కావాల్సినవి: ఉడికించిన అన్నం- కప్పు, బంగాళాదుంపలు- రెండు, సెనగపప్పు - చెంచా, మినప్పప్పు- చెంచా, ఆవాలు- అర చెంచా, ఎండుమిర్చి- రెండు, ఇంగువ- పావు చెంచా, పసుపు- పావుచెంచా, ఉప్పు- తగినంత, కరివేపాకు- రెండు రెమ్మలు, నువ్వుల నూనె- రెండు పెద్ద చెంచాలు.
మసాలా పొడి కోసం: మినప్పప్పు, సెనగపప్పు, మిరియాలు, ఆవాలు- చెంచా చొప్పున, ఎండుమిర్చి- ఏడు, ధనియాలు- రెండు చెంచాలు, మెంతులు- పావుచెంచా, చింతపండు- నిమ్మకాయంత.
మసాలాపొడి తయారీ: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టాలి. ఇది వేడయ్యాక మినప్పప్పు, సెనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత చింతపండు రెబ్బలు వేసుకోవాలి. వీటిని చల్లార్చి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
తయారీ: పొయ్యి వెలిగించి మరొక పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ, కరివేపాకు, బంగాళాదుంప ముక్కలు వేసి మరికాసేపు కలపాలి. ఇందులో ఉప్పు, పసుపు వేసి ఆలూ ముక్కలను వేయించాలి. ఇవి కాస్త వేగిన తరువాత తయారుచేసి పెట్టుకున్న మసాల పొడిని, రెండు నిమిషాలాగి సిద్ధంగా పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలపాలి. ఉప్పు సరి చూసుకోవాలి. అంతే ఆలూ రైస్ రెడీ!
ఇదీ చూడండి: రోగులకు నాసిరకం ఆహారం... ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం