ETV Bharat / opinion

కొవిడ్‌పై దుర్బల పోరు.. పోషకాహార లోపమే శాపం - ప్రపంచ పౌష్టికాహార నివేదిక-2020

కరోనా మహమ్మారి వల్ల ప్రజలు దుర్భర జీవితాలను గడపాల్సి వచ్చింది. ఈ వైరస్ నిరుపేదల జీవితాలను మరింత అగాధంలోకి నెట్టివేసింది. ఉపాధిని కోల్పోయి, కనీస తిండి కూడా దొరకని పరిస్థితి దాపరించింది. వారిలో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందనేది వాస్తవం. నిరుపేద కుటుంబాలపైనే ప్రాణాంతక వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రపంచ పౌష్టికాహార నివేదిక-2020 వెల్లడించింది.

2nd Report on the World Nutrition Situation
కొవిడ్‌పై దుర్బల పోరు.. పోషకాహార లోపమే శాపం
author img

By

Published : Jun 30, 2020, 10:02 AM IST

రెక్కాడితేగాని డొక్కాడని స్థితిలో ఆకలి, దారిద్య్రంతో అలమటిస్తున్న నిరుపేదలను కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా పేదలను అగాధంలోకి తోసేసిందని ప్రపంచ పౌష్టికాహార నివేదిక-2020 స్పష్టం చేస్తోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కరవై పేదరికంలో మగ్గుతున్న కోట్లమందికి పౌష్టిక ఆహారం మాటేమోగాని, వారికి కనీసం తినడానికి తిండి కూడా అందడం లేదు. వారిలో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ కారణంగానే కొవిడ్‌ మహమ్మారికి బలైన వారిలో నిరుపేదలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ పౌష్టికాహార నివేదిక-2020 సైతం స్పష్టం చేసింది.

లోపాలను సవరించేదెప్పుడు?

కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి పౌష్టికాహారమే శరణ్యమని వైద్య నిపుణులు, ఆహార నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. పోషకాహారం తక్కువ ధరకు అందుబాటులో ఉండి సులభంగా లభ్యమయ్యే సమాజాల్లో- కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలు సర్వసన్నద్ధమై ఉంటారు. కొవిడ్‌ మహమ్మారి వల్ల అకస్మాత్తుగా ప్రకటించిన లాక్‌డౌన్‌వల్ల కోట్లమంది నిరుపేదలు, అసంఘటిత కార్మికులు పనులు కోల్పోయారు. ఒక్కసారిగా జీవనోపాధిని కోల్పోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థ తక్షణ సహకారం అందించడంలో విఫలమైంది. ఈ తరహా పరిస్థితుల మధ్య పేదలు పౌష్టికాహారం ఎలా సమకూర్చుకొని కరోనాను కాచుకుంటారనేది ప్రశ్నార్థకమే. ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత పరిధిలో ఉన్న లక్షల మంది పౌష్టికాహార కొరతను ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఆరోగ్య రక్షణ, ఉపాధికల్పన, ఉద్యోగ భద్రతల్లో నెలకొన్న డొల్లతనం బహిర్గతమైంది. కరోనాను ఎదుర్కోవడానికి యుద్ధప్రాతిపదికన బలహీన వర్గాలకు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో నాణ్యమైన, బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించి సామాన్యుల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈక్రమంలో అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య వ్యయాల్ని తగ్గించడానికి ప్రభుత్వాలు వారిని ఒక విశ్వజనీనమైన ఆరోగ్య భద్రత వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

లోపాలపై దృష్టి...

