భార్యంటే బానిస కాదు. భర్తంటే భరించేవాడనీ కాదు. పెనిమిటిని సుతారంగా పెనవేసుకున్న తీగ ఆమె. ఆలి ఆలింగనంతో తరిస్తున్న తరువు ఆయన. ఆ తీగ పందిరి ఎక్కకున్నా.. ఈ తరువు బరువుగా భావించి కుంగిపోయినా దాంపత్యం భారమవుతుంది. ఒకరికొకరు అవకాశం కల్పిస్తూ అల్లుకుపోవడమే దాంపత్య రహస్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే సంసార సూత్రం.
ఈగోల గోల ఎందుకు?
చిలిపి చిరాకులు, వలపులో పరాకులు ఎరుగని మంద భాగ్యులు సంసారాన్ని చదరంగంతో పోల్చారు. కష్టనష్టాలు దాటలేని అసమర్థులు సంసారం సాగరమని తీర్మానించారు. మూడు ముళ్లు వేస్తున్నప్పుడు కలిగే ఆనందాన్ని కడదాకా కొడిగట్టకుండా చూసుకోగలిగితే.. దాంపత్యం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఉంటుంది. ఏడడుగులు వేసినప్పుడు ఉన్న స్ఫూర్తితోనే జీవన యానం చేస్తే.. సంసారం నల్లేరు మీద బండి నడకలా సాగిపోతుంది. తలంబ్రాలప్పుడు ఒకరిపై ఒకరు పైచేయి సాధించినా సరదాగా స్వీకరించిన అప్పటి వైఖరిలో మార్పు రాకుంటే.. ఈగోల గోల పొడచూపదు. అది గొడవల దాకా రాదు. పైచేయి గురించి ఎందుకు పేచీ? గిల్లికజ్జాలను గోడలు వినేదాకా తెచ్చుకొని, గల్లీలోకి ఈడ్చుకొని.. కోర్టు దాకా లాక్కున్నాక గానీ తెలియదు.. సాధించేది ఏమీ ఉండదని !
అమ్మ మహిమ అది !
అలగటాలు, ఆటపట్టించడాలు ప్రతి సంసారంలో ఉండేవే. ఉమామహేశ్వరుల మధ్య గిల్లికజ్జాలకేం కొదవలేదు. యుగయుగాల సంసారం కదా! ఓసారి ప్రమథ గణాలు స్తుతులతో శివుడ్ని ఆకాశానికి ఎత్తేశారట. తన పక్కనే ఉన్న పార్వతి వంక ఒకింత గర్వంగా చూశాడట పరమేశ్వరుడు. పార్వతి చిరునవ్వుతో ఓ ఐదు రంధ్రాలున్న పూల బంతి భర్తకు ఇచ్చిందట. ఆ రంధ్రాల్లోకి చూసిన శివుడికి.. బంతిలో ఐదు బ్రహ్మాండాలు, ఐదు కైలాసాలు, అక్కడ ఐదుగురు రుద్రులూ కనిపించారట. అంతే! అమ్మగారి మహిమెంతో తెలిసొచ్చింది. అయ్యగారి గర్వం సర్వం నిర్వీర్యమైపోయింది. శక్తి లేనిది పురుషుడు ఎలా ఉండగలడు? భార్య తోడు లేనిది భర్తకు విలువ ఏముంటుంది? ఆలుమగల్లో ఒకరు ఎక్కువా కాదు.. ఒకరు తక్కువా కాదు.. అనడానికి ఆదిదంపతులు చూపిన లీల ఇది. ఈ సారాంశాన్ని గ్రహిస్తే.. అవతలి వాళ్లు బెట్టు చేసినప్పుడు ఇవతలి వాళ్లు పట్టువిడుపులు ప్రదర్శించాలి. ఇవతలి వాళ్లు గర్వానికి పోతే.. అవతలి వాళ్లు యుక్తిగా నెగ్గాలి.
ఇద్దరం సమానమే...
స్నేహితుడిని ఓ మాట అనడానికి ఆలోచిస్తాం. దారినపోయే దానయ్య అమర్యాదగా ప్రవర్తించినా.. అవతలి వ్యక్తి బలాబలాలు తెలుసుకొని ప్రతిస్పందిస్తాం. అదే కట్టుకున్నవారి విషయంలో మాత్రం నోటికెంత వస్తే అంత అరిచేస్తారు. బుద్ధికి ఏది పుడితే అది చేస్తుంటారు. మనసులో ఇద్దరం సమానం అనే భావన లేకనే.. ఆధిపత్య ధోరణికి లొంగిపోతారు. అనవసరంగా జీవితాన్ని కుంగదీసుకుంటారు.
అదే అర్ధనారీశ్వర తత్వం !
‘సంసారం అన్నాక సవాలక్ష ఉంటాయి’ అందరూ అనే మాట ఇది. ఇలాంటి సందర్భాలు ఆదిదంపతుల జీవితంలోనూ వచ్చాయి. కొన్నిసార్లు సర్దుకుపోయారు. ఇంకొన్నిసార్లు కట్టుకున్నవారిపై నమ్మకంతో చూసీచూడనట్టుగా వదిలేశారు. మరికొన్నిసార్లు ఒకరికొకరు అండగా నిలిచారు. లోక రక్షణ కోసం పరమేశ్వరుడు హాలాహలం తీసుకుంటుంటే ‘నువ్వు విషం మింగితే నేను పుట్టింటికి పోతాన’నలేదు పార్వతి. భార్యగా కన్నా.. తల్లిగా తన బిడ్డల గురించే ఆలోచించింది. ఎంతమాత్రం అడ్డు చెప్పలేదు. భర్తపై ఆ ఇంతి నమ్మకం అది. కష్టకాలంలో అతడి వెన్నంటి ఉంది. పార్వతీదేవి మాంగళ్యంపై శంకరుడికి అచంచలమైన విశ్వాసం. అందుకే ముందూవెనుకా ఆలోచించకుండా గరళాన్ని గుటుక్కున మింగేశాడు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు విశ్వాసంతో ఉండాలని చెబుతుందీ సందర్భం.
సరసాల దాంపత్యం, నవరసాల సంసారం కలగలిసిందే జీవితం. ఈ ఆట ఆడే ఆలుమగలిద్దరూ సమఉజ్జీలు అయినప్పుడే.. జీవితం రంజుగా సాగుతుంది. ప్రతి మలుపులోనూ ఇద్దరి గెలుపూ సాధ్యమవుతుంది. ప్రతి గెలుపునూ ఇద్దరూ ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. అర్ధనారీశ్వర తత్త్వం తెలియజేసే అసలు సత్యమూ ఇదే!
ఇదీ చదవండి : ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఇది మీ కోసమే!