పరుగు పందెంలో పోటీపడుతూ అకస్మాత్తుగా కిందపడి మరణించడం, జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఉన్నట్లుండి చనిపోవడం, మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడం ఇటీవల సాధారణమయ్యాయి. ఆరోగ్యకర అలవాట్లున్నా ఫిట్‌నెస్ కోసం గుండెను అతిగా కష్టపెట్టడం వల్లే ఇలా మరణాలు సంభవిస్తున్నాయని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. కసరత్తులు ఎక్కువ చేస్తున్నప్పుడు తట్టుకోవటం నావల్ల కాదంటూ హృదయం ఇచ్చే సూచనలను విస్మరించవద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో పెరిగిన కొవ్వుతో గుండె నాళాల్లో ఏర్పడే అడ్డంకులు ప్రాణాల మీదకు తెస్తాయంటున్నారు. వంశపారంపర్య చరిత్ర, మద్యపానం, దూమపానం, మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు, మధుమేహం, రక్తనాళాల్లో పూడికలు వంటి సమస్యలు వ్యాయామ సమయంలో గుండెపోటుకు కారణాలు. శారీరక వ్యాయామం చేసేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని స్టార్ ఆసుపత్రి గుండె వైద్యనిపుణులు డాక్టర్ రమేష్ గూడపాటి తెలిపారు. వ్యాయామ సమయంలో గుండెపోటు రావటానికి కారణాలు, బయటపడే మార్గాలను వివరించారు.
రక్తంలో కొవ్వు నిల్వలు ప్రమాదకరం..
- గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో 100 శాతం రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు వస్తుంది.
- 1/3 వంతు మందిలో 80-90 బ్లాక్‌లున్నా సమస్య రావచ్చు.
- 30-40 శాతం పూడుకుపోయిన రక్తనాళాలు వ్యాయామం చేసేటపుడు పూర్తిగా మూసుకుపోతాయి.
- దూమపానం అలవాటున్న వారిలో కొద్దిగా బ్లాక్‌లున్నా మనసు/శరీరం కష్టపడితే క్లాట్స్ ఏర్పడతాయి. గుండెపోటు సంభవించే ప్రమాదం ఉంటుంది.
ఇవీ కారణాలు..
- మానసిక కుంగుబాటు, జన్యుకారణాలు, మధుమేహం, అధికరక్తపోటు, దూమపానంతో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది.
- గుండెకండరాలు మందపడటం వల్ల ఆకస్మిక గుండెపోటు సంభవిస్తుంది. దీనినే కార్డియోమయోపతి అంటారు.
- కండలు పెంచేందుకు వాడే మాదకద్రవ్యాలు, ఎన్‌బాలిక్ స్టెరాయిడ్స్‌తో హృదయ స్పందనలో తేడాలొస్తాయి.
- ఆరుపలకల దేహం కోసం ప్రొటీన్ ఎక్కువ మోతాదులో తీసుకుంటూ కార్బొహైడ్రేట్లు, పీచు, సోడియం, పొటాషియం వంటి వాటికి దూరమవడం.
- బరువు తగ్గేందుకు, కుంగుబాటు నుంచి బయటపడేందుకు వాడే ఔషధాలు హృదయ లయను దెబ్బతీస్తాయి.
యువత తేలికగా తీసుకోవద్దు..
రక్తనాళాల్లో అడ్డంకులున్న వారికి వ్యాయామం చేసేటపుడు ఛాతినొప్పి, మంట, ఆయాసం లక్షణాలు కనిపిస్తాయి. దీనికి ఎసిడిటీ, మాంసాహారం, అల్కహాల్ తీసుకోవటమే కారణమని భావిస్తున్నారు. మరుసటిరోజు వ్యాయామం చేయటం, అతిగా శ్రమించటం వంటివి చేసి గుండెపై భారం పెంచడం పోటుకు దారితీస్తోంది. ప్రమాదాన్ని అంచనా వేయలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఏం చేయాలి..
- వ్యాయామం అతిగా చేయొద్దు.
- గుండె మంట, ఛాతీనొప్పి, నడిచేటపుడు ఆయాసం అలక్ష్యం చేయొద్దు.
- రక్తంలో కొవ్వుశాతం(బ్లడ్ కొలెస్ట్రాల్) తెలుసుకోవాలి.
- దూమపానం, జీవనశైలి వ్యాధులున్నవారు తరచూ వైద్యపరీక్షలు చేయించుకోవాలి.
- కుటుంబంలో గుండెజబ్బులున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి.
- సమతుల ఆహారం, మానసిక ప్రశాంతత అవసరం.
ఇదీ చదవండి: Blood supply to Heart: గుండెకు రక్తసరఫరా తగ్గితే ఏం చేయాలి?