ఇటీవలి కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఊబకాయానికి గురవుతున్నారు. కొంతమందిలో అయితే ఉదరభాగంలో కొవ్వు చేరుతుంది. అందుకే చాలామంది తమ శరీరం పూర్వస్థితికి చేరుకొనేందుకు రకరకాల వర్కవుట్లను ఆశ్రయిస్తే.. మరికొందరు వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఈ సమస్య నుంచి బయట పడటానికి డైటింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కొత్త రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే రోజూ మనం తినే ఆహారాన్ని తగ్గించకుండానే.. చేస్తున్న వ్యాయామానికి తోడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉదరభాగంలో చేరిన అదనపు కొవ్వుని తగ్గించుకొని చక్కటి శరీరాకృతిని పొందవచ్చంటున్నారు నిపుణులు.
వెన్నెముక నిటారుగా...
మనం కూర్చున్నప్పుడు సాధారణంగా వెన్నెముక కాస్త వంగుతుంది. ఇలా ఉండటం వల్ల ఉదరభాగంలోని కండరాలపై ఒత్తిడి పెరిగి అవి మరింతగా వ్యాకోచించే అవకాశం ఉంది. అందుకే కూర్చున్నప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండా కొన్ని క్యాలరీల శక్తి ఖర్చవుతుంది. అలాగే పొట్ట భాగంలోని కండరాలు సైతం దృఢంగా తయారవుతాయి. అలాగే రోజూ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
బాగా నమిలి..
చాలామంది తక్కువ సమయంలోనే వేగంగా భోజనం చేసేస్తూ ఉంటారు. ఇలా చేయడానికి అలవాటు ఒక కారణమైతే.. తగినంత సమయం లేకపోవడం మరో కారణం కావచ్చు. అయితే ఇలా చేయడం వల్ల కూడా పొట్ట భాగం పెరిగే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని సరిగ్గా నమిలి తినకపోతే.. పూర్తిగా జీర్ణమవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఫలితంగా గ్యాస్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కూడా ఉదరభాగం పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆహారాన్ని మింగే ముందు కనీసం ఇరవై సార్లన్నా నమలడం మంచిది. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఫలితంగా శరీరంలో చేరిన అదనపు కొవ్వు కరగడం ప్రారంభిస్తుంది. అలాగే జీర్ణసంబంధమైన సమస్యలు రాకుండా ఉంటాయి. మనలో చాలామందికి చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉంటుంది. ఇది దవడ ఎముకలకు మంచి వ్యాయామం. కానీ ఈ అలవాటు కారణంగా కూడా ఉదరభాగం పెరుగుతుందట. దీనికి చూయింగ్ గమ్ నమిలేటప్పుడు లోపలికి వెళ్లే గాలే కారణమట. అందుకే ఉదరభాగం ఎక్కువగా ఉన్నవారు చూయింగ్‌గమ్‌ని నమలకపోవడమే మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే రోజు తగినంత నీటిని తాగడం కూడా అవసరమే.
ఒత్తిడికి దూరంగా..
మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. పొట్ట భాగం పెరగకుండా చూసుకోవడానికి సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు శరీరంలో విడుదలయ్యే కొన్ని స్టెరాయిడ్లు, హార్మోన్లు జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. వీటివల్ల ఒక్కోసారి మలబద్ధకం సమస్య కూడా ఏర్పడుతుంది. వీటన్నిటి ఫలితంగా పొట్ట భాగంలో కొవ్వు చేరే అవకాశాలున్నాయి. అందుకే ఒత్తిడి ప్రభావం పడకుండా చూసుకోవాలి. దీనికోసం ప్రాణాయామం లాంటివి చేయడం మంచిది.
తగినంత నిద్ర..
శరీరానికి తగినంత విశ్రాంతి దొరికితేనే ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఇటీవలి కాలంలో వాట్సాప్, మెసెంజెర్ వంటి యాప్‌ల ద్వారా చాట్ చేస్తూ చాలామంది రాత్రివేళల్లో చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. మళ్లీ ఉదయం పూట త్వరగా మేల్కోవాల్సి రావడం వల్ల నిద్ర సరిపోదు. దీని కారణంగా జీవక్రియలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ఇలా రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కొన్నప్పుడు కొంతమంది ఆకలి వేయడం కారణంగా ఏదో ఒకటి తింటూ ఉంటారు. దీని కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి వూబకాయానికి దారి తీస్తుంది. అందుకే నిర్ణీత వేళల్లో ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం మంచిది.