పిల్లల మానసిక వికాసానికి, మంచి ఆలోచన, అవగాహన శక్తికి ఉపయోగపడే ఒమేగా-3 కొవ్వు (ఫ్యాటీ యాసిడ్)ను తీసుకోవడంలో భాగ్యనగరం వెనుకబడి ఉందని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) తాజా పరిశోధనలో నిర్ధారించింది. లినోలియిక్ ఆమ్లం(ఒమెగా-6), అల్ఫా-లినోలియిక్ ఆమ్లం(ఒమేగా-3) మనం తినే ఆహారం ద్వారా మాత్రమే సమకూరుతాయి. ఒమేగా-3 (డోకోసాహేక్సేనోయిక్ ఆమ్లం(డీహెచ్‌ఏ), ఐకోసాపెంటెనోయిక్ ఆమ్లం (ఈపీఏ) సముద్రంలో దొరికే చేపలను తినడం ద్వారా లభిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ రకాల చేపలలో ఎక్కువ మొత్తంలో ఉంటుందని చెబుతోంది.
ఇక శాఖాహారులైతే.. అవిసె గింజలు, వాల్‌నట్, సోయాబీన్, ఆవాలు వంటి వాటి ద్వారా సమకూర్చుకోవచ్చని సూచించింది. గర్భిణిలో ఒమేగా-3 ఎక్కువగా ఉంటే చురుకైన పిల్లలు పుడతారని.. గర్భం దాల్చిన మహిళ 3 నెలల నుంచి ప్రసవం అయ్యాక కూడా రెండేళ్ల వరకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే తల్లి పాల ద్వారా చిన్నారుల మెదడు పెరుగుదల బాగా ఉంటుందని ఎన్‌ఐఎన్ పేర్కొంది. జ్ఞానం, ఏకాగ్రత, ప్రవర్తనను మెరుగుపరచడానికి ఒమేగా-3 పూఫా అధికంగా ఉన్న చేపలు, సముద్ర ఆహారాలు పిల్లల్లో అవసరం అని ఈ సర్వేను పర్యవేక్షించిన ఐసీఎంఆర్ ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డా.హేమలత అన్నారు.
వారానికి 200 గ్రాముల సముద్ర చేపలు తినాలి..
చిన్నపిల్లల మానసిక వికాసం, చురుకుదనం, తెలివితేటలకు ఉపయోగపడే ఒమేగా-3, 6 ఫ్యాటీ యాసిడ్లు పెద్దయ్యాక వారిలో హృద్రోగ సమస్యలను నియంత్రిస్తుందని ఎన్‌ఐఎన్ చెబుతోంది. ఈ ఆహారాలు ఎంతమేర తీసుకుంటున్నారనే విషయాన్ని ఎన్‌ఐఎన్ నగరంలో 5 పాఠశాలలకు చెందిన 625 మందిపై అధ్యయనం చేసింది. 7-13 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల రక్త నమూనాలను పరిశీలించగా విస్తుపోయే అంశాలు తెలిశాయి. పిల్లలు 80 శాతం మంది చేపలు తింటున్నా అవసరమైన మేర తినడం లేదని తేలింది. వారానికి 200 గ్రాముల సముద్ర చేపలు తినాలని సూచిస్తే నెలకు 100 గ్రాములు తింటున్నారని.. అందులోనూ సముద్ర చేపలు కేవలం 4 శాతమే ఉంటున్నాయని స్పష్టం చేసింది.
సాధారణ జీవక్రియకు కొవ్వు ఆమ్లాలు అవసరం
సాధారణ జీవక్రియకు కొవ్వు ఆమ్లాలు(ఎఫ్‌ఏ) అవసరమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త డా.పి.దేవరాజ్ చెప్పారు. కొవ్వు ఆమ్లాల ద్వారా శరీర విధులన్నీ సక్రమంగా జరుగుతాయన్నారు. విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె.. కొవ్వులో మాత్రమే కరుగుతాయి. కొవ్వు మన శరీరానికి ఇన్సులేషన్‌లా పనిచేస్తుందన్నారు. కొవ్వు ఆమ్లాలు శరీరంలో అభివృద్ధి చెందుతుండగా.. రెండు రకాల పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(పూఫా) అల్ఫా-లినోలెనిక్ ఆమ్లం(ఒమేగా-3), లినోలెయిక్ యాసిడ్(ఎల్‌ఏ లేదా ఎన్-6 లేదా ఒమేగా-6) శరీరంలో ఉత్పత్తి అవ్వవన్నారు. వీటిని ఆహారం ద్వారా సమకూర్చుకోవాలన్నారు.