''నేను పుట్టగానే మా అమ్మానాన్నలు విడిపోయారు. పుట్టింటివారి ఆదరణ లేకపోవడంతో నన్ను, నా జీవితాన్ని కాపాడడం కోసం మా అమ్మ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఊహా తెలిసినప్పటి నుంచి నా మారుతండ్రి ప్రేమ కోసం ఎంతగా తపించానో నాకే తెలుసు. ఆయన ప్రేమ పొందడం కోసం నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా తను మాత్రం నన్ను ద్వేషిస్తూనే ఉండేవారు. నా మారుతండ్రికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఎప్పుడు ఆయన తాగి వచ్చినా నన్ను ప్రేమగా దగ్గరకి తీసుకునేవారు. నేను కూడా ఆయన నాపై చూపించేది ప్రేమ అనే అనుకునేదాన్ని. కానీ ఏడేళ్ల వయసులో మా నాన్నకు నాపై ఉన్నది ప్రేమ కాదు. కామం అని అమ్మకి తెలిసింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. కానీ మళ్లీ కలుసుకున్నారు. ఎందుకంటే అప్పటికే మా అమ్మకు ఇద్దరు ఆడపిల్లల బాధ్యత ఉంది. దాంతో నేను కూడా అర్థం చేసుకున్నా. కానీ నాన్నను చూస్తే పట్టరానంత కోపం, బాధ వచ్చేది. అందుకే చక్కగా చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. నాన్న నుంచి దూరంగా వెళ్లిపోవాలి అని అనుకునేదాన్ని.
అనుకున్నట్లుగానే పెద్ద యూనివర్సిటీలో సీటు సంపాదించా. ఆ క్షణం మా అమ్మ ఆనందానికి అవధుల్లేవు. అప్పటికే నాన్న చిమ్మిన విషం ప్రభావంతో మగవాళ్లలో ఎవర్ని నమ్మాలన్నా చాలా భయం వేసేది. సరిగ్గా ఆ సమయంలోనే నా జీవితంలోకి మా బావ ప్రవేశించాడు. నాన్న చేసిన పనికి ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉన్న నాకు బావ మాత్రం 'చాలా మంచివాడు' అనిపించేది. అందుకే తను నాకు నచ్చాడు. నాలాగే తనకు కూడా వాళ్ల అమ్మంటే చెప్పలేనంత ఇష్టం. మా మావయ్య అంటే బావ వాళ్ల నాన్న ప్రవర్తన కారణంగా అత్తయ్యవాళ్లు కూడా చాలా కష్టాలు పడ్డారు. అయినా సరే.. అత్త ధైర్యంగా ఎలా మెలిగిందో మా అమ్మ నాకు చెప్తుండేది. అలా ఆమె గురించి ఆదర్శవంతంగా చెప్తుంటే క్రమంగా ఆమె అంటే నాకు ఇష్టం పెరిగింది. మా బావని ఎప్పుడో చిన్నప్పుడు చూశా. మళ్లీ పదేళ్ల తర్వాత తనతో మాట్లాడే అవకాశం దొరికింది.
ప్రేమ వద్దన్నాడు..
ఎప్పట్నుంచో అత్త కుటుంబంపై ఉన్న ఇష్టం బావతో మాట్లాడేసరికి క్రమంగా ప్రేమగా మారింది. మొట్టమొదటిసారి జీవితంలో పెళ్లి మీద ఇష్టం కలిగి, మా బావను పెళ్లి చేసుకోవాలని అనిపించింది. ఇదే విషయం తనతో చెప్పా. కానీ బావ- 'నేను మా అమ్మకు మాటిచ్చా.. నా పెళ్లి తన ఇష్టం.. నా కుటుంబం పరిస్థితి అలాంటిది. కానీ నువ్వంటే నాకూ ఇష్టమే. అందుకే అమ్మ గౌరవం నిలపాలంటే మనం స్నేహితుల్లానే ఉండాలి' అన్నాడు. 'అత్తకు నేనెందుకు నచ్చను?' అని నేను అడిగితే.. 'నువ్వు కాదు.. కుటుంబ గొడవలంటే అమ్మకు అస్సలు నచ్చవు..' అని బదులిచ్చాడు. దాంతో నేను కూడా వెనకడుగు వేశా. ఇంకెప్పుడూ బావతో మాట్లాడినప్పుడు ప్రేమ ఊసు ఎత్తలేదు. అప్పుడప్పుడూ అతని స్టడీస్ గురించి మాత్రమే అడిగేదాన్ని. కొద్ది రోజులు ఇలా బాగానే గడిచిపోయింది. ఆ తర్వాత బావ నాతో మాట్లాడే తీరులో మార్పు వచ్చింది. తనకు సంబంధించిన ప్రతి విషయం నాతో చెప్పడం మొదలుపెట్టాడు. కాలేజ్‌లో తన వెనక ఎంతమంది అమ్మాయిలు పడ్డారు? తనని తాను ఎలా నిగ్రహించుకున్నాడు.. తనకు ఉన్న లక్ష్యాలు.. మొదలైన వాటి గురించి పంచుకునేవాడు. అలా తనకు సంబంధించి చెప్పకూడని విషయాలు కూడా నాతో పంచుకునే స్థాయికి తను వచ్చాడు. వెంటనే.. 'స్నేహంలో ఇలాంటి విషయాలు ఎక్కడన్నా మాట్లాడతారా? నాతో ఆడుకుంటున్నావా?' అని ప్రశ్నించా..! మాట్లాడడం మానేశా. అలా మా మధ్య దాదాపు ఒక సంవత్సరం పాటు మాటల్లేవు.
