Dangerous Lifestyle diseases : హైదరాబాద్ నగర వాసులను జీవనశైలి వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమవుతోంది. 30 ఏళ్లు దాటిన మహిళలు, పురుషులకు పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడత పూర్తయింది. 30 ఏళ్లు దాటిన వారిలో 1.20 లక్షల మందిని పరిశీలించారు. ఆహారపు అలవాట్లలో మార్పులతో ముప్పు ఎక్కువవుతోంది. గుట్కా, తంబాకు, జర్దా లాంటివి నమలటం వల్ల కొందరు చిన్న వయసులోనే నోటి క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బుల బారిన పడుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కొంతమంది మహిళలను రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్లు వేధిస్తున్నాయి.
బాధితులకు ఉచిత సేవలు:
జీవనశైలి వ్యాధులపై నగర వ్యాప్తంగా చేపట్టనున్న పరిశీలనలో భాగంగా ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డు అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు చాపకిందనీరులా దాడి చేస్తోంది. ఒంటరి వృద్ధులకు పాలెటివ్ కేర్ సేవలను గడ్డిఅన్నారం, ఎంఎన్‌జే ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నాం. జీవనశైలి మార్పులతో ఈ వ్యాధుల నుంచి బయటపడొచ్చు. మద్యం, ధూమపానం, పొగాకు నమలడం లాంటి అలవాట్లకు దూరంగా ఉంటే.. 30 శాతం క్యాన్సర్లను నివారించవచ్చు. రోజూ 30-45 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాలి.-డాక్టర్ వెంకటి, డీఎంహెచ్‌వో, హైదరాబాద్
హైదరాబాద్ జిల్లాలో పరిస్థితి
- జనాభా 44,21,329
- 30 ఏళ్లు దాటిన వారు 16,35,892
- తొలి విడత పరీక్షలు 1,20,796
ఇదీ చదవండి: ఒక్కొక్కరికి ఉచితంగా 30 పరీక్షలు.. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఆరోగ్య సర్వే..