నేనెప్పుడూ చదువులో.. ఆటల్లో.. అన్నింటిలోనూ ఫస్టే. అందుకు కారణం అమ్మే. చిన్నప్పటి నుంచి నన్ను అంతలా ప్రోత్సహిస్తూ నా కళ్లలోనే ఆనందాన్ని చూస్తూ పొంగిపోయేది. ఇంజినీరింగ్ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో పేరొందిన కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అప్పటి వరకూ అమ్మతో నా దూరం కొన్ని కిలోమీటర్లే. జాబ్ విషయంలో మాత్రం వందల కిలోమీటర్లు అయ్యింది. అయినా.. నా భవిష్యత్తులోనే అన్నీ వెతుక్కున్న అమ్మ నన్ను నవ్వుతూనే పంపింది.
అలా మొదలైన పరిచయం
తర్వాత నా లైఫ్‌లో చాలా మార్పులు వచ్చేశాయి. ప్రాజెక్టులు.. పని ఒత్తిళ్లు.. వీకెండ్‌లు.. పార్టీలు.. ఫ్రెండ్స్.. చాలా బిజీ అయిపోయా. ఈ క్రమంలో అమ్మతో రోజూ మాట్లాడే నేను వారంలో ఒక రోజైనా మాట్లాడలేకపోయేవాడిని. అయినా.. అమ్మ బాధ పడింది లేదు. తనెప్పుడైనా ఫోన్ చేస్తే పనిలో ఉన్నానని కట్ చేసేవాడిని. తిరిగి కాల్ చేసిన సందర్భం లేదు. ఏడాది కాలంలో ఫ్రెండ్‌షిప్‌ని దాటుకుని నా లైఫ్‌లోకి వచ్చింది వైశాలి. తనెందుకో నాకు బాగా నచ్చింది. ఏడాది మా స్నేహంలో నాతో ఎప్పుడూ విభేదించలేదు. ఎందుకో ఒక్కో క్షణం తనలో మా అమ్మ కనిపించేది. అందుకేనేమో.. నేనే ముందు ప్రపోజ్ చేశా. అమ్మకీ నా ప్రేమ విషయం చెప్పా. ఎందుకంటే నేను ఏదైనా ముందు అమ్మకే చెప్తా. తర్వాతే నాన్న. అమ్మే నాన్నని ఒప్పించి వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడతాం అంది. వైశాలితో కూడా మాట్లాడింది. తన మాట తీరుకి అమ్మెంతో ముచ్చటపడింది. ఇక పెళ్లే ఆలస్యం.
అనుకోకుండా ఓ రోజు
ఓ రోజు మాటల సందర్భంలో.. ‘ఇంకేముందీ.. మన పెళ్లయ్యాక నువ్వు హ్యాపీగా జాబ్‌కి రిజైన్ చేసెయ్. నువ్వు కష్టపడింది చాలు. మనిద్దరికీ నా జీతం సరిపోతుంది. ఇద్దరం ఫుల్ ఎంజాయ్’ అంటుండగా తన ముఖంలో ఎన్నడూ చూడని ఓ ఎక్స్‌ప్రెషన్. నాకు అర్థం కాలేదు. ఏంటని అడిగితే.. నేను ఎందుకు జాబ్‌కి రిజైన్ చేయాలి? అంది. నాకు మొదటిసారి తన నుంచి ఎదురు ప్రశ్న. అప్పటి వరకూ ఎప్పుడూ తన ముందు రిలాక్స్‌గా కూర్చునే నేను.. అలర్ట్ అయ్యా. తనకి నా ఉద్దేశాన్ని వివరించా... ‘మా నాన్నలా నేను సంపాదిస్తా. నువ్వు మా అమ్మ పాత్ర పోషించాలి. తను ఎప్పటికీ నా బెస్ట్. నా లైఫ్‌ని ఇలా తీర్చిదిద్దింది తనే. నువ్వు కూడా మన పిల్లల్ని అలానే పెంచాలి. అందుకే జాబ్ వద్దంటున్నా.’ అలా అంటుండగానే.. ‘ప్లీజ్.. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దామా?’ అంది.
కోపంతో అలా..
నాకు కోపం వచ్చింది. నేనింత సెన్సిబుల్‌గా భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే తనెందుకు అలా అందో అర్థం కాలేదు. నేనూ సీరియస్‌గా ‘ఈ టాపిక్ వదిలేద్దాం అంటే, పెళ్లి టాపిక్’ కూడా మర్చిపో అని అక్కడి నుంచి లేవబోయా. చెయ్యి పట్టుకుంది. తన కళ్లలో నీళ్లు తిరుగుతున్న విషయం నాకు తెలుస్తోంది. కానీ, చెయ్యి వదిలించుకుని వచ్చేశా. వెనక్కి తిరిగి కూడా చూడలేదు.ఆఫీస్‌లోనూ అంతే. తను మాట్లాడే ప్రయత్నం చేస్తే.. నేను పక్కకి వెళ్లిపోయేవాడిని. ఓ రెండు రోజులు గడిచాయి. ఆ రోజు ఆఫీసంతా సందడిగా ఉంది. ముఖ్యంగా అమ్మాయిలందరూ. వైశాలిలో మాత్రం ఆ ఎనర్జీ లేదు. అందుకు కారణం నేనే అని తెలుసు. ఫ్రంట్ ఆఫీస్‌లో ‘హ్యాపీ ఉమెన్స్ డే!’ అని రాసుంది.
