‘దొంగలు పడ్డ ఇల్లూ దోసకాయ తిన్న కడుపూ రెండూ ఒకటే’ అన్నది సామెత. దోసకాయ తింటే మలబద్ధకం ఉండదు అన్న అర్థంతో ఈ సామెత చెబుతారు. అది అక్షర సత్యం. రకమేదయినాగానీ దోసవల్ల జీర్ణశక్తి బాగుంటుందనీ, పొట్టలోని టాక్సిన్లను బయటకు పంపించేస్తుందనీ పోషక నిపుణులూ చెబుతున్నారు.అందుకేనేమో, వెనక టిబెరియస్ అనే రోమన్ చక్రవర్తికి ఆకాలం ఈకాలం అన్న తేడా లేకుండా రోజూ కీరా ఉండాల్సిందేనట. దాంతో అప్పట్లోనే కీరాని గ్రీన్‌హౌసుల్లో పండించే వారట. అంటే- ఆరోగ్యానికి అది చేసే మేలు ఎంతో అర్థమవట్లేదూ. పెరట్లోనూ పొలంగట్లమీదా ఎక్కడంటే అక్కడ పెరిగే దోసకాయలు ఈ తరానికి అంతగా పరిచయం లేకపోవచ్చేమోగానీ ఒకప్పటి పిల్లల చిరుతిళ్లలో ఇవీ ఒకటి.
కీరా... తినరా మైమరచి..!
‘యాజ్ కూల్ యాజ్ కుకుంబర్’ అనేది ఓ ఇంగ్లిష్ నానుడి. కోస్తే చల్లగా ఉండే కీరా తింటే ఒంటికీ చల్లదనాన్ని అందిస్తుంది మరి. ఎండల్లో తిరిగేటప్పుడు కీరాముక్కల్ని తిన్నా నీళ్లు తాగినా హాయిగా ఉంటుంది. అందుకే బౌద్ధ భిక్షువులు వేసవిలో చల్లగా ఉండాలని కోరుకుంటూ కీరాతో దీవిస్తారట. 95శాతం నీటితో ఉండే కీరా వల్ల వడదెబ్బ తగలదు. అయితే మనకు తెలిసిన కీరాలు ఒకటి రెండే కావచ్చు. కానీ పలుచని తొక్కతో ఉండి త్వరగా జీర్ణమయ్యే బర్‌ప్లెస్, చిన్న సైజులో గింజల్లేకుండా సువాసనతో ఉండే లెబనీస్, ముదురాకుపచ్చరంగులో పొడవుగా గరుకు తొక్కతో ఉండే ఈస్ట్ ఏషియన్, తియ్యని పర్షియన్, పసుపూ ఆకుపచ్చా కలగలిసిన రంగులో గుండ్రంగా కొంచెం తీపితో ఉండే ఆపిల్ కుకుంబర్, ముదురాకుపచ్చరంగులో మీడియం పరిమాణంలో ఉండే కీరా కుకుంబర్, పాముల్ని పోలిన పొడవాటి అర్మీనియన్, ముళ్ల తొక్కతో ఉండే జెర్కిన్, బంగాళాదుంపని పోలిన ఆలూ కుకుంబర్, కూరగాయగా వాడే దోసకాయ... ఇలా కీరాలో రకాలనేకం. వీటిని నేరుగా తినడంతోపాటు ఇతర కూరగాయలతో కలిపి సలాడ్లూ జ్యూస్‌లూ రైతాలు చేసి తింటుంటారు. ఐరోపా, అమెరికా దేశాల్లో కీరా రకాలతోనే నిల్వ పచ్చళ్లూ పట్టుకుంటారు. అయితే ఏ కీరా అయినాగానీ పండితే చేదుగా పుల్లగా అయిపోతుంది. అందుకే వీటిని పచ్చిగా- అంటే, ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడే కోసి తినాలి.
దోస, కీరా...ఒకటేనా?!
నేరుగా తినే కీరాదోస... కూరగాయగా వాడుకునే దోస... రెండిటికీ రుచిలోనూ రూపంలోనూ తేడా కనిపిస్తుంది కానీ రెండిటిదీ దాదాపు ఒకటే జాతి. కానీ కీరా ప్రపంచవ్యాప్తంగా ఉంటే, దోసకాయ కేవలం మన దగ్గర మాత్రమే పండుతుంది. ఎందుకంటే- కీరా(కుకుంబర్), కర్బూజ(మెలన్)ల సంకరీకరణంతో పుట్టుకొచ్చినదే మనదైన కూర దోసకాయ. అందుకే ఇది పండినప్పుడు కర్పూజ రకాల్లానే మంచి వాసన వస్తుంది. పైగా దీని స్వస్థలం కూడా తెలుగు నేలే. అందుకే మన రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, శ్రీలంకల్లోనే ఎక్కువగా పండిస్తారు, తింటుంటారు. దోసకాయని పప్పుగా వండినా; దప్పళంలో, సాంబారుల్లో వేసినా; చేపలకూరతో కలిపి వండినా ఆ వంటకానికే రుచి వస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక, రోటిపచ్చడి చేసినా ఆవపిండి జోడించి నిల్వ పచ్చడి పట్టినా ఆహా అనని వాళ్లుండరు. దీన్ని వంటల్లోనే కాదు, పచ్చిగా తిన్నా మంచిదేనట. పొట్టలో చెడు పేరుకోకుండా చూసే పీచూ, రోగనిరోధకశక్తిని పెంచే సి-విటమిన్, ఎముకల వృద్ధికి తోడ్పడే కె-విటమిన్, పొటాషియం, మెగ్నీషియం... వంటివన్నీ సమృద్ధిగా ఉంటాయి. దీన్లో కూడా పిందెల్ని తలపించేలా చిన్నసైజు రకాలైన బుడం, నక్క దోస; కోలాకారంలో ఉండే మద్రాసు దోస... వంటివీ ఉన్నాయి.
