కాటుక అలంకరణ కోసమేగానీ దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలూ ఉండవు. వెనకటి రోజుల్లో ఆముదం, నెయ్యి, కూరగాయల నూనెను ఉపయోగించి ఇంట్లోనే కాటుకను తయారుచేసేవారు. ఇప్పుడు బయట కొనుక్కునే కాటుకలో రసాయనాలు ఉండటం వల్ల ఇది ఎంతమాత్రం మంచిది కాదు. కాటుక కంట్లోని దుమ్మూ, ధూళిని తొలగించి కళ్ల మంటలను తగ్గిస్తుందని చాలామంది నమ్ముతారు. ఇంట్లో తయారుచేసిన కాటుక విషయంలో ఇది కరెక్టేగానీ ఇప్పుడు వాడే కాటుక వల్ల ఇలాంటి ఉపయోగాలేవీ లేవు.
ఆముదంతో కాటుకను తయారుచేస్తే దాంట్లోని విటమిన్-ఇ కంటికి మేలు చేసేది. ఇది యాంటీ బ్యాక్టీరియల్‌గానూ ఉపయోగపడేది. అలసటా, ఒత్తిడీ, కళ్లమంటలూ తగ్గేవి. దీంట్లో నెయ్యి కలపడం వల్ల కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలు తగ్గడానికి కూడా ఉపయోగపడేది. ఇప్పుడు దొరికే కాటుకలో లెడ్, పీబీఎస్, ఎఫ్‌ఈత్రీ-04, జెడ్‌ఎన్‌ఓ లాంటి భారీ లోహాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరంలో నిల్వ ఉండి మెదడు, ఎముక మూలుగ మీద దుష్ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు కాటుక పెట్టడం వల్ల కళ్లకు దురదలూ, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కంటి పైభాగం, బయటా ఐలైనర్ పెట్టుకోవడం వల్ల అంతగా సమస్యలు రావు. అయితే నాణ్యమైనవే ఎంచుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోకపోవడమే మంచిది.