అసహాయుల ఆక్రందనలు, ఆకలి కేకలు, అర్ధాంతర మరణాలు, అనాథలైన పసివాళ్లు, అగమ్యగోచరమైన జీవితాలు- ఆసేతుహిమాచలాన్ని విషాదసంద్రంలో ముంచేస్తూ కరోనా రక్కసి మిగిల్చిన భీతావహ జ్ఞాపకాలివి! ఆ మహమ్మారితో చేస్తున్న మహాయుద్ధంలో కీలక ఘట్టంగా- వంద కోట్ల మోతాదుల టీకా పంపిణీ మైలురాయిని ఇండియా గురువారం అధిగమించింది. సరికొత్త చరిత్ర లిఖించామని హర్షాతిరేకాలు వ్యక్తంచేసిన ప్రధాని మోదీ- భారతీయ శాస్త్ర పరిశోధన, కార్యదక్షతలకు దక్కిన విజయంగా దీన్ని అభివర్ణించారు. దాదాపు 138 కోట్ల జనావళిలో 71.39కోట్ల మందికి కనీసం ఒక డోసు టీకా అందగా- 29.93కోట్ల మంది రెండు విడతలూ స్వీకరించారు. శతకోటి డోసుల పంపిణీ ఘనతను నాలుగు నెలల క్రితమే సాధించిన చైనా- ఇప్పటికి 220 కోట్లకు పైగా మోతాదులను తన దేశీయులకు అందించింది! ఇక్కడ జాతీయ స్థాయిలో జనవరి 16న శ్రీకారం చుట్టుకున్న టీకా కార్యక్రమం- కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక తప్పిదాలు, బాలారిష్టాలతో తొలినాళ్లలో తడబడింది. సుప్రీంకోర్టు జోక్యం దరిమిలా సార్వత్రిక ఉచిత వ్యాక్సిన్ వితరణ ఆరంభమై క్రమేణా జోరందుకుంది. మొదటి యాభై కోట్ల డోసుల పంపకానికి ఆరున్నర నెలలకు పైగా పడితే- మలివిడత 50కోట్ల మోతాదులు రెండున్నర నెలల్లోనే జనతకు అందివచ్చాయి. బృహత్తర టీకా యజ్ఞంలో ఇప్పటి వరకు సాధించిన ఫలితాలు శ్లాఘనీయం! కేంద్రం ఇటీవల ఉద్ఘాటించినట్లు- మందగమనంలోని రెండో మోతాదు టీకా పంపిణీని ఇకపై ఉరకలెత్తించాలి. ప్రాణాంతక వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలను భారతీయులందరూ అందిపుచ్చుకోవాలంటే- దాదాపు 170 కోట్ల డోసుల పంపకం ఇంకా సాకారం కావాలి!
పెనుముప్పు మేఘాలు పూర్తిగా తొలగిపోక మునుపే 80శాతం ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలకు నీళ్లొదిలేశారని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు తాజాగా ఆందోళన వ్యక్తంచేశారు. రెండు డోసుల టీకా తీసుకున్నవారూ అప్రమత్తతతో మెలగాల్సిందేనని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు. రెండో ఉద్ధృతి కల్లోల కాలంలో శోకతప్తులైన దేశ రాజధానివాసుల్లో ఇప్పుడు ముందుజాగ్రత్తలే మృగ్యమయ్యాయనే కథనాలు వెలుగుచూస్తున్నాయి. మత, రాజకీయ కార్యక్రమాలతో వీధుల్లో పోటెత్తుతున్న జనవెల్లువలో మాస్కుల ధారణ, భౌతిక దూరం తదితరాలన్నీ కొట్టుకుపోతున్నాయి. తగిన జాగ్రత్తలను విస్మరించిన యూకే, యూఎస్‌ఏ, రష్యాల్లో మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. మార్గదర్శకాల అమలులో అధికార యంత్రాంగం అలక్ష్యంతో దేశీయంగా కరోనా రక్కసికి కొత్త కోరలు మొలుచుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు ఏడుశాతం వయోజనులు వ్యాక్సిన్ల పట్ల విముఖత ప్రదర్శిస్తున్నట్లుగా ఇటీవలి ఒక అధ్యయనంలో తేటతెల్లమైంది. 45 ఏళ్లకు పైబడిన వారిలో దాదాపు 46శాతం టీకాలు తీసుకోవడానికి సంశయిస్తున్నారని తమిళనాడు సర్కారు సర్వే లోగడ స్పష్టీకరించింది. టీకాస్త్రాల సమర్థతపై అహేతుక వాదనలకు అడ్డుకట్ట వేస్తూ, ఊరూవాడా ఉద్ధృత ప్రచారంతో ప్రభుత్వాలు చైతన్యదీపాలు వెలిగించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి వ్యాక్సిన్ రక్షణ ఒనగూడేలా పటుతర కార్యాచరణతో పురోగమించాలి. చిన్నారులకూ త్వరితగతిన టీకాలు అందుబాటులోకి వస్తే- భావితరం భద్రతకు భరోసా లభిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో స్వీయజాగ్రత్తలే సమాజానికి శ్రేయస్కరమంటున్న నిపుణుల సూచనలకు ప్రజలు చెవొగ్గితే- యావద్దేశమూ సురక్షితమవుతుంది. సమష్టి సమరంతోనే మహమ్మారి కబంధ హస్తాల్లోంచి విముక్తి సాధించగలమంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల అంతరార్థాన్ని పాలకులు, పౌరులు అవగతం చేసుకోవాలి. ఆచరణలో ఆ స్ఫూర్తికి పట్టంకట్టాలి!
ఇదీ చూడండి: 'టీకా వంద కోట్ల మైలురాయి.. నవభారతానికి ప్రతీక'