అమ్మకి ఫోన్ కాల్
ఎప్పుడూ ఆ రోజు అమ్మకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతాను. ఆ రోజు అందుకే ఫోన్ చేశా. అమ్మ ఫోన్ ఎత్తగానే.. నేను ఎలా ఉన్నానో అడక్కుండానే. ‘వైశాలి ఎలా ఉంది? నాకు మెసేజ్ పెట్టింది. మీతో మాట్లాడాలని’ నేనింకా చేయలేదు. ఏమైంది? ఏదైనా సమస్యా?’ అంది. నేను చాలా క్యాజువల్‌గా..‘పెళ్లి తర్వాత ఉద్యోగం మానెయ్ అన్నాను అంతే. దానికే పెద్ద సీరియస్ అయిపోయింది. తనూ మా అమ్మంత బెస్ట్‌గా ఉండాలనుకోడం తప్పా అమ్మా.’ అని అడిగే సరికి మా అమ్మ నుంచి ఎలాంటి స్పందన లేదు. నేను పిలుస్తున్నా.. కొన్ని సెకన్ల పాటు అటువైపు నుంచి సమాధానం లేదు. తర్వాత..
అమ్మ చెప్పిన ఆణిముత్యాలు
‘ముందు వైశాలికి ఫోన్ చేసి సారీ చెప్పు అంది’. నేను షాక్ అయ్యా. తేరుకునేలోపే అమ్మ మాట్లాడడం మొదలు పెట్టింది.. ‘పాతికేళ్లుగా. రోజూ నా అల్మరాలో ఉన్న సర్టిఫికెట్‌లు, నాకొచ్చిన ఆఫర్ లెటర్లూ. అడుగుతూనే ఉన్నాయిరా.. మాకెందుకు అన్యాయం చేశావని. నా దగ్గర సమాధానం లేదు. నువ్వు మీ అమ్మ బెస్ట్ అనుకుంటున్నావ్ కదా. నిజమే.. అమ్మగా నేను బెస్టే. కానీ, సర్టిఫికెట్‌లలో ఉన్న అంజలి, ఎంఎస్ గా నిండు సున్నా. ఎంతో ఇష్టంగా ఎన్నో కలలతో చదువుతాం రా. కానీ, అమ్మాయిలకే పెళ్లి పేరుతో ఉద్యోగానికి బ్రేకులెందుకు వేస్తారో నాకు అర్థం కావడం లేదు ఇప్పటికీ. అచ్చం నీలానే మీ నాన్న. అప్పుడు మీ నాన్నకి నో చెప్పలేకపోయా. కానీ, ఇప్పుడు నీకు నో చెప్పకపోతే నాలా మరో అమ్మాయి బాధ పడాల్సి వస్తుంది.
ఒక్క ఫోన్ కాల్ మార్చేసింది!
ఉద్యోగం పురుష లక్షణం అని నేనెప్పుడూ నీకు చెప్పలేదు. నువ్వూ అలా అనుకోవద్దు. నీతో పాటు తనూ ఎదగాలీ.. మంచి తల్లి అని ఇంట్లో అనిపించుకుంటూనే.. మంచి ఉద్యోగి. విజనర్ అంటూ సమాజంలోనూ గుర్తింపు పొందాలి. నీతో ఎదగనివ్వాలి.. తనకి ఎప్పుడూ ఆ స్పేస్ ఉండాలి. నువ్వు వైశాలితో అన్నావంటగా.. ‘నువ్వు మా అమ్మలా ఉంటావ్’ అని. మీ అమ్మని కేవలం ఇంటికే పరిమితం చేయకు. అప్పుడే నువ్వు మంచి భర్తగా గెలిచినట్టు. అంతేకాదు.. నా కొడుకుగా కూడా గెలిచినట్టు.. వెళ్లి వెంటనే తనకి సారీ చెప్పి, నాకు ఫోన్ చెయ్..’ అని ఫోన్ పెట్టేసింది. అప్పటికి నేనింకా అమ్మకి ‘హ్యాపీ ఉమెన్స్ డే’ అని చెప్పనే లేదు.
ఆకాశమే హద్దుగా...
తన క్యాబిన్‌కి వెళ్లా. నన్ను చూసి దగ్గరికి వచ్చింది. ‘ఎలా ఉన్నావ్? నేనూ ఆలోచించా.. నాకు నువ్వు కావాలి.. జాబేగా మానేస్తాలే’ అంది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఒక్కటే మాట చెప్పా.. ‘సారీ వైశాలీ.. మా అమ్మలా నువ్వు పిల్లలతోనే కాదు. సమాజంలోనూ బెస్ట్ అనిపించుకోవాలి. హ్యాపీ ఉమెన్స్ డే’. ఆ క్షణం తన కళ్లలో సంతోషానికి ఆకాశమే హద్దులా అనిపించింది. తనని అలా చూస్తూ ఉండిపోయా...
- నాని
ఇదీ చదవండి: పెద్దయ్యగుట్ట.. రైతుల కోర్కెలు తీర్చునంట!