ETV Bharat / opinion

టీకా మైలురాయి.. దేశ ప్రజల విజయం! - భారత్​లో టీకా కార్యక్రమం విజయవంతమైందా?

కొవిడ్​పై పోరులో భాగంగా ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొద్ది రోజుల్లోనే 100కోట్ల డోసులు పూర్తి చేసుకోవడం నిజంగా దేశ ప్రజల విజయమే. టీకా తయారీ మొదలు.. క్షేత్రస్థాయిలో పంపిణీ వరకు ఎంతో మంది సహకారం లేకుంటే ఈ బృహత్తర కార్యక్రమం ఇంత విజయవంతం అయ్యేదికాదంటే అతిశయోక్తి కాదు. ప్రజలంతా నమ్మకమైన భాగస్వాములుగా జతకూడితే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో దేశీయ టీకా పంపిణీ కార్యక్రమం చాటిచెప్పింది..

vaccine
టీకా
author img

By

Published : Oct 22, 2021, 5:13 AM IST

Updated : Oct 22, 2021, 6:36 AM IST

కొవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో 2021 అక్టోబర్‌ 21వ తేదీ (గురువారం) ఓ మైలురాయి. మన దేశం 100 కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తి చేసిన ఘనతను అద్వితీయంగా చాటింది. టీకా పంపిణీ చేపట్టిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ఈ రికార్డును సాధించడం విశేషం. 2020 ప్రారంభ దశలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో గుర్తుచేసుకున్నప్పుడు- కొవిడ్‌పై పోరాటంలో ఇదొక అద్భుత ప్రస్థానం. వందేళ్ల తరవాత మానవాళి ఈ స్థాయి మహమ్మారిని ఎదుర్కొంది. మనకు ఏ మాత్రం తెలియని, అదృశ్య శత్రువు అంతకంతకు వేగంగా పెరిగిపోతున్న పరిస్థితులు అప్పట్లో ఎంత అనిశ్చితిగా మన ముందు కదలాడాయో గుర్తుంది. ఆందోళనకరమైన వాతావరణం నుంచి భరోసాతో కూడిన పరిస్థితులు నెలకొనడం దాకా సాగిన ప్రయాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం ద్వారా మన దేశం మరింత శక్తిమంతంగా అవతరించింది. సమాజంలోని విభిన్న వర్గాలు తమవంతు తోడ్పాటు అందించిన ఈ కార్యక్రమం నిజంగా భగీరథ యత్నమే.

ఒక్కో వ్యాక్సిన్‌ వేసేందుకు ఆరోగ్య కార్యకర్తకు రెండు నిమిషాల సమయం పట్టింది. ఈ లెక్కన ప్రస్తుత మైలురాయిని చేరుకొనేందుకు 41 లక్షల మానవ పని దినాలు, సుమారుగా 11 వేల మానవ పని సంవత్సరాల శ్రమ అవసరమైంది. ఏదైనా ఒక కార్యాన్ని సమర్థంగా, వేగంగా పూర్తి చేసేందుకు సంబంధిత భాగస్వామ్య వర్గాలందరి విశ్వాసం కీలకం. రకరకాల భయాందోళనలు, అనుమానాలు రేకెత్తించే యత్నాలెన్నో జరిగినా- టీకాలపై ప్రజలు పెట్టుకొన్న నమ్మకమే ఈ కార్యక్రమం భారీ విజయం సాధించడానికి కారణమైంది. మనలో కొంతమందికి సాధారణ నిత్యావసరాలకు సైతం విదేశీ బ్రాండ్లనే విశ్వసించడం అలవాటు. కొవిడ్‌-19 టీకా వంటి కీలక విషయంలో మాత్రం భారతీయులు ఏకగ్రీవంగా 'భారత్‌లో తయారీ' టీకాలకే మొగ్గు చూపారు. ఇదొక గణనీయమైన, వినూత్న మార్పు.

అద్భుత ఫలితం..

