్రజానీకం శంకరగిరి మాన్యాలు పట్టించడంతో- ముందస్తు విచారణల్లో జోక్యం చేసుకొనే ధైర్యం ఈనాటికీ ఎవరూ చేయలేని వాతావరణం అక్కడ నెలకొంది. రాష్ట్ర స్థాయుల్లో రాజకీయ భల్లూకపు పట్టు నుంచి పోలీసు వ్యవస్థల్ని విడిపించడానికి, కేంద్రస్థాయిలో కేదస పనిపోకడల్ని సంస్కరించడానికి సుప్రీం న్యాయపాలిక చేసిన పలు యత్నాలకు దుర్రాజకీయాలే గండికొడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండి బాధితులమంటూ మొత్తుకొనే పార్టీలు పాలకపక్ష హోదాలో అదే దుర్నీతిని కొనసాగిస్తుండబట్టే- అవినీతి మోతుబరులకు సింహస్వప్నం కావాల్సిన కేదస లాంటి వ్యవస్థలు కాగితం పులులుగా పరువు మాస్తున్నాయి. ఈ అవ్యవస్థ కొనసాగినంత కాలం అవినీతి చెద అంతమొందే అవకాశం లేదు. ఏమంటారు?
- పర్వతం మూర్తి