గర్భందాల్చడంతో ఏ అమ్మాయికైనా పండంటి బిడ్డకు జన్మనిస్తున్నానే భావన మనసు నిండా సంతోషాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో శరీరంలో ఆరోగ్యపరంగా జరిగే మార్పులు కొంత అసౌకర్యాన్ని, భయాన్ని కలిగించడం సహజం అంటున్నారు వైద్య నిపుణులు. వీటి నుంచి బయటపడాలంటే ప్రసవానికి ముందు ఈ అంశాలన్నింటిపై అవగాహన(suggestions to Pregnant women) తెచ్చుకోవాలి..
- ప్రభావం...
గర్భం దాల్చినప్పటి నుంచి కలిగే ఒత్తిడి(stress) ప్రభావం తల్లీబిడ్డల ఆరోగ్యంపై పడుతుంది. దీంతో రక్తపోటు పెరగడం, పుట్టబోయే బిడ్డ బరువుపై పడుతుంది. శిశువు తక్కువ బరువుతో, ఎదుగుదల లోపాలతో ఉండొచ్చు. అంతేకాదు నెలలు నిండకుండానే ప్రసవమయ్యే ప్రమాదం ఉండొచ్చని పలు అధ్యయనాలు కూడా తేల్చాయి. వీలైనంత ప్రశాంతంగా ఆందోళనకు గురికాకుండా తల్లి ఉంటేనే సుఖప్రసవం జరిగి ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనివ్వొచ్చు.
- వ్యాయామం...
ఒత్తిడి కలిగినప్పుడు గర్భిణులు దాన్ని జయించేలా జీవనశైలిని(lifestyle) మార్చుకోవాలి. శిక్షకులు, వైద్యుల సలహాతో చిన్నచిన్న వ్యాయామాలు చేస్తే అధిక బరువు నియంత్రణలో ఉంటుంది. కండరాలు శక్తిమంతంగా మారి పలు రకాల అనారోగ్యాల నుంచి బయటపడొచ్చు. వ్యాయామాలతో ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. నిద్రలేమికి దూరంగా ఉండొచ్చు.
- తరగతులు...
జీవితభాగస్వామి, తల్లి లేదా తోబుట్టువుతో కలిసి చైల్డ్‌బర్త్ ఎడ్యుకేషన్(Child birth education classes) తరగతులకు హాజరవ్వాలి. దీంతో ప్రసవానికి ముందు ఆ తర్వాత కలిగే సమస్యలు, అపోహలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన పెరుగుతుంది. ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణ గురించి తెలుసుకోవచ్చు. ఖాళీ సమయాల్లో ఎంబ్రాయిడరీ, స్వెటర్ అల్లిక, పుస్తక పఠనం, చిత్రలేఖనం, రచన వంటి అలవాట్లు ఒత్తిడిని దూరం చేసి, ప్రశాంతంగా ఉంచుతాయి. పుట్టబోయే శిశువు గురించి ఆలోచనలు తల్లీబిడ్డల బంధాన్ని మరింత దగ్గరచేస్తాయి.