- సత్యాగ్రహం చేపట్టి...
తన పరుగులాంటి నడకతో... యూపీ పోలీసులని ఉరికించింది ప్రతిమా మిశ్రా. ‘నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అంటూ తనకు అడ్డొచ్చిన పోలీసులని ధైర్యంగా ప్రశ్నించింది. మరోపక్క 'ఏం జరిగినా సరే... నువ్వు మాత్రం కెమెరా ఆపకు’ అంటూ కెమెరామ్యాన్‌కి చెప్పి హాథ్రస్‌లో జరుగుతున్న వాస్తవాలను చిత్రీకరించి బయట ప్రపంచానికి తెలియచెప్పింది. బాధితురాలి ఇంటికి అడ్డదారుల్లో, పొలం గట్ల మీదనుంచి వెళ్లేందుకు విశ్వప్రయత్నమే చేసింది. అయినా పోలీసులు అడ్డుతగిలారు. ‘మీ ఇంట్లోనూ ఆడపిల్లలున్నారు. అక్కడ అన్యాయం జరిగింది ఓ ఆడపిల్లకు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు నన్ను లోపలికి వెళ్లనివ్వకపోతే... ఈ గాంధీ జయంతి రోజు సత్యాగ్రహం చేస్తా' అంటూ ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ మొండిగా కూర్చుంది. చేతిలో ఫోన్ లాక్కుని... కెమెరా లైవ్‌ని అడ్డుకుంటున్నా బెదరలేదు.
చివరికి ఆమె సత్యాగ్రహానికి పోలీసులు తలవంచారు. ఆపైన యావత్ దేశం చూపునూ హాథ్రస్ వైపు తిప్పగలిగింది. నిజానికి ప్రతిమాకి ఇలాంటి సంఘటలను ప్రపంచానికి తెలియజేయడం కొత్తేం కాదు. ముంబయిలో పుట్టి దిల్లీలో పెరిగిన ప్రతిమ మహారాజా అగ్రసేన్ కాలేజీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పుచ్చుకుంది. 'హూ యామ్‌ఐ: వేర్ డు ఐ స్టాండ్' అంటూ ట్రాన్స్‌జెండర్ల వెతలపై తొలిసారిగా ఒక ఆలోచనాత్మక కథనాన్ని అందించింది. నిర్భయ ఘటనలో అనేక వార్తాంశాల్ని ఎంతో చొరవతో చిత్రీకరించింది. 2017లో గుజరాత్‌లో ఎన్నికలు కవర్ చేయడానికి ఒక గ్రామానికి వెళ్లి అక్కడ రోడ్డువారన టీ తాగుతూనే ఆ ప్రాంతాల్లో ఉన్న వర్ణవివక్షని గమనించింది. మెహసానా, బెచారా గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని కులాల వాళ్లకి బావిలో నీళ్లు తోడుకునేందుకు హక్కులేదని తెలుసుకుంది. దానిపై ఒక కథనాన్ని చిత్రీకరించింది. ఎంతోమందిని ఆలోచింపజేసిన ఈ కథనానికిగానూ 2017లో ‘రామ్‌నాథ్ గోయెంకా’ అవార్డుని అందుకుంది ప్రతిమ.
- చితిమంటలు చిత్రీకరించి...
హాథ్రస్‌లోని బుల్గాడీకి చెందిన యువతిపై జరిగిన అత్యాచారం... అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా జరిగిన అంత్యక్రియల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసింది తనూశ్రీపాండే. పదిహేనురోజుల నరకయాతన తరువాత... బాధితురాలు గత నెల 29 రాత్రి చనిపోయింది. ఆసుపత్రి నుంచి ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో బుల్గాడీకి తరలించారు. అయితే ఆమెని ఇంటికి తీసుకెళ్లకుండా, ఊరి పొలిమేర్లలో ఓ నిర్జన ప్రదేశంలో ఉంచారు. సొంత గ్రామానికి బాధితురాలి మృతదేహాన్ని తరలిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న తనుశ్రీ ఆ ఉదయం నుంచే ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసింది. అంబులెన్స్‌ను అనుసరించి బుల్గాడీకి చేరుకుంది. మృతదేహాన్ని ఇంటికి దూరంగా ఉంచి, బాధితురాలి కుటుంబంతో చర్చలు జరుపుతున్న పోలీసులపై తనుశ్రీకి అనుమానం కలిగింది. చివరకు అదే నిజమైంది. అంబులెన్సు నుంచి మృతదేహాన్ని బయటకు తీసి, అప్పటికే సిద్ధం చేసిన చితిపై ఉంచి నిప్పంటించారు పోలీసులు.
