చామన ఛాయే కావచ్చు.. కానీ సౌందర్యం విషయంలో తమకెవరూ సాటిరారని నిరూపిస్తున్నారీ క్యూబా దేశపు అందగత్తెలు. మరి, అందుకోసం వారెంతో ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నారనుకుంటే.. పొరపడినట్లే! ఎందుకంటే వారు వినియోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ సాధారణంగా వంటింట్లో సహజసిద్ధంగా లభించేవే! వాటితోనే తమ సౌందర్య ప్రమాణాలను పెంచుకుంటూ.. సహజ సౌందర్య రాశులుగా దేవతలుగా అందరి మన్ననలందుకుంటున్నారీ నల్లకలువలు.
బొప్పాయితో ముఖానికి మెరుపు!
కొందరికి ముఖంలో బుగ్గలు ఒక రంగులో, నుదురు ఒక రంగులో ఉంటాయి. తద్వారా నలుగురిలోకి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అయితే దీనికి కాలుష్యం లేదా ట్యాన్ పేరుకుపోవడం కూడా కారణమే అంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టి స్కిన్ వైటెనింగ్ ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటారు. అయితే ఇలాంటి చికిత్సల వల్ల తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం దొరకదు. కానీ వంటింట్లో లభించే బొప్పాయి వల్ల ఈ సమస్యకు సమూలంగా చెక్ పెట్టచ్చంటున్నారు క్యూబా ముద్దుగుమ్మలు.
అరకప్పు బొప్పాయి ముక్కలకు, 2 టేబుల్ స్పూన్ల ఓట్స్, టీస్పూన్ కొబ్బరి నూనె, టీస్పూన్ నిమ్మరసం కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లని మచ్చలున్న చోట లేదా ముఖమంతా పూతలా వేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల క్రమక్రమంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
వెనిగర్ గోళ్లకు బలాన్నిస్తుంది!
మనలో చాలామంది గోళ్లు పొడిబారిపోయి పెళుసులుగా మారి విరిగిపోవడం, ఇతర గోళ్ల సమస్యలతో ఇబ్బంది పడడం.. చూస్తూనే ఉంటాం. నిజానికి గోళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారి కంటే గోళ్లను నిర్లక్ష్యం చేసే వారే ఎక్కువమంది ఉంటారు. అయితే ఇలాంటి గోళ్ల సమస్యలను పరిష్కరించుకోవడానికి పార్లర్స్‌లో చేయించుకునే ట్రీట్‌మెంట్స్ కంటే వంటింటి చిట్కాలే చక్కగా పనిచేస్తాయంటున్నారు క్యూబా అతివలు. ఇందుకోసం వెనిగర్, బేకింగ్ సోడాలు బాగా ఉపకరిస్తాయని.. ఇదే తమ గోళ్ల సౌందర్యానికి, ఆరోగ్యానికి అసలు కారణమంటున్నారు వారు. దానికోసం ముందుగా కొద్దిగా వెనిగర్‌ని ఓ గిన్నెలో తీసుకోవాలి. మరో పాత్రలో టీస్పూన్ బేకింగ్ సోడాకి తగినన్ని నీళ్లు కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. ఇప్పుడు సమస్య ఉన్న గోరు వేలిని ముందుగా వెనిగర్‌లో ఓ 5 నిమిషాలపాటు ఉంచి.. ఆపై బేకింగ్ సోడా మిశ్రమంలో కాసేపు నాననివ్వాలి. ఇక ఆఖర్లో చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను నెల రోజులపాటు కొనసాగిస్తే గోరు చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్‌తో పాటు ఇతర సమస్యలేవైనా ఉంటే తగ్గిపోతాయి. ఈ న్యాచురల్ ట్రీట్‌మెంట్ గోళ్లకు తేమనందించి.. గోళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
చామొమైల్‌తో నిగారింపు!
