మహమ్మారి సమయంలో రోజువారీగా తీసుకునే క్యాలరీలు బాగా పెరిగాయి. ఆన్‌లైన్‌లో నచ్చింది.. ఆర్డరిచ్చి ఆరగిస్తున్నారు. చాలామంది వ్యాయామానికి దూరమయ్యారు. బయటకు వెళ్లినా వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు. చలికాలం అనువైన సమయమని, ఈ పండగ నుంచే మొదలెట్టండని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్ని క్యాలరీలు అవసరం?
రోజువారి అవసరాలకు ఆరోగ్యకర వ్యక్తికి 2600 నుంచి 2800 కిలోక్యాలరీల వరకు అవసరం. మహిళలకైతే 2200 నుంచి 2400 వరకు సరిపోతాయి. పిల్లలు, యువత, పెద్దలకు స్వల్ప మార్పులు ఉంటాయి. నగరంలో చాలామంది మూడు వేల నుంచి 4 వేల క్యాలరీలు ఒంట్లోకి పంపిస్తున్నారు. వచ్చే దసరా, దీపావళి పండగలకు పిండివంటలు, మిఠాయిలతో మరిన్ని చేరనున్నాయి.
అదనాన్ని ఎప్పటికప్పుడు....
అదనపు క్యాలరీలను ఎప్పటికప్పుడు సరిచేయకపోతే శరీరంలోని వేర్వేరు భాగాల్లో కొవ్వురూపంలో పేరుకుపోయే ప్రమాదం ఉంది. బొజ్జ పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. చాలామంది కుదరక, బద్దకంతో కసరత్తును వాయిదా వేస్తున్నారు. ఫలితంగా టైప్-2 మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు వివరిస్తున్నారు.
ఉన్నచోటనే ఇలా..
* కూర్చుని విధులు నిర్వహించేవారు.. మధ్యమధ్యలో లేచి నిలబడటం.. రోజు కంటే ఎక్కువగా నడవడం వంటి వాటితో క్యాలరీలను కరిగించుకోవచ్చు.
* స్నానం చేసేటప్పుడు పాటలు పాడుకున్నారనుకోండి అదనంగా 42 క్యాలరీలు అయిపోతాయి. బకెట్‌లోని నీటిని మగ్‌తో తీసుకుని స్నానం చేయడంతో ఎక్కువగా ఖర్చవుతాయి.
* ఒకట్రెండు అంతస్తుల వరకు మెట్ల మార్గాన్ని ఉపయోగించడం మేలు. ఎస్కలేటర్‌పై నిల్చోకుండా మూడు, నాలుగు మెట్లు ఎక్కితే కొన్ని కరుగుతాయి. ఐదు నిమిషాలు మెట్లపై నడిస్తే 51 క్యాలరీలు ఖర్చవుతాయి.
* ఉదయం పళ్లు తోముకునే సమయంలో ఒంటికాలిపై నిల్చొవాలి.
* ఫోన్ వచ్చినప్పుడు కుర్చీలో కూర్చుని మాట్లాడే బదులు.. గదిలో, బాల్కనీలో, మేడపై నడుస్తూ సంభాషించాలి. నిత్యం ఈ విధంగా 300 క్యాలరీలు ఖర్చవుతాయి.
* మిత్రులో, కుటుంబ సభ్యులో చలోక్తి విసిరినప్పుడు హాయిగా నవ్వుకోండి. టీవీలో హాస్యం వచ్చినప్పుడు గట్టిగా నవ్వండి. 15 నిమిషాలు నవ్వితే 40 క్యాలరీల వరకు కరుగుతాయి.
* టీవీలో కార్యక్రమాలు చూసేటప్పుడు రిమోట్‌ను దూరంగా పెట్టండి. ఛానల్ మార్చాలనుకున్నప్పుడల్లా వెళ్లి తెచ్చుకోండి.
ఇదీ చదవండి: భవిష్యత్‌లో రాబోయే వ్యాధిని ముందే గుర్తించొచ్చా?