‘అన్నం తినకపోతే బూచోడు వచ్చి ఎత్తుకుపోతాడు’. ‘నువ్వు చెప్పిన మాట వినకపోతే ఇంజెక్షన్ చేయిస్తా’. ‘అల్లరి చేశావంటే మీ టీచర్‌తో చెబుతా’ ఇలా రకరకాలుగా చెప్పి పిల్లల్ని అదుపు చేయాలనుకుంటాం. నిజానికి ఇలా చెప్పడం వల్ల వారు తాత్కాలికంగా మాటవింటారేమో కానీ...కాలక్రమేణా మీరు చెప్పే మాటల్ని నమ్మకపోవచ్ఛు లేదా టీచర్ అన్నా, డాక్టర్ అన్నా భయపడతారు.
వారిపై వ్యతిరేకతనూ పెంచుకుంటారు. అలాచేయొద్ధు..చెప్పిన పని చేయకపోతే తాను కోరుకున్నవి ఇవ్వకండి. దాన్ని పూర్తిచేస్తేనే ఇస్తామని కచ్చితంగా చెప్పండి. మొదట్లో కాస్త కష్టంగా భావించినా క్రమంగా అర్థం చేసుకుంటారు.
ముఖ్యంగా సున్నిత మనస్తత్వం గల పిల్లలు వారికున్న భయాల్ని బయటికి చెప్పరు. వాటిని పదే పదే తలుచుకుని తమలో తామే కుమిలిపోతుంటారు. కలత నిద్ర, పక్క తడపడం వంటివెన్నో దీని లక్షణాలు. ప్రతిదానికీ పేచీలు పెట్టడం, బడికి వెళ్లనని మారాం చేయడం వంటివెన్నో చేస్తుంటారు. తమ ఆందోళనల్ని దాచుకునే ప్రయత్నంలో మొండిగానూ ప్రవర్తిస్తుంటారు. తల్లిగా వారి ఆందోళనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దాన్నుంచి బయటపడేందుకు ఇతర వ్యాపకాల్ని అలవాటు చేయండి.