నమ్మకం కలిగించాడు..
కానీ ఇప్పటికే మేమిద్దరం ఒకరి గురించి మరొకరం చాలా విషయాలు పంచుకున్నాం. ఈ క్రమంలోనే నా మనసులో ఎక్కడో ఓ మూల బావ నన్ను ప్రేమిస్తున్నాడు అన్న నమ్మకం కలిగింది. 'రాసిపెట్టి ఉంటే మా బంధం ఆ దేవుడే కలుపుతాడులే!' అనే ఉద్దేశంతో నా దృష్టంతా చదువుపైనే పెట్టా. మంచి ఎమ్మెన్సీలో జాబ్ కూడా వచ్చింది. ఈ విషయం చెప్పేందుకు బావకు ఫోన్ చేశా. వెంటనే తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు.. వాళ్లమ్మని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. నన్ను వదులుకునేందుకు సిద్ధంగా లేనని చెప్పడంతో నేను కూడా బావ మాటలు నమ్మాను. మా అమ్మకి విషయం చెప్పి ఒప్పించా. మొదట్లో వద్దని వారించిన మా అమ్మ నేను చాలాసార్లు బతిమాలేసరికి మా ప్రేమను అంగీకరించింది. అలా నాలుగేళ్లపాటు బావ, నేను కలిసి తిరిగాం. మా ప్రేమ విషయం అత్తకు చెప్పమన్నప్పుడల్లా 'సమయం రావాలి..' అనేవాడు. అందుకే నేను 'మనం దూరంగా ఉందాం.. నాకు గిల్టీగా ఉంది. మీ అమ్మను ఒప్పించి వచ్చి నన్ను పెళ్లి చేసుకో.. అప్పటివరకు నీ కోసం ఎదురుచూస్తా..' అనేదాన్ని. కానీ అత్తకు మా విషయం చెప్పకుండా, తనకు పెళ్లి కుదిరిందని ప్రతిసారీ నాతో అబద్ధం చెప్పేవాడు. నేను కూడా అది నిజమనుకొని భయపడి నన్ను పెళ్లి చేసుకోమని బతిమాలేదాన్ని. ఇలా ఎన్నిసార్లు జరిగిందో లెక్కే లేదు. మా విషయం ఎటూ తేలకపోయేసరికి మా అమ్మ కూడా నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. బావను చేసుకుంటా అని బతిమాలడంతో తనే బావతో మాట్లాడింది. నేనంటే ప్రాణమని, కానీ అమ్మను (అత్తయ్యను) ఒప్పించేందుకు సమయం కావాలని.. అమ్మకు ప్రమాణం చేశాడు. ఈలోపే మా చుట్టాలందరికీ విషయం తెలిసింది. ఒక్కొక్కరూ నన్ను, అమ్మను ఒక్కో మాట అనడం మొదలుపెట్టారు. బావ వచ్చి అందరికీ జరిగింది చెప్తాడు. నువ్వు ఎవరితోనూ మాట్లాడకు.. అని నేనే మా అమ్మను ఆపాను.
మరిచిపోదాం అన్నాడు..
