కావాల్సిన పదార్ధాలు !
- స్వీట్ పొటాటో (చిలగడ దుంప, గనుసుగడ్డ) - అర దుంప
- యోగర్ట్ (బయటదొరికే పెరుగు) - ఒక టిన్
- కొబ్బరి నూనె - ఒక టేబుల్‌స్పూన్
- దాల్చిన చెక్క పొడి - ఒక టేబుల్‌స్పూన్
- తాజా బెర్రీ పండ్లు - కొన్ని
- గ్రానోలా - పావు చెక్క (గ్రానోలా గురించి తయారీలో చూడండి)
- పీనట్ బటర్ (పల్లీల వెన్న) - ఒక టేబుల్ స్పూన్
తయారు చేసే పద్ధతి
ముందుగా గ్రానోలా తయారీ :
గ్రానోలా కూడా ఒక అల్పాహారమే ! పల్లీచెక్కలా పెద్దలకే కాకుండా పిల్లలకి పెట్టడానికి కూడా బావుంటుంది. దీన్ని ఖాళీ సమయంలో తయారు చేసుకుని పెట్టుకుంటే 'యోగర్ట్ స్వీట్ పొటాటో' త్వరగా తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం !
- ముందుగా 200 గ్రాముల తేనెని గోరు వెచ్చగా చేసుకొని ఒక బౌల్‌లో పోసుకోవాలి.
- అందులో పిడికెడు ఓట్స్, నట్స్ (బాదం, జీడిపప్పు మొదలైనవి), గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, చియా సీడ్స్, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- తర్వాత 20 నుండి 25 నిమిషాల వరకు ఒవెన్‌లో బేక్ చేసుకోవాలి.
- ఒవెన్ నుండి బయటికి తీసిన తర్వాత 20 నిమిషాల పాటు చల్లారే వరకు ఉంచుకోవాలి. ఈ క్రమంలో ఎండు ద్రాక్ష, బెర్రీ ఫ్రూట్స్, ఇంకా కావాలనుకుంటే చాక్లెట్ చిప్స్ కలుపుకుని బార్స్‌లా చేసుకోవచ్చు, లేదంటే మిక్చర్‌లా ఒక సీసాలో పెట్టుకోవచ్చు. ఇక ఇప్పుడు గ్రానోలా తయారైనట్లే !
యోగర్ట్ స్వీట్ పొటాటో తయారీ :
- ముందుగా చిలగడ దుంపను చిన్న ముక్కలుగా తరిగి ఫోర్క్‌తో చిల్లులు పెట్టాలి. తర్వాత 5-6 నిమిషాల పాటు ఒవెన్‌లో ఉడికించాలి. చాలా మైక్రో ఒవెన్స్‌లో పొటాటో సెట్టింగ్స్ ఉంటాయి. దీనికి కూడా ఆ సెట్టింగ్స్‌నే వాడొచ్చు !
- దుంప ముక్కలను ఒవెన్ నుండి తీసిన తర్వాత ప్యాన్‌లో కొబ్బరి నూనె వేసుకుని ముక్కలను వేపుకోవాలి. ఈ సమయంలో దాల్చిన చెక్క పొడిని, తగినంత ఉప్పుని ముక్కలపై చల్లుకోవాలి.
- చిన్న మంటపై ఒక అయిదు నిమిషాలు ఉడికించిన తర్వాత ముక్కలను వేరే బౌల్‌లోకి మార్చాలి. చివరగా ముక్కలపై యోగర్ట్ వేసుకొని, తాజా బెర్రీలతో పాటు గ్రానోలా, పీనట్ బటర్ వేసుకుంటే 'యోగర్ట్ స్వీట్ పొటాటో' రడీ ! ఆరోగ్యంగా ఉండడానికి బ్రేక్‌ఫాస్ట్ చేయడం చాలా ముఖ్యం. కానీ ఇక్కడే చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే మంచి కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, న్యాచురల్ షుగర్స్, ఫ్యాట్స్ లభించే ఈ ఆహారం మీకు లంచ్ వరకు చక్కని శక్తినిస్తుంది. మరి దీన్ని రేపటి నుండే ప్రయత్నిస్తారు కదూ !