లాభాలెన్నో..!
కీరా, దోస- రెండింటిలోనూ పోషకాలు దాదాపు ఒకటే. రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. వేసవిలో కీరాముక్కలు, పుదీనా కలిపి మిక్సీలో వేసి ప్యూరీలా చేసి నీళ్లు కలుపుకుని జ్యూస్‌లా చేసుకుని తాగితే డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. కీరాల్లోని పోషకాలు మూత్రపిండాల్లోని రాళ్లనీ తొలగిస్తాయి. కీరా రకాల్లో పుష్కలంగా ఉండే కాల్షియం, విటమిన్-కెలు శరీరంలోకి త్వరగా ఇంకడం వల్ల ఎముక సమస్యలు రావట. వీటిల్లోని సిలికా మృదులాస్థి కణజాలాన్ని పెంచడంద్వారా కీళ్లనొప్పుల్ని రానివ్వదు. కాళ్లూ కీళ్లలోకి నీరు చేరడం వల్ల వచ్చే వాపులకి కీరాలోని కెఫిక్ ఆమ్లం మందులా పనిచేస్తుంది.
* కీరదోస ముక్కల్ని నోటిలో పెట్టుకుంటే చెడువాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా పోతుంది. కీరాదోస తొక్కలోనూ విత్తనాల్లోనూ కెరోటిన్ శాతం ఎక్కువ. అందుకే కంటి సమస్యలున్నవాళ్లు వీటిని తింటే ఫలితం కనిపిస్తుంది.
* కీరా, దోసకాయ రెండూ క్యాన్సర్లను నియంత్రిస్తాయి. వీటిల్లోని లారిసెరిసినాల్, పినోరేసినాల్, సెకోయిసోరిసినాల్ అనే లిగ్నన్లు అండాశయ, గర్భాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్లను తగ్గిస్తాయి. అలాగే వీటిల్లోని గ్లైకోసైడ్లూ ఫ్లేవనాయిడ్లూ శరీరంలోని ఇన్సులిన్‌ను క్రమబద్ధీకరించడంతోపాటు జీవక్రియను ప్రభావితం చేయడం ద్వారా మధుమేహాన్నీ అడ్డుకుంటాయి. ముఖ్యంగా పురుషుల్లో గ్లూకోజ్ స్థాయుల్ని తగ్గించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాధులకి కారణమైన ఇన్‌ఫ్లమేషన్‌నీ ఇవి తగ్గిస్తాయట.
* సోడియం తక్కువగానూ పొటాషియం, మెగ్నీషియంలు ఎక్కువగానూ ఉండే దోస రకాలు బీపీ, హృద్రోగాల్ని రానివ్వవని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంటోంది. వృద్ధాప్యంలో ఎక్కువశాతం మంది ఎదుర్కొనే రక్తపోటునీ కొలెస్ట్రాల్ సమస్యల్నీ కీరా అద్భుతంగా తగ్గిస్తుందట. అరవైఏళ్లు పైబడిన వాళ్లకి ఈ కీరా రసాన్ని ఇచ్చినప్పుడు రక్తపోటు అదుపులో ఉండటాన్ని గమనించారు.
* వీటిల్లోని ఫిస్టిన్ అనే ఫ్లేవనాయిడ్ మెదడు పనితీరుని ప్రభావితం చేయడం ద్వారా జ్ఞాపకశక్తినీ పెంచుతుందట.
* కీరా, దోస... రెండూ చర్మసౌందర్యాన్నీ పెంపొందిస్తాయి. వీటిల్లోని రుటిన్, ఆస్కార్బిక్ ఆక్సిడేజ్ అనే పదార్థాలు ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటాయట. వీటికి సహజంగానే కాంతిని అడ్డుకునేగుణం ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే సన్‌స్క్రీన్, ; ఐ టోనర్లూ లోషన్లూ క్రీముల్లోనూ వీటిని ఎక్కువగా వాడుతున్నారు. కీరాని గుజ్జులా చేసి టోనర్‌లానూ ఫేస్‌మాస్క్‌లానూ వాడుకోవడం వల్ల మచ్చలూ తగ్గుతాయి.
* బరువు తగ్గాలనుకునేవాళ్లకి కీరా మంచి ఆహారం. అందులోని నీటితో పొట్ట నిండిపోయి, ఆకలి అనిపించదు. అయితే వీటిని ఎక్కువ తింటే అతిమూత్రవ్యాధి, కడుపుబ్బరం వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగుమోతాదులో తింటూ వేసవిని చల్లగా గడిపేయండి మరి!
ఇదీ చూడండి: సకల రుచుల యందు.. దాని రుచే వేరయా..!