చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి, నల్ల మిరియాలు... దాదాపు అందరి వంటగదుల్లోనూ ఇవి ఉంటాయి. వీటిని వంటకాల్లో భాగం చేసుకోవడం వల్ల రుచితో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పైగా ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. అందరూ ఇంట్లో ఉండే వాటితోనే రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు లాంటి పదార్థాలతో రసం తయారుచేసుకుంటే మేలంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు.. ఈ వంటకం తయారీకి ఎలాంటి ధాన్యాలు కూడా అవసరం లేదని వారు సూచిస్తున్నారు. మరి ఆ రుచికరమైన రసం తయారీ గురించి మనమూ తెలుసుకుందాం రండి.
కావాల్సినవి…
చింతపండు గుజ్జు- ఒక టేబుల్ స్పూన్
టొమాటో - ఒకటి (సన్నగా తరిగిన ముక్కలు)
కరివేపాకు - 10 నుంచి 12 రెబ్బలు
నల్ల మిరియాలు- 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి- 4 నుంచి 5 రెబ్బలు
పసుపు - అర టీస్పూన్
ఎండు మిరప కాయలు- 2
ఉప్పు- రుచికి సరిపడా
జీలకర్ర - ఒక టీస్పూన్
ఇంగువ- అర టీస్పూన్
కొత్తిమీర -ఒక టేబుల్ స్పూన్
నూనె- ఒక టేబుల్ స్పూన్
ఆవాలు - ఒక టీస్పూన్
తయారీ
ముందుగా రెండు ఎండు మిరపకాయలు, నల్ల మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు (4 నుంచి 5 రెబ్బలు)ను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసి టొమాటో ముక్కలు, మిగిలిన కరివేపాకు రెబ్బలు, పసుపు, ఉప్పు వేసి సుమారు 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ముందుగా తయారుచేసి పెట్టుకున్న రసం మసాలా ఇందులో వేసి బాగా కలపాలి. చింతపండు గుజ్జుతో పాటు రెండు కప్పుల నీళ్లు కూడా పోసి సుమారు 10 నిమిషాల పాటు తక్కువ మంటపై మరిగించాలి. ఇప్పుడు మరొక ప్యాన్‌లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి బాగా మరిగించాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు, ఒక ఎండు మిరపకాయ, ఇంగువ వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడాక ఈ మిశ్రమాన్ని మరుగుతోన్న రసంలో పోసి బాగా కలపాలి. ఇలా కాసేపు మరిగించాక చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరి. దీంతో పాటు కాసింత నల్ల మిరియాల పొడిని కలిపితే రసం మరింత రుచిగా ఉంటుంది. దీనిని అన్నంతో కలిపి తీసుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలివే!
* ఈ రసం తయారీలో ఉపయోగించే పదార్థాల్లో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉంటాయి.
* ప్రత్యేకించి చింతపండు, పసుపు, కరివేపాకుల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎలాంటి వ్యాధులను దరిచేరనీయవు.
* వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు విరివిగా ఉంటాయి. ఖనిజాలు, విటమిన్లు, పోషకాలతో నిండి ఉన్న వెల్లుల్లి జలుబు లాంటి అనారోగ్యాలను దూరం చేస్తుంది.
* సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలుచుకునే నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సి డెంట్లతో పాటు విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవే మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
* తాలింపులో అధికంగా ఉపయోగించే జీలకర్రలో పీచు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహాయపడుతుంది.
* ఇంగువని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.
చూశారుగా.. వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతో సులభంగా రసం తయారుచేసుకోవడమెలాగో! మరి మీరు కూడా దీనిని ట్రై చేయండి. రోగ నిరోధక శక్తిని పెంచుకుని కరోనా లాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందండి.
ఇదీ చదవండి: కరోనాపై కేరళ అస్త్రం.. ముందస్తు ప్రణాళికే మంత్రం