అందంగా ఉండాలా... ఆరోగ్యం కూడా కావాలా... అయితే ఈ అయిదు రకాల గింజల(seeds for beauty and health)ను ఆహారంలో చేర్చుకోండి మరి.
అవిసె గింజలు :
వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా. ఇవి హార్మోన్ల సమతుల్యతకు, కీళ్లు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తరచూ తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. జుట్టు ఊడటం తగ్గుతుంది. కండరాలు బలంగా మారతాయి. గుండె పదిలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చెంచా గింజలను అర కప్పు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే సరి. ఈ గింజలను పొడి చేసి కూడా వాడుకోవచ్చు. అయితే వీటిని కొద్ది మొత్తంలోనే ఉపయోగించాలి.
గుమ్మడి విత్తనాలు :
వీటిలో పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి. ఈ విత్తనాల్లోని జింక్ ఇమ్యూనిటీని పెంచి ఒత్తిడిని తొలగిస్తుంది. వీటిని స్వీట్స్‌లో కూడా వేసుకుని తినొచ్చు.
పొద్దుతిరుగుడు గింజలు :
చర్మానికి ఆరోగ్యాన్నిస్తాయివి. బరువు నియంత్రణలో ఉండటానికీ తోడ్పడతాయి.
తులసి గింజలు :
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఇవి జీర్ణక్రియకు దోహదపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెంచా తులసి విత్తనాలను గోరువెచ్చని నీటిలో వేసి అయిదు నిమిషాలు నానబెట్టి తాగితే సరి.
చియా :
ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. వీటిలోనూ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం మెండు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం చాలా ఎక్కువ. ఈ విత్తనాలు హార్మోన్ల పనితీరును సమతౌల్యం చేసి రక్తపోటును నియంత్రిస్తాయి.