దాదాపు అన్ని పెళ్లిళ్లు వధూవరుల ఇష్టంతోనే జరుగుతుంటాయి. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో, కుటుంబ పరువును కాపాడేందుకు, బాధ్యతల దృష్ట్యా.. లేదా మరే ఇతర కారణం వల్లో తమకు ఇష్టం లేకపోయినా పెళ్లికి అంగీకరిస్తుంటారు. దీనివల్ల పెళ్లైన తర్వాత దంపతులిద్దరూ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్టం లేని వ్యక్తితో వైవాహిక జీవితం సాఫీగా సాగడం చాలా కష్టం. అందుకే, పెళ్లికి ముందే మీరు చేసుకోబోయే వారిని ఈ పెళ్లి వాళ్లకు ఇష్టమో, లేదో.. అనే విషయాన్ని అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీకే ఆ వ్యక్తితో పెళ్లి ఇష్టంలేని పక్షంలో.. ఆ విషయాన్ని మీరే సున్నితంగా వాళ్లకి వివరించండి. దీనివల్ల ఇద్దరికీ మేలు జరుగుతుంది.
వివాహబంధంపై మీ అభిప్రాయమేంటి..?
కొంతమంది వివాహమంటే కేవలం కలిసి బతకడమనే అనుకుంటారు. కానీ, వివాహమంటే రెండు మనసులు కలవడం. ఒకరికొకరు ప్రాణంగా ఉంటూ జీవితాంతం కలిసి చేయాల్సిన అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. వాటిని సహనంతో పరిష్కరించుకోవాలే తప్ప ఈ ప్రయాణాన్ని మధ్యలో ఆపకూడదు. ఆ బంధాన్ని మధ్యలో వీడకూడదు. అందుకే పెళ్లికి ముందే మీరు చేసుకోబోయే వారిని వివాహబంధంపై తమ అభిప్రాయమేంటని అడిగి తెలుసుకోండి. వాళ్ల అభిప్రాయాలు, ఆలోచనలు మీకు దగ్గరగా లేకపోతే మీ నిర్ణయంపై పునరాలోచన చేయడం మంచిది.
పిల్లల గురించి..
పెళ్లి తర్వాత చాలా జంటలకు పిల్లల విషయంలో రకరకాల మనస్పర్ధలు వస్తుంటాయి. అందుకే పిల్లలను ఎప్పుడు కనాలి? ఎంతమందిని కనాలి?.. మొదలైన విషయాలను ఇద్దరూ కలిసి పెళ్లికి ముందే చర్చించుకోవడం మంచిది. దీనితో పాటు ఒకవేళ పిల్లలు పుట్టని పక్షంలో ఐవీఎఫ్ పద్ధతిని అనుసరించడం, పిల్లలను దత్తత తీసుకోవడం.. మొదలైన మార్గాల్లో ఒక దానిని పెళ్లికి ముందే ఎంపిక చేసి పెట్టుకోవడం కూడా మేలు.
ఆర్ధిక ప్రణాళికల గురించి..
సాధారణంగా పెళ్లి తర్వాత దంపతులకు ఆర్ధికపరమైన ఇబ్బందులు మొదలవుతాయి. వాటిని తట్టుకొని నిలబడాలంటే ఆర్ధిక లావాదేవీల విషయంలో సరైన ప్రణాళికతో ముందుకెళ్లడం అవసరం. డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంతమంది అవసరానికి మించి ఖర్చు చేస్తే.. కొంతమంది మాత్రం మొదటి నుంచే పొదుపుగా ఉంటుంటారు. వీటిలో మీరు చేసుకోబోయే వ్యక్తి ఏ రకానికి చెందిన వారో పెళ్లికి ముందే గ్రహించండి. అంతేకాదు, పెళ్లి తర్వాత భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం డబ్బును ఆదా చేయడంపై తనకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోండి. వీటితో పాటు పెళ్లికి ముందు తమకేమైనా అప్పులు ఉన్నాయా..?అనే విషయం గురించి అడగడం మాత్రం మర్చిపోకండి.. అదేవిధంగా ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు డబ్బు ఖర్చు చేసే విషయంలో మీ ఇద్దరి ఆలోచనలు ఎలా ఉన్నయో తెలుసుకోండి.
ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు..?
అన్నీ అనుకున్న విధంగా జరుగుతున్నప్పుడు సంతోషంగా, ప్రశాంతంగా ఎవరైనా ఉండగలరు. అదే.. ఏదైనా అనుకోని సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి లోనవ్వకుండా దానిని సమర్థంగా పరిష్కరించడం సమర్థుల లక్షణం. అంతేకానీ, సమస్యలను పరిష్కరించలేక ఆ కోపాన్ని ఇతరులపై చూపించడం, చిరాకు పడడం, తమలో తామే కుంగిపోవడం.. లాంటివి చేయడం సరికాదు. ఈ క్రమంలో మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలాంటివారో ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
కుటుంబ బాంధవ్యాలకు విలువిస్తారా..?
కుటుంబ బంధాల మధ్య పెరిగిన వ్యక్తికి.. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమానురాగాలతో మెలగడం, కుటుంబ బాధ్యతల్లో పాలుపంచుకోవడం.. మొదలైన విషయాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే మీరు చేసుకోబోయే వ్యక్తితో పాటు తమ ఇంటి సభ్యులకి కూడా కుటుంబ బంధాలపై ఎలాంటి అభిప్రాయముందో ముందే తెలుసుకోండి. ఇంటి సభ్యులంతా ప్రేమానురాగాలతో కలిసుండే కుటుంబాలే ఎప్పటికీ సంతోషంగా ఉంటాయనే విషయం మాత్రం మర్చిపోకండి.
ప్రేమ తగ్గిపోతే ఎలా..?
భవిష్యత్తులో విడిపోతామనే ఆలోచనతో ఏ జంటా పెళ్లి చేసుకోదు. వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి. అంతమాత్రాన ప్రేమ తగ్గి దంపతుల మధ్య దూరం పెరగకూడదు. ఎలాంటి సమస్య వచ్చినా ఇద్దరూ కలిసి దానిని పరిష్కరించుకోవాలి. ఈ క్రమంలో ‘ఏదిఏమైనా మేము ఒక్కటే, ఇద్దరం సమానమే..!’ అనే భావన దంపతులిద్దరిలోనూ ఉండాలి. ఒకవేళ ఏ సందర్భంలోనైనా మీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిందని మీకు అనిపిస్తే.. దానికి గల కారణాలను తెలుసుకోవాలి. వాటి గురించి మీ జీవిత భాగస్వామితో చర్చించి.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి దగ్గర పై విషయాల గురించి ప్రస్తావించినప్పుడు, వారి ఆలోచనలు కూడా మీకు నచ్చితే మంచిదే. అలా కాకుండా, వాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచిన పక్షంలో మీ పెళ్లి నిర్ణయంపై ఒక్కసారి పునరాలోచన చేయడం మంచిది.