ఒకరోజు మా బావ నాతో 'మా అమ్మకు మన పెళ్లి ఇష్టం లేదు. మీరు మన ప్రేమ గురించి ఎవరికీ చెప్పొద్దు..' అన్నాడు. ఈలోగా మా ప్రేమ కథ గురించి ప్రచారం తారస్థాయికి చేరుకుంది. నన్ను నానామాటలు అంటుండడంతో అమ్మ చూసి చాలా బాధపడింది. అది చూసి తట్టుకోలేకపోయా. దాంతో 'సరే.. మన ప్రేమను మరిచిపోదాం.. కానీ జరిగినదంతా మీ అమ్మకు నువ్వు చెప్పు.. నేను మా అమ్మ చెప్పినట్లు వింటా' అని బావతో చెప్పా. కానీ తను మాత్రం మౌనమే వహించాడు. అలా మా అత్త, ఆమె కుటంబ గౌరవం కాపాడేందుకు నేను ఎన్నిసార్లు మౌనంగా ఉంటూ మాటలు భరించానో, అందరి ముందు తలవంచుకున్నానో నాకు, మా బావకు మాత్రమే తెలుసు. మా అత్తయ్య ముందు కూడా మా బావ తనకు నాపై ఏవిధమైన ఫీలింగ్స్ లేవనే అన్నాడు. దాంతో నన్ను మోసం చేస్తున్నావు.. అని అరిచాను. తిట్టాను.. అయినా తను పట్టించుకోలేదు. వదిలేసి వెళ్లిపోయాడు. అత్త కూడా ఎన్నో కష్టాలు పడిన మనిషి. అందుకే తన వదిన (బావ వాళ్ల అమ్మ) బాధపడకూడదనే ఉద్దేశంతో మా అమ్మ ఎవరి దగ్గరకీ న్యాయం కోసం వెళ్లలేదు. ఇంత జరిగినా.. నా కోసం మా బావ వస్తాడు.. అనే చిన్న ఆశ నాలో ఉండేది. ఎందుకంటే తను నాపై చూపిన ప్రేమ నిజమే అన్న ధైర్యం మనసులో బలంగా ఉంది. అందుకే కెరీర్‌పై దృష్టి పెట్టా.
మళ్లీ మాట్లాడాడు..
మళ్లీ కొద్ది రోజులుగా బావ నాతో మాట్లాడుతున్నాడు. కష్టాల్లో ఉన్నా అన్నాడు. చేతనైన ఆర్థిక సహాయం చేశా. ఇప్పుడైనా తనలో మార్పు వచ్చిందేమో అనుకున్నా. కానీ తనకు ఈమధ్యే పెళ్లి కుదిరిందని, నిశ్చితార్థం కూడా జరిగిందని మా కుటుంబ సభ్యుల ద్వారా నాకు తెలిసింది. ఇంత జరిగినా నాతో ఒక్కమాట కూడా చెప్పలేదు. ఇదే విషయమై నేను నిలదీస్తే.. 'అమ్మ కోసం చేసుకుంటున్నా.. మన విషయం అమ్మకు చెప్పా. కానీ ఒప్పుకోలేదు. నా జీవితం మా అమ్మకే..' అన్నాడు. మరి నేను అని అడిగితే.. 'ఇన్ని రోజులు ఎలా ఉన్నావో.. ఇప్పుడు కూడా అలాగే ఉండు..' అని అన్నాడు.
నమ్మించడం దేనికి?
మరి, ఇన్ని రోజులు నాలో ఆశలు కల్పించి, తప్పు చేయించి మా అమ్మను కూడా నమ్మించడం దేనికి? నిజంగా మీ అమ్మ కోసమే నువ్వు ఇదంతా చేస్తే.. మన విషయం తెలిసి కూడా ఒక ఆడపిల్లను మోసం చేసి వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలుతుంది? అసలు నేను, మా అమ్మ చేసిన తప్పు నిన్ను నమ్మడమేనా? నువ్వు నీ కపట ప్రేమతో నా గుండెల్లో అగ్గి రాజేశావు. అది ఇప్పుడు నన్ను నిలువునా దహిస్తోంది. అయినా సరే.. నేను ధైర్యం కోల్పోను. ఎందుకంటే నా కుటుంబం నాకు ఉంది. నేను సాధించాలనుకున్న లక్ష్యాలు నాకు ఉన్నాయి. అవి చేరుకోవడానికి ప్రయత్నిస్తా'- అని చెప్పి వచ్చేశా.
ఇదంతా అందరితోనూ పంచుకొని నా గుండె బరువు దింపుకోవాలనే ఇలా వచ్చా. అందరికీ నేను చెప్పేది ఒక్కటే.. జీవితం ఎప్పుడూ మనం కోరుకున్నట్లు ఉండదు. నమ్మించి మోసం చేసే వ్యక్తులు మన చుట్టూ ఎందరో ఉంటారు. ఒకచోట మోసపోయి ఓదార్పు కోసమో, ప్రేమ కోసమో అర్రులు చాస్తూ మరొకరిని గుడ్డిగా నమ్మేస్తే పరిస్థితి చివరకు నాలాగే అవుతుంది. అందుకే ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ప్రేమ పేరుతో దగ్గర కాకండి. స్వార్థపరుల, మోసగాళ్ల ప్రేమ దక్కకపోయినా మనకేం కాదు.. మనం ఇష్టపడిన వ్యక్తిలో నిజాయతీ లేదని ఎప్పుడైతే తెలిసిందో- ఆ క్షణమే ఆ సంబంధాన్ని కట్ చేసేయండి.. మీకు మీరుగా జీవించండి!''
ఇదీ చూడండి: 45+ లోనూ ఫిట్‌నెస్.. వ్యాయామాల్లో లేడీస్ ఫస్ట్