పౌష్టికాహార సమానత్వ భావనను అవగాహన చేసుకోవడానికి, సమర్థంగా అమలు పరచడానికి- ముందుగా ఆహార ఉత్పత్తి నుంచి వినియోగం వరకుగల ఆహార విధానాలలో లోపాలను గుర్తించాలి. ప్రస్తుత ఆహార పద్ధతులు పౌష్టికాహారానికిగాని, ప్రజలకుగాని అనుగుణంగా లేవు. ఇప్పుడు అమల్లో ఉన్న వ్యవసాయ పద్ధతులు, పంటలు, ప్రజలకు పౌష్టికాహారాన్ని అందజేయడంలో విఫలమవుతున్నాయి. పలుదేశాలలో పౌష్టికాహార అసమానతలు ఉన్నందున దాని నిర్మూలనకు తగిన రీతిలో వనరుల కేటాయింపు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది చివరలో జపాన్‌లో జరగనున్న 'వృద్ధి కోసం పౌష్టికాహారం' శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ ఆహార విధానాల నిర్ణయాల్లో పౌష్టికాహారం లభ్యత, పంపిణీ ప్రాధాన్యం వంటి అంశాలను చర్చించనున్నారు. పౌష్టికాహార అసమానతలకు దారితీసే సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను పరిగణలోకి తీసుకొంటూ విధాన నిర్ణయాల్లో అన్ని వర్గాలకు భాగస్వామ్యాన్ని కల్పించాలి. అప్పుడే అసమానతలను అరికట్టడం సాధ్యమవుతుంది. సంతులిత పౌష్టికాహారాన్ని అందరికీ అందుబాటులో తీసుకురావడంతోపాటు, వనరుల పంపిణీ సమానంగా జరగాలి. వ్యవసాయం, భూసంస్కరణలు, సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన వంటి చర్యలు చేపట్టాలి. పోషకాహార అసమానతలు తగ్గడానికి సరైన విధివిధానాలను రూపొందించాలి.

అసమానతలు తొలగాలి

పోషకాహారాన్ని ఉచితంగాగాని, చౌకధరకుగాని, సులువుగా అందుబాటులో ఉండేలా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా వెనుకబడిన వర్గాల ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తే, అసమానతలను కనిష్ఠ స్థాయికి తీసుకురావచ్ఛు ఈ క్రమంలో కొవిడ్‌ మహమ్మారినే కాకుండా భవిష్యత్తులో రాబోయే భయంకర వ్యాధుల ఉపద్రవాలను సైతం ఎదుర్కొనే సత్తా ప్రజలకు సొంతమవుతుంది. భవిష్యత్తులో ఈ విపత్తు నుంచి బయటపడిన తర్వాత కూడా వివక్షకు గురవుతున్న వివిధ వర్గాల వారి అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలి. వారి సంక్షేమానికి ఆర్థిక వనరులను భారీగా కేటాయించి ఉపాధి అవకాశాలను పెంపొందించాలి. కొవిడ్‌ కారణంగా మన ముందుకొచ్చిన పౌష్టికాహార అసమానతలను నివారించడానికి తగిన చర్యలను వేగంగా ఎలా అమలు చేయాలో ప్రభుత్వాలు అవగాహన చేసుకోవాలి. ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి పౌరుడికి బలవర్ధకమైన ఆహారాన్ని చౌక ధరలో అందుబాటులోకి తెస్తూ ఆరోగ్య భద్రత హామీని కల్పించాలి. పౌష్టికాహార ఉత్పత్తులకు తోడ్పడే నియంత్రిత విధానాలను అమలు చేయాలి. వ్యవసాయ రంగంపై పెట్టుబడులను పెంచి సబ్సిడీలు అందించాలి. నాణ్యమైన ఆహార దిగుబడులను పెంచేలా పరిశోధన కార్యక్రమాలు రూపొందించాలి. ఆరోగ్య సేవల్లో భాగంగా పౌష్టికాహార సంబంధ అంశాలు ఉండేలా విధాన రూపకల్పన చేయాలి.

- ప్రొఫెసర్‌ తాటికొండ రమేష్‌

(కాకతీయ విశ్వవిద్యాలయ న్యాయ, సామాజిక శాస్త్రాల విభాగం డీన్‌)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.