భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. దానిని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. కాస్త రొమాన్స్, ఇంకాస్త ఏకాంతం.. వీటిలో మరింత కీలకమైనవి. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులు దంపతుల మధ్య ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా చేస్తున్నాయి.
నువ్వు నాకు నచ్చలేదు...
చాలా జంటలు గొడవలు పడ్డప్పుడు ఒకరంటే మరొకరికి ఇష్టం లేదన్నట్లుగా మాట్లాడుకుంటారు. మీరూ ఆ కోవకి చెందిన వారా.. అయితే ఇప్పటి నుంచైనా అలాంటి మాటలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ మాట భాగస్వామి మనసును గాయపరుస్తుంది. ఇదే మీ బంధాన్ని పెళుసుబారుస్తుంది.
నేను లేకపోతే నువ్వేమీ చేయలేవు...
అంటూ కొందరు ఎదుటివారిని తేలిక చేసి మాట్లాడతారు. ఇది మంచి పద్ధతి కాదు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తోడు నీడగా అడుగులు వేసినప్పుడే ఆ బంధం మరింత దృఢమవుతుంది. కాబట్టి నేను లేకపోతే నువ్వు లేవు... లాంటి భారీ డైలాగులొద్దు. ఏదైనా సందర్భంలో భాగస్వామిపై కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండటమో లేదా ఆ ప్రదేశం నుంచి కాసేపు దూరంగా వెళ్లడమో చేయాలి. లేదా ఇద్దరూ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాలి.
లోపాలు చూపొద్దు...
పెళ్లయిన కొత్తలో ఒకరికొకరు అద్భుతమైన వ్యక్తులుగా కనిపిస్తారు. కొన్నాళ్లకు ఎదుటివారి గురించి పూర్తిగా తెలుసుకుంటారు. భాగస్వామి బలాలతోపాటు బలహీనతలనూ అంగీకరించాలి. వాటి నుంచి వారు బయటపడటానికి మీ వంతు సహకారం అందించాలే తప్ప ఎత్తి చూపుతూ కించపరచొద్దు. లోపాలున్నా భాగస్వామికి గౌరవం, మర్యాద ఇవ్వాల్సిందే.
అన్నింటికీ ఏడుపే...
‘అనే మాటలన్నీ అనేసి చివరకు ఏడుస్తావేంటి’ అంటూ చాలామంది భాగస్వామిపై నిందలేస్తారు. సంతోషాలని అందరూ అందరితో పంచుకుంటారు. అయితే బాధ, దుఃఖం లాంటి వాటిని మాత్రమే మన అనుకున్న వారి దగ్గర ప్రస్తావిస్తాం. అలా మీ పార్ట్‌నర్ తన బాధను చెప్పినప్పుడు గొడవ జరిగిన సందర్భంలోనో, మరో సందర్భంలోనో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ హేళన చేయ కూడదు. అది సంస్కారం కాదు.
ఇదీ చూడండి: Warangal Murders: వరంగల్ దారుణ హత్యల కేసు.. ఆరుగురి అరెస్ట్