ఆరోగ్యకరమైన సంభాషణ...
సమస్య ఏదైనా కావొచ్ఛు అది మీ మనసుల్ని ఎంతగానో గాయపరిచి ఉండొచ్ఛు అయినంతమాత్రాన ఇద్దరూ ఆ విషయం గురించి మాట్లాడుకోవలసిన సమయం వచ్చినప్పుడు మాత్రం భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. ఈ సమయంలో అహాలను పక్కన పెట్టి మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినాలి. అలాగే మీరు చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. లేదంటే సమస్య పక్కదారి పట్టి...మరింత ముదిరి పాకాన పడుతుంది.
క్షమాపణ అడగండి...
ఇద్దరిలో ఎవరిది తప్పైనా సరే! ఎంతకీ తేలకపోతుంటే...దాన్నే పట్టుకుని వేలాడొద్ధు సమస్య మరింత బిగుసుకుపోకుండా ఒక అడుగు వెనక్కి తగ్గి దాన్ని అక్కడితో వదిలేయడానికి సిద్ధపడండి. నువ్వు నా వల్ల ఇబ్బంది పడితే...క్షమించు అని అడగండి. అలాగని మీ తప్పు ఒప్పుకున్నట్లు కాదు...కానీ ఇలా చేయడంవల్ల అవతలివారూ తమ పొరబాటుని గుర్తించేందుకు అవకాశం ఉంది. అప్పుడే మీ మధ్య అపోహలు దూరం అవుతాయి. అవగాహనాలోపం ఉంటే దిద్దుకునేందుకు ఓ చక్కటి అవకాశం దొరుకుతుంది.
హద్దులు నిర్ణయించుకోండి...
వైవాహిక బంధం సజావుగా సాగాలంటే కొన్ని ఆరోగ్యకరమైన నియమాలు, నిబంధనలు, హద్దులు తప్పనిసరి. ఇంతకు ముందున్నవి వీగిపోతే కొత్తవాటిని పెట్టుకోండి. వాటినైనా తప్పకుండా పాటించేందుకు ప్రయత్నించండి. ఏ బంధమైనా నమ్మకం, నిజాయతీమీదే నిలబడుతుందని గుర్తుంచుకోండి.