అందమైన పూల బొకే కొనాలీ అనుకోగానే చాలామంది ముందుగా వెతికేది రోజాపూల కోసమే. ప్రకృతిలో ఎన్ని రకాల పూలు విరిసినా గులాబీల అందం వాటిని చూసినప్పుడు కలిగే ఆనందం... వర్ణనాతీతం. అందుకే ప్రియమైన వాళ్ల పుట్టినరోజో పెళ్లిరోజో వస్తోందంటే చాలు, చాలామంది ఆన్‌లైన్‌లో గులాబీ బొకే కోసం తెగ వెతికేస్తుంటారు. అయితే ఎంత అందమైన బొకే అయినా కొన్ని రోజులకి వాడిపోక తప్పదు. ఆ తరవాత వాడిన రోజాల్ని కష్టంగానయినా పారేయక తప్పదు.
సంరక్షణ అవసరంలేదు
అందుకే కొందరు ఫ్లోరిస్టులు సుమారు మూడేళ్ల వరకూ తాజాగా ఉండే రోజాల్ని రూపొందిస్తున్నారు. అలా వస్తున్నవే ఈ వాడిపోని రోజాపూలు. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ రకం గులాబీల్ని రూపొందిస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు కేవలం గాజు కంటెయినర్ లేదా బాక్సుల్లోనే కాకుండా డిస్నీ ఫెయిరీటేల్ కథల్ని తలపించేలా ఓ తోటలో విరిసినట్లో చెట్టుకి పూసినట్లో గులాబీల్ని అందంగా అమరుస్తున్నాయి. వాటికి వేరే రకాల పూలనీ కొమ్మల్నీ ఆకుల్నీ జోడించి టెర్రేరియంలో మాదిరిగా చూడచక్కని దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ‘ద ఎన్‌ఛాంటెడ్ గార్డెన్’ కలెక్షన్ పేరుతో తయారుచేస్తోన్న ఈ పూల టెర్రేరియానికి ఎలాంటి సంరక్షణా అక్కర్లేదట.
ఎలా చేస్తారు?
వాడని రోజాలకోసం ముందుగా మందపాటి రేకులున్న పూలనే ఎంపికచేసుకుంటారు. ఆపై గ్లిజరిన్‌కి మరికొన్ని గాఢ తైలాలను జోడించి అమృతంలాంటి ఓ మ్యాజిక్ ద్రావకాన్ని తయారుచేస్తారు. ఆ మిశ్రమంతో తాజా రోజాలను చర్య పొందిస్తారు. అంటే- గులాబీలని ఆ మిశ్రమ ద్రావణంలో ఉంచడం వల్ల అందులో సహజంగా ఉండే తేమ తొలగిపోయి క్రమంగా ఆ ద్రావకం వాటిల్లోకి చేరుతుందన్నమాట. ఆ తరవాత ఒక్కో పువ్వునీ పరీక్షించి వాటిల్లో దెబ్బతిన్న రేకుల్ని తొలగిస్తారు. ఇప్పుడు వీటిని ఓ గాజు కంటెయినర్‌లోగానీ బాక్సుల్లో గాన్నీ చూడచక్కగా అమరుస్తారు.
అంతేకాదు, ముదురు నీలం, నలుపు, ఊదా వంటి అసాధారణ రంగుల్లోని రోజాలకోసం కొన్ని రకాల రసాయనాలతో వాటి రంగుని పూర్తిగా తొలగించేసి ఆపై ఆయా రంగుల్ని అద్దుకునేలానూ చేస్తున్నారు. ఇలా వాటి అసలు రంగుని తీసి కృత్రిమ రంగుల్ని అద్దడం వల్లే వాటి రేకలన్నీ ఏక రంగులో ఒకేలా కనిపిస్తుంటాయి. ఈ పద్ధతిలో ఇప్పటికే అనేక కంపెనీలు వాడని రోజాల్ని రూపొందిస్తున్నాయి. అయితే ఫరెవర్ రోజెస్ లండన్ కంపెనీ మాత్రం ఏకంగా గాజు గదుల్లోనే వాడిపోని ఉద్యానవనాన్నే సృష్టించేస్తూ ‘ప్రియ’మైన వాళ్ల ముఖాల్లో చిరునవ్వులు విరబూయిస్తోంది..!