నవ వధువుగా అడుగుపెట్టిన అమ్మాయికి అత్తగారింటి పరిస్థితులు అలవాటు కావడానికి, ఆ కుటుంబ సభ్యులతో కలిసిపోవడానికి కాస్త సమయం పడుతుంది. ముఖ్యంగా అత్తమామలను అర్థం చేసుకోవడానికి కొంత టైమ్ కావాల్సిందే. మీరూ కొత్త కోడలా...అయితే ఈ చిట్కాలు మీకోసమే...
సానుకూల వైఖరి...
కొత్తకోడలిగా మీకెంత కొత్తగా ఉంటుందో.. అప్పుడే వచ్చిన అత్తగారి హోదా కూడా ఆమెకు సరి కొత్తగానే ఉంటుంది. కాబట్టి తనతో సానుకూలంగానే వ్యవహరించండి. వేరే వాళ్ల మాటలు విని ఆమెను విరోధిలా చూడొద్దు. ఆమె కూడా మీతో కలివిడిగా ఉండటానికే ప్రయత్నిస్తుంది.
సమానత్వం...
మీ అమ్మ లానే ఆమెనూ ప్రేమగా చూడండి. తన పుట్టినరోజు/ పెళ్లి రోజు, మరేదో వేడుక సందర్భంగా బహుమతితో ఆమెను సర్‌ప్రైజ్ చేయండి. ఒకవేళ మీరు తనకి దూరంగా ఉంటున్నట్లయితే వారానికో, రెండు వారాలకో లేదా వీలున్నప్పుడల్లా కలిసి రండి. అప్పుడే బంధాలు బలపడతాయి.
గొడవలొద్దు...
కొడుకు ఎంత పెద్దవాడైనా తల్లికి చిన్న వాడిలానే కనిపిస్తాడు. పెళ్లయిన కూడా ఆమెకు పసివాడే. అలాంటి మాతృమూర్తితో మీ భర్తకు సంబంధించి ఏ విషయంలో పోటీ, గొడవ వద్దు. చిన్నప్పటి నుంచి బిడ్డ బాగోగులు చూడటం, తనే ప్రపంచంగా పెంచుకున్న అత్తమ్మను అర్థం చేసుకుని మెలగాలి.
మర్యాద...
అత్తగారిని గౌరవించండి. ఆమె వయసుకు, పెద్దరికానికి ఎదురు చెప్పొద్దు. ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉండొచ్చు. కుటుంబం, పిల్లల పాలన... ఇలా ఆమె పడిన కష్టాలను తెలుసుకోండి. అత్తగారికి అపార జీవితానుభవం ఉంటుంది. కాబట్టి ముఖ్య విషయాల్లో ఆమె సలహాలు, సూచనలు తీసుకోండి. అవి నచ్చక పోయినా, వాటిని పాటించకపోయినా ఫరవాలేదు. అయితే పెద్దావిడగా ఆమెకు గౌరవం మాత్రం తప్పకుండా ఇవ్వాల్సిందే. ఆమె చెప్పేది వినండి. మీకు నచ్చని విషయాలను సమయం, సందర్భం చూసుకుని, సానుకూలంగా సున్నితంగా చెప్పండి. ఆవిడా అర్థం చేసుకుంటారు.
ఇదీ చూడండి: RELATIONSHIP TIPS: మనసులోనే కాదు మాటల్లోనూ ప్రేమ నింపితే...!