జన భాగస్వామ్య స్ఫూర్తితో ఉమ్మడి లక్ష్యం దిశగా ప్రభుత్వం, ప్రజలు ఏకతాటిపై ముందడుగు వేస్తే దేశం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోగలదో భారత టీకాల కార్యక్రమం నిక్కచ్చిగా రుజువు చేసింది. భారతదేశం టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు మన 130 కోట్ల జనబాహుళ్యం సామర్థ్యాన్ని చాలామంది తక్కువగా అంచనా వేశారు. పౌరులందరికీ టీకా ఇవ్వాలంటే కనీసం మూణ్నాలుగేళ్లు పడుతుందని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొందరైతే, టీకాలు వేసుకోవడానికి జనం ముందుకు రాబోరని జోస్యం చెప్పారు. ఇంకా కొందరు టీకాల సమర్థ సరఫరా అసాధ్యమని తేల్చిచెప్పారు. కానీ, ప్రజలంతా నమ్మకమైన భాగస్వాములుగా జతకూడితే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో- జనతా కర్ఫ్యూ, తదనంతర లాక్‌డౌన్లు వంటివి చాటిచెప్పాయి.

కర్తవ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను తలకెత్తుకుంటే అసాధ్యమన్నదే ఉండదు. ఈ క్రమంలో ప్రజలందరికీ టీకాలు అందించేందుకు మన ఆరోగ్య కార్యకర్తలు కొండలెక్కారు, నదులు దాటారు. అత్యంత దుర్లభమైన మారుమూల ప్రదేశాలకు వెళ్ళి మరీ టీకాలు వేశారు. ప్రపంచంలోని అగ్రదేశాల్లో సైతం టీకాలపై సంశయాలు వ్యక్తంకాగా, మన దేశంలో ఆ ప్రభావం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఘనతకు కారణం మన యువత, సామాజిక, ఆరోగ్య కార్యకర్తలు, సామాజిక-ఆధ్యాత్మికవేత్తలందరి తోడ్పాటే. టీకాల పంపిణీలో ప్రాధాన్యం కల్పించాలంటూ పలువర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. అయినప్పటికీ ఇతర పథకాల్లో అనుసరిస్తున్న పద్ధతి మాదిరిగానే టీకాల పంపిణీలో ప్రముఖులకు పెద్దపీట వేసే సంస్కృతికి తావే లేదని ప్రభుత్వం నిర్ద్వంద్వంగా చాటింది.

సొంతంగా వ్యాక్సిన్‌..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభించినప్పుడు, మహమ్మారిపై పోరులో టీకాలే కీలక ఆయుధంగా మారతాయని తేటతెల్లమైంది. తదనుగుణంగా మొదటి నుంచే సంసిద్ధత కనబరచాం. 2020 ఏప్రిల్‌ నుంచే నిపుణుల బృందాలను ఏర్పాటు చేసి, మార్గదర్శక ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టాం. నేటికీ ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే సొంతంగా టీకాలు తయారు చేసుకొన్నాయి. 180కిపైగా దేశాలు ఇప్పటికీ పరిమితంగా ఉన్న ఉత్పత్తిదారులపై ఆధారపడ్డాయి. భారతదేశం 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని అధిగమించినా- పలు దేశాలు ఇంకా వ్యాక్సిన్ల సరఫరా కోసం ఎదురుచూస్తున్నాయి. భారత్‌కు సొంత టీకా లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి!

ఇంతటి భారీ జనాభా కోసం టీకాలు ఎక్కడి నుంచి తెచ్చుకోగలం? అందుకు ఎన్నేళ్లు పట్టేది? పరిస్థితులకు తగినట్లుగా ముందుకొచ్చిన భారతీయ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలకే ఈ ఘనత చెందుతుంది. వారి ప్రతిభాపాటవాలు, కఠోర శ్రమతోనే మనదేశం టీకాల విషయంలో నిజమైన ‘ఆత్మనిర్భరత’ను సాధించగలిగింది. భారీ డిమాండుకు తగినట్లుగా ఉత్పత్తిని సాధించడం ద్వారా మన టీకా తయారీదారులు తామెవ్వరికీ తీసిపోమని చాటారు.

ప్రగతి ప్రస్థానానికి ప్రభుత్వాలే ప్రతిబంధకాలన్న భావన నెలకొన్న మన దేశంలో మా ప్రభుత్వం తద్భిన్నంగా పురోగతికి ప్రేరణగా నిలిచింది. మొదటి నుంచే టీకాల తయారీదారులతో భాగస్వామ్యం దిశగా అడుగులేసింది. వ్యవస్థాగత తోడ్పాటు, శాస్త్రీయ పరిశోధన, నిధుల లభ్యత సహా అనుమతుల ప్రక్రియలను వేగవంతం చేయడం ద్వారా వారికి అండగా నిలిచింది. 'సంపూర్ణ ప్రభుత్వం' అన్న విధానంతో మంత్రిత్వ శాఖలన్నీ ఒక్కతాటిపై నిలిచి, టీకా తయారీదారులకు ఎలాంటి అవరోధాలూ ఎదురుకాకుండా తోడ్పడ్డాయి. భారత్‌ వంటి సువిశాల దేశంలో టీకాల ఉత్పత్తితోనే పని పూర్తి కాదు, ఎలాంటి ఆటంకాలూ లేకుండా రవాణా సౌకర్యాలు కల్పించడం ద్వారా చివరి మెట్టు దాకా వాటిని చేర్చగల సామర్థ్యం కూడా ప్రధానమే.

ఒక టీకా సీసా ప్రస్థానాన్ని ఊహించుకుంటే ఈ ప్రక్రియలో ఎదురైన సవాళ్లు అర్థమవుతాయి. పుణె లేదా హైదరాబాద్‌లోని కర్మాగారం నుంచి ఆ సీసాను ఏదైనా రాష్ట్రంలోని కేంద్రానికి చేర్చాలి. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి, ఆపై టీకా కేంద్రాలకు చేరాలి. ఇందుకోసం విమానాలు, రైళ్లు వేల ట్రిప్పులు తిరగాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రయాణంలో నిర్దిష్ట ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్షకుపైగా శీతల నిల్వ పరికర సదుపాయాలను ఉపయోగించాం. టీకాల సరఫరాకు సంబంధించి రాష్ట్రాలకు ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల పంపిణీ కార్యక్రమం కోసం మెరుగైన రీతిలో సంసిద్ధంగా ఉండేలా వీలుకల్పించాం. స్వతంత్ర భారతదేశంలో మునుపెన్నడూ ఎరుగని కార్యదక్షతకు ఇది నిదర్శనం.

ప్రజాస్వామ్యవ్యవస్థల్లోనే సాధ్యం..

'టీం ఇండియా' బృందస్ఫూర్తితోనే మన దేశం వేగంగా ముందడుగు వేస్తోందని 2015లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనే స్పష్టంచేశాను. ఆ టీం ఇండియాలో 130 కోట్లమంది భారతీయులూ సభ్యులే. ప్రజా భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలం. అలా- 130 కోట్లమందినీ భాగస్వాములుగా చేసి దేశాన్ని ముందుకు నడిపిస్తే, ప్రతి క్షణం 130 కోట్ల అడుగులు ముందుకేస్తుంది. మన టీకాల కార్యక్రమం టీం ఇండియా బృందస్ఫూర్తిని, సత్తాను మరోసారి ఘనంగా చాటింది. ఇలాంటి విజయం ప్రజాస్వామిక వ్యవస్థల్లోనే సాధ్యపడుతుందని మొత్తం ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచంలోనే అత్యంత భారీ టీకాల కార్యక్రమంలో మన విజయం- యువత, ఆవిష్కర్తల్లో మరింత ఉత్తేజం నింపడంతోపాటు, ప్రభుత్వ విభాగాలు ప్రజాసేవలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు దోహదపడుతుందని అభిలషిస్తున్నాను. ఇది దేశానికే కాకుండా, ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.

కొవిన్‌ తోడ్పాటు..

బృహత్తరమైన టీకా పంపిణీ కసరత్తుకు 'కొ-విన్‌' సాంకేతిక వేదిక ఎంతో తోడ్పడింది. పంపిణీ సమస్థాయిలో, పారదర్శకంగా, వేగంగా సాగేలా సహాయపడింది. కేటాయింపులో పక్షపాతానికి తావులేకుండా చేసింది. టీకా తొలి మోతాదును స్వగ్రామంలో స్వీకరించిన ఓ పేద కార్మికుడు, నిర్దేశిత వ్యవధి తరవాత రెండో మోతాదును తాను పనిచేసే నగరంలో తీసుకునే వెసులుబాటునూ కల్పించింది. దీంతోపాటు ఎప్పటికప్పుడు గణాంక సమాచారాన్ని పారదర్శకంగా వెల్లడిస్తూ, 'క్యూఆర్‌' సంకేతంతో కూడిన ధ్రువీకరణ పత్రాలూ జారీ అయ్యాయి. ఈ స్థాయి కసరత్తు భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే మరెక్కడా జరిగిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాబోదు.

-నరేంద్రమోదీ, భారతదేశ ప్రధానమంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Oct 22, 2021, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.