ఇంట్లో ఎన్ని పనులు చేసినా.. అది వాకింగ్ కిందకు రాదు. వ్యాయామం అసలే కాదు. శరీర భాగాలన్నీ కదిలేలా వేగంగా నడిస్తేనే వాకింగ్ అంటున్నారు నిపుణులు. అలా నడవడం వల్ల ఏం జరుగుతుందంటే..
- కెలరీలు కరుగుతాయి. అధిక కొవ్వు తగ్గుతుంది. హృద్రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
- నరాలకు బలం చేకూర్చి రక్తప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. ఊబకాయం రాదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహం తగ్గుతుంది.
- నడిస్తే కాళ్లనొప్పులొస్తాయనేది అపోహ. క్రమం తప్పక వాకింగ్ చేయడంవల్ల ఎముకలు పటిష్టమై మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
- కండరాలకు బలం చేకూరుతుంది. శరీరం దృఢపడుతుంది. కొండ ప్రాంతంలో నడక వల్ల ఆయాసం వచ్చినప్పటికీ గుండెకు మరింత మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.
- ఉద్వేగాలు తగ్గుతాయి. ఆహ్లాదం కలుగుతుంది. జీవన ప్రమాణం పెరుగుతుంది, మృత్యువాతపడే ప్రమాదం 20 శాతం తగ్గుతుందని పరిశోధనలు వెల్లడించాయి.
- మెదడు ప్రశాంతంగా ఉంటుంది కనుక ఒత్తిడి తగ్గడమే కాక సృజనాత్మకత పెరుగుతుందని సర్వేలు తేల్చాయి. అంతేకాదు హాయిగా నిద్రపడుతుంది.
- 70-90 ఏళ్ల వ్యక్తుల మీద వర్జీనియా విశ్వవిద్యాలయం జరిపిన సర్వేలో వాకింగ్ చేసేవారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం చాలా స్వల్పమని తేలింది.