దీన్ని దూరం నుంచి గుర్తించిన తనుశ్రీ అక్కడకు వెళ్లడానికి ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. 'అక్కడ ఏం మండుతోంది? అసలేం జరుగుతోందిక్కడ' అంటూ పోలీసుల్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. గట్టిగా ప్రశ్నిస్తే 'ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా పని మేం చేస్తున్నాం. మీకేం సమాచారం కావాలన్నా, వారినే అడగాలి' అన్న సమాధానం వచ్చేది. వారిని ప్రశ్నిస్తూనే మరోవైపు మండుతున్న చితిని ఆ చీకట్లోనే దూరం నుంచి కెమెరాలో చిత్రీకరించింది. 'ఓ పాత్రికేయురాలిగానే విధులు నిర్వర్తించానని చెప్పను. సాటి మహిళకి జరిగిన అన్యాయం, మృతురాలి కుటుంబానికి చివరిచూపూ దక్కనీయకుండా చేయడాన్ని ఎలా సహించాలి. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నా, అక్కడే తెల్లారేవరకు ఉండిపోయా. అప్పటికీ చితి మండుతూనే ఉంది. పాపం వాళ్ల కుటుంబీకులు అక్కడికి రానేలేదు. తమ కూతురికి జరిగిన అన్యాయానికి సమాధానం దొరికేవరకు ఆ పక్కకు వెళ్లమంటూ పోరాటం మొదలుపెట్టారు. ఆ చితిమంటలు ఆరవచ్చేమో గాని, ఆ అభాగ్యురాలి తల్లిదండ్రుల గుండెల్లో రేగిన చిచ్చు మాత్రం ఆరదు. తప్పు చేసినవాళ్లకి తగిన శిక్ష పడాల్సిందే' అంటోంది తనూశ్రీ.
- జర్నలిజంలో లక్ష్మీబాయి..
'మీరు డ్యూటీ చేస్తుంటే... మమ్మల్ని కూడా మా డ్యూటీని చేయనివ్వండి' అని ప్రశ్నించిన గొంతు ప్రజ్ఞామిశ్రాది. అర్ధరాత్రి ఇలా పెట్రోల్, డీజిల్‌పోసి అత్యవసరంగా అంతిమ సంస్కారాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ఆమె అడిగిన ప్రశ్నలకు పోలీసులు తత్తరపడ్డారు. అది మొదలు... బాధితురాలు కుటుంబాన్ని చేరుకోవడానికి ప్రజ్ఞా చాలా శ్రమించాల్సి వచ్చింది. మెయిన్‌రోడ్ నుంచి బాధితురాలు ఇంటికెళ్లే మార్గాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పొలాల బాట పట్టింది. అక్కడా ఆమెని పోలీసులు అడ్డుకున్నారు. అతి కష్టం మీద బాధితురాలి సోదరుడిని పొలాల వద్దకు రప్పించి అతడిని ఇంటర్వ్యూ చేసి నిజాలని బయటపెట్టింది. ఆ తరువాత అతికష్టమ్మీద వాళ్ల తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అసలు వాస్తవాలని వెలికితీసే ప్రయత్నాలు చేసింది. ఇంత కష్టపడి సత్యాన్ని వెలికితీసే ప్రయత్నం చేసినందుకే సోషల్‌మీడియా వేదికగా ఎంతోమంది ఆడపిల్లలు ఆమెకు కృతజ్ఞతలు చెబుతున్నారు. 'లక్ష్మీబాయి ఆఫ్ జర్నలిజం' అంటూ మనసారా పొగుడుతున్నారు. లఖ్‌నవూకి చెందిన ప్రజ్ఞా తొలినుంచీ సామాజిక సమస్యలపై పోరాడుతూనే ఉంది. మొదట్లో వీధినాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించింది. తరువాత ఒక టీవీ ఛానెల్‌లో ‘కటింగ్ చాయ్’ పేరుతో సామాజిక సమస్యలపై ప్రత్యేక కథనాలు చేసేది. ‘ఉల్టా చష్మా యుసి’ అనే వెబ్‌సైట్ పెట్టి ప్రజాసమస్యలపై పోరాడుతోంది.
ఇదీ చదవండిః 'నాకు కళ్లు లేవు.. కానీ అమ్మ ప్రపంచాన్నే చూపించేసింది'