మీ వారి అనారోగ్యం కారణంగా మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడలేదని చెబుతున్నారు. దీనికోసం సర్జరీలు కూడా జరిగాయని అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అలాగే మీ ఇద్దరి మధ్య శారీరక అనుబంధం ఏర్పడడానికి అతని ఆరోగ్యం సహకరిస్తుందా? లేదా? అన్న విషయం గురించి డాక్టర్లను సంప్రదించారా? మీ తల్లిదండ్రులకు మీరు చెప్పకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ అత్తగారితో మీ అనుబంధం ఎలా ఉంది? ఆవిడ, మీరూ కలిసి డాక్టరుని సంప్రదించారా? మీకూ, మీ వారికీ మధ్య శారీరక బంధంలో సమస్యలున్నా.. మానసికంగా మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంది? వంటి విషయాలను పరిశీలించండి.
ఇక ఉత్తరం చివర్లో మీ వారు మీతో కాపురం చేస్తారా, లేదా అన్న అనుమానం వ్యక్తం చేశారు. దానికి కేవలం మీ ఇద్దరి మధ్య శారీరక బంధం పరంగా ఉన్న సమస్యలే కారణమా లేక మానసికంగా కూడా సమస్యలు ఉన్నాయా? ఇన్నేళ్ల మీ సహచర్యంలో ఒకరిపట్ల ఒకరికి అంతో ఇంతో చనువు ఏర్పడి ఉండాలి. ఒకవేళ అలా ఏర్పడి ఉండకపోతే స్నేహపూర్వక ధోరణితో మాట్లాడండి. అతనితో కొంచెం అనుబంధం గట్టిపడిన తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకొని డాక్టర్‌ని సంప్రదించడం అవసరం.
ఇక మీరు మీ విషయాన్ని మీ తల్లిదండ్రులకి చెప్పకపోవడానికి సహేతుకమైన కారణాలు ఉండచ్చు. కానీ వాళ్లకు అసలు చెప్పకపోవడం వల్ల ఈ విషయం వారికి బాధ కలిగిస్తుందేమో ఆలోచించండి. అందులోనూ మీ బంధం ఎంతవరకూ కొనసాగుతుందో తెలియదు అన్నట్టు రాశారు. దానివల్ల మీ సంసారంలో ఏవైనా సమస్యలు వస్తే అది మీ తల్లిదండ్రులకి మరింత ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట చూచాయగా, సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్లు అర్థం చేసుకుంటారన్న నమ్మకం వచ్చిన తర్వాత విషయాన్ని స్పష్టం చేయండి.
మీ కాళ్ల మీద మీరు నిలబడే ప్రయత్నం చేయండి..
మీ తల్లిదండ్రులు ఒక అక్కని, ఒక అక్క పాపని చూసుకుంటున్నారు కాబట్టి.. వాళ్లకు మీరు మరో భారం అవుతారన్న భయం మీకుంటే స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయండి. మీరు ఒకవేళ చదువుకుని ఉంటే ఉన్నత విద్యని అభ్యసించడం.. అలాగే మీ కాళ్ల మీద మీరు నిలబడే ప్రయత్నం చేయండి. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా.. ప్రపంచంతో కొత్త పరిచయాన్ని పెంచుతుంది. దానివల్ల అనుభవంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు ఒకరికి భారం కాననే ధైర్యాన్ని కూడదీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఇద్దరి మధ్య మానసికమైన, శారీరకమైన అనుబంధం దృఢపడడానికి కౌన్సెలింగ్ అవసరమేమో ఆలోచించి చూడండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్