మెన్‌స్ట్రుయేషన్ దశ: అంటే నెలసరి మొదటిరోజు నుంచి లెక్కపెట్టుకోవాలి. ఈ దశలో హార్మోన్లు చాలా స్తబ్దుగా ఉంటాయి. మనలో శక్తి కూడా తగినంతగా ఉండదు. అందుకే కోపం, చిరాకు వంటివి ఉంటాయి. ఈ సమయంలో ఎక్కువ ఒత్తిడిని కలిగించే వ్యాయామాలు చేయకూడదు. శక్తినిచ్చే సూపులు, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
ఫాలిక్యులర్ దశ: నెలసరి అయిపోయిన ఐదు లేదా ఆరో రోజు నుంచి ఈ దశ మొదలయి 13వ రోజు వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. మనలో శక్తితోపాటు, సృజనాత్మక స్థాయి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మరీ ఒత్తిడిని పెంచే వ్యాయామాలు చేయకుండా కొద్దిపాటి విరామాలిచ్చి శరీరం చెప్పిన మాట వింటూ వ్యాయామాలు చేయాలి. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం, ఆకుకూరల్ని తీసుకోవాలి. పొట్టుతో ఉన్న ఆహారం తీసుకుంటే మరీ మంచిది.
ఓవులేషన్ దశ: పద్నాలుగు నుంచి 21 వరోజు వరకూ ఉండే దశ ఇది. ఈస్ట్రోజెన్ అత్యధికంగా విడుదలయ్యే సమయం ఇది. శరీరంలో జీవక్రియల రేటు చాలా చురుగ్గా ఉంటుంది. నలుగురితో కలవడానికి... చురుగ్గా ఉండటానికి ఆసక్తి చూపిస్తాం. ఈ సమయంలో పీచు ఎక్కువగా ఉండే ఆహారంతోపాటు, ఆకుకూరల్ని తీసుకుంటే మంచిది.
లూటియల్ దశ: నెలసరి అయిన 22 నుంచి 28 రోజూ వరకూ ఉన్న సమయం. ఈ దశలో ఆహారంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. కారణం ఓవులేషన్ దశలో అండం ఫలదీకరణం చెందితే... పిండంగా మారడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మరోసారి నెలసరికి శరీరం సిద్ధమవుతుంది. ఇందులో ఏది జరిగినా ఈ సమయంలో విటమిన్ డి, క్యాల్షియం, మెగ్నీషియం, పీచు ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. దీనివల్ల చక్కని నిద్ర అందడంతోపాటు ఒత్తిడిని జయించగలుగుతాం. రోస్టింగ్, బేకింగ్ చేసిన పదార్థాలు తింటే మంచిది. నెలసరి సమయం సజావుగా సాగిపోతుంది.
అనుగుణంగా వ్యాయామం..
- అధిక రుతుస్రావం, విపరీతమైన పొత్తికడుపు నొప్పి వంటి ఇబ్బందులేవీ లేకపోతే రుతుస్రావం అవుతున్న రోజుల్లో తేలికైన వ్యాయామాలు, యోగా చేయటం మంచిది. నెమ్మదిగా కండరాలను సాగదీసే ఇలాంటి వ్యాయామాలు నొప్పి తగ్గటానికి తోడ్పడతాయి.
- అండం విడుదలకు శరీరం సన్నద్ధమయ్యే రోజుల్లో పరుగు, సైకిల్ తొక్కటం వంటివి చేయొచ్చు. ఇవి శక్తి మరింత పెరిగేలా చేస్తాయి. పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు గలవారైతే నెమ్మదిగా నడవటం మేలు.
- అండం విడుదలయ్యే సమయంలో జిమ్‌లో కష్టమైన వ్యాయామాల వంటివీ చేయొచ్చు.
ఇదీ చూడండి: Periods: ఆ సమయంలో ఎన్నో మార్పులు.. తెలుసుకుని మసులుకోవాలి