ప్రస్తుతం ఆడపిల్లలకు సమాజంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నారులకూ ఇంట్లో, బయట రక్షణ కరవైన నేపథ్యంలో ఇతరుల స్వభావాన్ని అర్థం చేసుకునేలా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు సైకాలజిస్టులు. చిన్న పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఎలా చెప్పాలో డాక్టర్ మాటల్లో తెలుసుకుందాం...
వర్తమాన సమాజ పరిస్థితుల్లో అమ్మాయిలకు ఎటువైపు నుంచి ఎప్పుడు ఏ ముప్పు పొంచి ఉన్నదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేయడం చాలా అవసరం. అయితే ఇలాంటి సున్నితమైన విషయాలను చాలా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది.
మీరు చెప్పాలనుకున్న విషయాలను చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. అంటే వాళ్ల వయసుకు తగినట్టుగా చిన్న చిన్న సంఘటనలు, కథల రూపంలో చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి విషయాలు వారికి అర్థమయ్యేట్టుగా చెప్పాలి తప్పితే భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉండకూడదు.
ఏవిధంగా ప్రవర్తించినప్పుడు బ్యాడ్ టచ్ కింద భావించవచ్చో స్పష్టంగా చెప్పండి. ఉదాహరణకు అభ్యంతరకర ప్రదేశాల్లో తాకడం, అసహజంగా ప్రవర్తించడం, ఒంటరిగా ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లడం, అభ్యంతరకరమైన పనులు చేయడం.. ఇలాంటివన్నీ చిన్న చిన్న కథల రూపంలో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేయండి. మీరు చెప్పే విధానం నమ్మదగిన వాళ్లను కూడా నమ్మలేని పరిస్థితికి తీసుకొచ్చేదిగా ఉండకూడదు. మీరు ఏవిధంగా చెప్పినా వారు దానిని అర్థం చేసుకొని పాటించే విధంగా ఉండాలి కానీ భయభ్రాంతులకు గురయ్యేవిధంగా ఉండకుండా చూసుకోండి. చిన్న చిన్న మాటల్లో, పదాల్లో వాళ్లకు అర్థమయ్యే రీతిలో ఉదాహరణలు ఇస్తూ చెప్పే ప్రయత్నం చేయండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్
ఇదీ చదవండి: కట్టింగ్ ఉపకరణంగా రెండున్నర కిలోల బంగారం.. పట్టుకున్న శంషాబాద్ సిబ్బంది