చిన్నారుల్లో ఆహారంపై అనాసక్తిగా ఉండటం లేదా ప్లేటులోని భోజనాన్ని చిందరవందరగా చేయడం వంటి లక్షణాలకు కారణాలను కనుగొంది సౌత్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం (University of Queensland in South Australia). వీరు జరిపిన ఓ అధ్యయన నివేదిక ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రిసెర్చ్ అండ్ హెల్త్’లో ప్రచురితమయ్యింది. పదేళ్లలోపు పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడానికి కారణాలపై ఈ అధ్యయనం చేశారు. పిల్లల్లో ఆకలిని పెంచి, పౌష్టికాహారాన్ని తీసుకునేలా తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని నియమాలను శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అందరితో కలిసి
ఇంట్లో ముందుగానే చిన్నారులకు భోజనం అందించకుండా, కుటుంబంతో కలిసి తినేలా చేయాలి. అందరితో కలిసి ఉన్నప్పుడు ఎదుటి వారి నుంచి పిల్లలు కూడా ఎటువంటి ఆహారం, దాన్ని ఎలా తినాలో నేర్చుకుంటారు. తోబుట్టువులతో కలిసి తింటే మరీ మంచిది. పలురకాల కూరగాయలతో చేసిన ఆహారంపై అవగాహన పెంచుకుంటారు. అంతేకాదు, రోజూ ఒకేలాంటి పదార్థాలు కాకుండా రకరకాల, రంగురంగుల కూరగాయలతో చేసే ఆహార పదార్థాలను అందించడం కూడా చిన్నారుల్లో తినాలన్న ఆసక్తిని పెంచుతుంది.
నిర్ణీత సమయం
రోజులో నిర్ణీత సమయంలో కనీసం అయిదు సార్లు ఆహారం తీసుకోవడం చిన్నప్పటి నుంచి నేర్పాలి. మధ్యలో తీపిపదార్థాలు, చిరు తిండి అలవరిస్తే ఆ ప్రభావం ఆహారంపై పడుతుంది. దాంతో చిన్నారులు అసలైన భోజనంపై ఆసక్తి చూపించరు.
సానుకూలం
ఇంటిల్లపాదీ కలిసి భోజనం చేసేటప్పుడు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలి. వాదోప వాదాలు, చర్చలు లేకుండా జాగ్రత్తపడాలి. లేదంటే ఇవన్నీ పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. అది వారిలో ఒత్తిడిని కలిగించి, ఉండే కొంచెం ఆకలిని కూడా దూరం చేస్తుంది. కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడు టీవీ లేదా ఎవరికి వారు ఫోన్‌లో బిజీగా ఉండకూడదు.
ఇదీ చూడండి: ఫిట్‌గా ఉండాలంటే ఇవి తినాల్సిందే!
అమ్మాయిలూ మీ ఆహారంలో ఇవి ఉన్నాయా..?
Healthy Food: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలా?.. రోజూ వీటిని తినండి!
DATES: వర్షాకాలంలో డేట్స్ ఎందుకు తినాలో తెలుసా?