ఎవరైనా కాస్త పొడవున్న డ్రెస్ వేసుకుంటేనే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇక అందాల పోటీలు, అవార్డు ఫంక్షన్లకు అందాల తారలు వేసుకొచ్చే కొన్ని డ్రెస్సులను చూసి ‘అబ్బో..అంత పొడవాటి డ్రెస్సా’ అని నోరెళ్లబెడుతుంటారు చాలామంది. కానీ సైప్రస్‌కు చెందిన మరియా పరస్కేవా అనే యువతి ధరించిన పెళ్లి డ్రెస్ చూస్తే మాత్రం ఇవన్నీ దిగదుడుపేనంటారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన వెయిల్ (వివాహ వేడుకలో పెళ్లికూతురు తల మీద ధరించే వస్త్రం)ను ఆమె ధరించింది. సుమారు 6962.6 మీటర్ల పొడవున్న ఈ వెయిల్... అమెరికాలోని 63 ఫుట్‌బాల్ స్టేడియాల పొడవుతో సమానమట!
![longestveilghg650-2.jpg](https://www.vasundhara.net/articleimages/longestveilghg650-2.jpg)
అందుకే అంతటి పొడవాటి డ్రస్!
మరి అంత పొడవాటి డ్రెస్‌తో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందోనని ఆమెను అడిగితే.. ‘చిన్నప్పటి నుంచి నాకో పెద్ద కల ఉంది. ప్రపంచంలో అతి పెద్ద వెయిల్ ధరించి పెళ్లి చేసుకోవాలని, దాంతోనే గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలన్నది నా కోరిక. అనుకున్నట్లే నా చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాను’ అని చెప్పుకొచ్చిందీ నవ వధువు.
మూడునెలల పాటు కష్టపడి!
తన వెడ్డింగ్ వెయిల్ డిజైన్ చేయడం కోసం సుమారు 7,100మీటర్ల క్లాత్‌ను కొనుగోలు చేసింది మరియా. అనంతరం గ్రీస్‌కు చెందిన ఓ కంపెనీకి డిజైనింగ్ బాధ్యతలను అప్పగించింది. ఈక్రమంలో నిపుణులైన డ్రెస్ డిజైనర్లు సుమారు మూడు నెలల పాటు కష్టపడి ప్రపంచంలో అతి పెద్ద వెయిల్‌ను రూపొందించారు.
![longestveilghg650-3.jpg](https://www.vasundhara.net/articleimages/longestveilghg650-3.jpg)
6 గంటల పాటు శ్రమించి!
ఇక ఎంతో ముచ్చటపడి తయారు చేయించుకున్న వెయిల్‌ను మరియా ధరించగానే వివాహం జరిగిన స్టేడియం మొత్తం ఆ వస్త్రంతోనే నిండిపోవడం విశేషం. దీనిని మైదానంలో అమర్చడానికి 30 మందికి పైగా వాలంటీర్లు సుమారు 6 గంటలకు పైగా కష్టపడ్డారు. ఈక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ దీనికి సంబంధించిన ఓ వీడియోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దీంతో మరియా వెడ్డింగ్ వెయిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోన్న ఈ వీడియోను ఇప్పటివరకు 67 వేల మందికి పైగా చూడడం విశేషం. ఈ సందర్భంగా నెట్ ప్రియులు ‘ఈ వెయిల్ లాగానే ఆమె వైవాహిక జీవితం కూడా సుదీర్ఘ కాలం పాటు సుఖసంతోషాలతో కొనసాగాలి’ అని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చదవండి: యాదాద్రీశుని ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం