డ్రైఫ్రూట్స్ చివ్‌డా
కావలసినవి
జీడిపప్పు: పావుకప్పు, బాదం: పావుకప్పు, పల్లీలు: పావుకప్పు, మందంగా ఉండే అటుకులు: పావుకప్పు, ఎండుకొబ్బరి ముక్కలు: పావుకప్పు, కిస్‌మిస్: పావుకప్పు, ఎండు నల్లద్రాక్ష: పావుకప్పు, కరివేపాకు: ఒకరెబ్బ, పసుపు: పావుచెంచా, కారం: అరచెంచా, ఎండుమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, నూనె: రెండు చెంచాలు.
తయారీ విధానం
స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె వేసి... జీడిపప్పు, బాదం, పల్లీలను వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో నూనె లేకుండా అటుకుల్ని వేయించి తీసుకోవాలి. అందులోనే మిగిలిన నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకు, ఎండుకొబ్బరి ముక్కలు వేయించి స్టౌ కట్టేయాలి. వేడి కొద్దిగా చల్లారాక ఆ తాలింపులోనే డ్రైఫ్రూట్స్, పల్లీలు, కిస్‌మిస్, ఎండు నల్లద్రాక్ష, అటుకులు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ కలుపుకోవాలి.
పానకం
కావలసినవి
బెల్లం తరుగు: అరకప్పు, నీళ్లు: రెండు కప్పులు, శొంఠిపొడి: పావుచెంచా, మిరియాలపొడి: అరచెంచా, యాలకులపొడి: అరచెంచా, ఉప్పు: చిటికెడు, ఐసు ముక్కలు: రెండుమూడు, నిమ్మరసం: రెండు చెంచాలు.
తయారీ విధానం: ఓ గిన్నెలో నీళ్లు, బెల్లం తరుగు వేసుకుని పక్కన పెట్టేస్తే కాసేపటికి బెల్లం పూర్తిగా కరుగుతుంది. ఆ నీటిని వడపోసి, నిమ్మరసంతోపాటూ మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని బాగా కలిపితే చాలు.
మీఠా రైస్
కావలసినవి
బాస్మతీ బియ్యం: కప్పు, దాల్చినచెక్క: చిన్నముక్క, లవంగాలు: నాలుగు, బిర్యానీఆకు: ఒకటి, యాలకులు: నాలుగు, కుంకుమపువ్వు: పావుచెంచా, ఉప్పు: పావుచెంచా, పసుపు: పావుచెంచా, నెయ్యి: పావుకప్పు, కిస్‌మిస్: పది, జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు: పావుకప్పు, పాలు: అరకప్పు, చక్కెర: ముప్పావు కప్పు.
తయారీ విధానం: బాస్మతీబియ్యాన్ని కడిగి పావుగంటసేపు నానబెట్టుకోవాలి. ఆ తరువాత స్టౌమీద కడాయి పెట్టి ఒకటి ముప్పావుకప్పు నీళ్లు పోసి బియ్యం, లవంగాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, ఉప్పు, పసుపు వేయాలి. అన్నం ముప్పావు వంతు ఉడికాక నీటిని పూర్తిగా వంపేసి, మసాలా దినుసుల్ని తీసేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక డ్రైఫ్రూట్స్ పలుకుల్ని వేయించి విడిగా తీసి... అదే బాణలిలో పాలు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు అన్నం, చక్కెర, కుంకుమ పువ్వు, వేయించిన డ్రైఫ్రూట్స్ పలుకుల్ని వేసి బాగా కలపాలి. అన్నం పొడిపొడిగా అయ్యాక దింపేయాలి.
కొబ్బరి గారెలు
కావలసినవి
బియ్యప్పిండి: కప్పు, కొబ్బరి తురుము: అరకప్పు, పచ్చిమిర్చి: ఎనిమిది, జీలకర్ర: టేబుల్‌స్పూను, వేడినీళ్లు: అరకప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం: ఓ గిన్నెలో బియ్యప్పిండి, కొబ్బరి తురుము, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి జీలకర్ర కలిపి దంచిన ముద్ద వేసుకుని అన్నింటినీ కలుపుకోవాలి. ఆ తరువాత వేడినీళ్లు పోస్తూ ముద్దలా చేసుకోవాలి. పది నిమిషాలయ్యాక కొద్దిగా పిండిని తీసుకుని నూనె రాసిన ప్లాస్టిక్ కవరుమీద చిన్న గారెలా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి.
కోసంబరి
కావలసినవి
పెసరపప్పు: కప్పు, కీరదోస: రెండు, క్యారెట్లు: నాలుగు, మామిడికాయ: ఒకటి, కొబ్బరి తురుము: అరకప్పు, ఆవాలు: చెంచా, మినప్పప్పు: చెంచా, కొత్తిమీర: కట్ట, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు రెబ్బలు: రెండు, నూనె: నాలుగు చెంచాలు, ఇంగువ: పావుచెంచా, నిమ్మకాయ: సగం, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
పెసరపప్పును ఓసారి కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీళ్లు వంపేసి ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన మామిడి, కీరదోస తరుగు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తరుగు, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి అన్నింటినీ కలుపుకోవాలి. తరువాత స్టౌమీద కడాయిపెట్టి నూనెవేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించి కోసంబరి పైన వేయాలి. చివరగా నిమ్మరసం పిండాలి.