చామొమైల్ టీతో ఆరోగ్యమే కాదు.. అందాన్నీ ద్విగుణీకృతం చేయచ్చన్న విషయం మనకు తెలిసిందే. అందుకే ఈ పానీయాన్ని తమ బ్యూటీ రొటీన్‌లో భాగం చేసుకుంటున్నామంటున్నారు క్యూబా మహిళలు. ఇందుకోసం ఒక కప్పు నీటిలో ఎండబెట్టిన చామంతి పూలు కొన్ని వేసి మరిగించాలి.. చామంతి పూలకు బదులుగా బయట సూపర్‌మార్కెట్లలో లభ్యమయ్యే చామొమైల్ టీ పొడిని కూడా వాడచ్చు. ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారనిచ్చి.. అందులో దూదిని ముంచి చర్మానికి అద్దాలి.
ఇలా చేయడం వల్ల ఎండవల్ల కందిన చర్మానికి సాంత్వన లభిస్తుంది. దీనితో పాటు అలర్జీ, పింపుల్స్ లాంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక జుట్టు విషయానికొస్తే.. తలస్నానం చేసిన తర్వాత ఈ మరిగించిన చామొమైల్ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఆపై 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా చుండ్రు సమస్య తగ్గి.. కుదుళ్లకు బలం చేకూరుతుంది. ఇది కండిషనర్‌గానూ పనిచేస్తుంది. చామొమైల్ మిశ్రమంతో కురులు మృదువుగా, పట్టుకుచ్చులా నిగనిగలాడతాయి.
పాలతో స్నానం..
పాలలోని పోషకాలు ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తాయి. అందుకే పాలతో స్నానం చేయడమనేది వెనుకటి కాలం నుంచే పాటిస్తోన్న బ్యూటీ మంత్రం. తామూ ఈ చిట్కాను తరతరాలుగా పాటిస్తున్నామంటున్నారు క్యూబన్ బ్యూటీస్. వారు వాడే ప్రతి ఫేస్‌ప్యాక్ దగ్గర్నుంచి స్నానం వరకు ప్రతి దాంట్లో పాలు కచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు. ఫేస్‌ప్యాక్స్‌లో భాగంగా కొన్ని చుక్కల పాలను ఉపయోగించడం వల్ల చర్మానికి తేమ అందడంతో పాటు.. లోలోపలి నుండి పోషణ లభిస్తుంది. ఇక స్నానమాచరించే నీటిలో పాలను కలుపుకొని స్నానం చేస్తే చర్మం నిగారిస్తుంది. అలాగే పాలను మరిగించాక దాన్నుంచి వెలువడే ఆవిర్లతో ముఖానికి స్టీమ్‌ని పట్టించడం వల్ల ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పాలలో దాగున్న సౌందర్య సుగుణాలు ఎన్నో.. ఎన్నెన్నో!
కురుల ఆరోగ్యానికి అవకాడో!
ముఖ సౌందర్యంతోపాటు.. నల్లగా నిగనిగలాడే కురులున్నప్పుడే ఆ అందానికి సంపూర్ణత చేకూరుతుంది. కానీ నేటి వాతావరణ పరిస్థితుల వల్ల జుట్టు సమస్యలను పరిష్కరించుకోవడం గగనమైపోతోంది ఈ తరం అమ్మాయిలకు! అందుకోసమే జుట్టును పట్టుకుచ్చులా మెరిసేలా చేయాలంటే అవకాడోను మించిది లేదంటున్నారీ క్యూబా అందాల తారలు. అందుకోసం గుడ్డు సొన, కొబ్బరి నూనె, అవకాడో పేస్ట్‌ను కొద్ది మోతాదుల్లో తీసుకొని మిశ్రమంలా తయారుచేయాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. కాసేపు ఆరాక గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఫలితంగా జుట్టుకు బలం చేకూరి జుట్టు రాలడం తగ్గుతుంది. దీనితో పాటు గుడ్డు తెల్లసొనకు కలబంద గుజ్జు, కొకో బటర్‌ని కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దాన్ని కురుల మొత్తానికి అప్లై చేయాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే కేశాలకు మెరుపు, మృదుత్వం లభిస్తాయి. ఈ మిశ్రమం జుట్టకు సహజ కండిషనర్‌లా పనిచేస్తుంది.
ఇలా సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలతో మచ్చలేని నిగారింపు కలిగి ఉండడమే అసలైన అందం అని నిరూపిస్తున్నారు క్యూబా ముద్దుగుమ్మలు. మరి, వారి సహజ సౌందర్య పద్ధతులను పాటిస్తూ మనమూ మచ్చలేని చందమామల్లా మెరిసిపోదామా..!!