Relationship Advice : మీ సమస్య చదివాక.. మీకు జీవితం, ప్రేమ పట్ల సరైన అవగాహన లేదని తెలుస్తోంది. ప్రేమ, పెళ్లి, జీవితం అంటే బొమ్మలాట కాదు. ముఖ్యంగా ప్రేమ విషయంలో మీ ఆలోచనా ధోరణి సరిగా లేదు. మీ బాయ్‌ఫ్రెండ్ మీకు బోర్ కొడుతున్నాడు సరే.. అలా ఎందుకు జరుగుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? ఒకరిపై ఒకరికి నమ్మకం లేనప్పుడో, పద్ధతి నచ్చనప్పుడో, ఆశించినది దక్కనప్పుడో ఇలా జరుగుతుంది. మనసులో పుట్టి, మట్టిలో కలిసేంత వరకూ తోడుంటుంది ప్రేమ. పెళ్లికి ముందు, పెళ్లయ్యాక తర్వాత కూడా అది ఉండాలి. మీరు చెబుతున్న వివరాల ప్రకారం ఆ అబ్బాయి మీ కోర్కెలన్నీ నెరవేరుస్తున్నాడు. ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇంతకన్నా మీకు ఏం కావాలి? ఒకవేళ తనని కాదని మీరు మరొకర్ని పెళ్లి చేసుకున్నారనుకోండి. అతనూ బోర్ కొడితే ఏం చేస్తారు? తను చెడ్డవాడైతే మీ పరిస్థితి ఏంటి? అందుకే ఒక్కసారి తనతో మనసు విప్పి మాట్లాడండి. తనలో ఏం లోపించిందో చెప్పండి. అవసరమైతే స్నేహితుల సలహాలు తీసుకోండి. అయినా మీరు తనకి బ్రేకప్ చెప్పాలనే నిర్ణయానికొస్తే ఒక్కసారి తన గురించి కూడా ఆలోచించండి. మీరు మోసం చేశారని తను భావిస్తే తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడకుండా ఒప్పించండి. ఇవన్నీ జరిగిన తర్వాతే ఇరువురూ ఇష్టపూర్వకంగా విడిపోండి. నన్ను అడిగితే అంత మంచి అబ్బాయిని వదులుకోకపోవడమే మంచిదంటాను.
- ఇదీ చదవండి : Relationship Advice: అతని భార్య కన్నా.. నేనే ఇష్టమట