లీలా కనకదుర్గది ఏపీలోని కృష్ణాజిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామం. భర్త మహేశ్ ఆటో డ్రైవర్. వారికి రెండేళ్ల పాప. గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం లీలకు జనసేన, తెదేపా మద్దతిచ్చిన సర్పంచి అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. ఇంతలో... కరోనా కమ్ముకుంది. ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఏడాది తర్వాత మళ్లీ పల్లెపోరుకు బాటలు పడ్డాయి. కానీ ఈసారి ఆమె అభ్యర్థిత్వం విషయంలో మాత్రం అంతా సందిగ్ధంలో పడ్డారు.
ఈసారి లీల తొమ్మిది నెలల నిండు గర్భిణి కావడం దీనికి కారణం.
కానీ.. లీల మాత్రం నిబ్బరంగా ‘నా బిడ్డ నా విజయానికి చేదోడుగా నిలుస్తుంది కానీ... నా సంకల్పానికి అడ్డుకాదు. నేను ఎన్నికలకు సిద్ధమే’ అని చెప్పింది. ఆమె ఆత్మవిశ్వాన్ని చూసిన అంతా సరేనన్నారు. కానీ వారి ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. బలమైన పోటీ ఉన్నచోట ఎలాగైనా గెలవాలి... ఎలా?
నిండు గర్భిణి అయిన లీల నామినేషన్ వేసి ఇంటి పట్టున ఉండలేదు. సానుభూతితో ఓట్లు రాబట్టాలనీ అనుకోలేదు. ఎన్నికల గుర్తు ‘బుట్ట’ చేత్తో పట్టుకుని గ్రామంలోని ఇంటింటికీ తిరిగింది. తనను గెలిపిస్తే ఊరిని ఎలా అభివృద్ధి చేస్తానో చెప్పింది.
నొప్పిని భరిస్తూ..
నెలలు నిండే కొద్దీ గర్భిణికి బోలెడు సమస్యలు. తన ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రచారం చేసింది. వేసే ప్రతి అడుగులోనూ పేగుల్ని చుట్టుకున్న బిడ్డ కదలికలు నొప్పిపుట్టించేవి. నడిచి నడిచి కాళ్లు వాపులు వచ్చేవి. ఆ బాధను పంటి బిగువున దాచుకుని.. పెదవులపై చిరునవ్వుతో ఓట్లను అభ్యర్థించింది. పోలింగ్ రోజు ఉదయం 6.30కే ఓటు వేసింది. కాసేపటికే కనకదుర్గకు పురిటినొప్పులు మొదలయ్యాయి. కైకలూరు ప్రభుత్వాసుత్రిలో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక అందరికీ ఆమె గెలుస్తుందా? లేదా అన్న ఉత్కంఠ. చివరకు ‘అమ్మే గెలిచింది’. మండలంలోని 20 పంచాయతీల్లో గెలిచిన అభ్యర్థులందరికంటే అత్యధికంగా 689 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. మీఊరికి ఏం చేస్తారని అడిగితే ‘మా ఊర్లో చెరువు సరిపోవడం లేదు. తాగునీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంటింటింకీ తాగునీరిస్తానండీ’ అని సమాధానమిచ్చింది లీల.