చూపు లేనివాళ్లు అందరిలా మామూలు స్కూళ్లు, కాలేజీల్లో చదవలేరు. ప్రత్యేక స్కూళ్లకే వెళ్లాలి. బ్రెయిలీలోనే చదవాలి. ఉన్నత విద్య మరీ కష్టం. విషయం మీద ఎంత ఆసక్తి ఉన్నా చదవాల్సిన మెటీరియలంతా పుస్తకాలు లేదా పీడీఎఫ్ రూపంలో కంప్యూటర్లో ఉంటుంది. లేదా పాఠ్య పుస్తకాలు, పత్రికలు, పేపర్లుగా మార్కెట్లో దొరుకుతుంది. ఎవరినైనా బతిమాలి చదివించుకోవాలి. కానీ అది అన్నిసార్లూ కుదిరేపని కాదు. లేదా వాటిని బ్రెయిలీలో చదవాలి, ఆడియోబుక్స్ ఉంటే వినాలి. ఈ రెండూ కష్టమే. అన్ని పుస్తకాలూ అలా దొరకవు. ఇన్ని తంటాల్లేకుండా వారికి చదువు సులువయ్యేలా చేయాలనుకున్న శాంతియా రాజన్ ‘ప్యారాక్లేట్ ఇమేజ్ ల్యాబ్స్ (Paraclete Image Labs)’ అనే స్టార్టప్ నెలకొల్పింది. తన టీమ్‌తో కలిసి చూపులేనివారికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్ కనిపెట్టింది. అది ఎలాంటి డాక్యుమెంట్‌ని అయినా స్కాన్ చేసి బిగ్గరగా చదువుతుంది. అర్థవంతంగా ఉండాలని దానికి ‘ప్రకాశ్ (Prakash)’ అని పేరుపెట్టింది.
చూపు లేనివాళ్లు తమకు అవసరమైన పాఠ్యాంశాలు, పుస్తకాలు బంధుమిత్రులతో చదివించుకోవడం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఉన్న కష్టనష్టాలు, గజిబిజి గమనించిన శాంతియా దాన్ని పరిష్కరించాలనుకుంది. అందుకు తగ్గ చదువునే ఎంచుకుంది. కోయంబత్తూరు బన్నారీ అమ్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్‌లో చేరింది. 2017లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ఉండగా ఈ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేయడం మొదలుపెట్టింది. బెంగళూరు ‘ఆర్‌టీ ల్యాబ్స్’, ‘వి హబ్’ల సహకారం తీసుకుంది. ఆమె కృషి ఫలించింది.
2020 డిసెంబర్‌లో అనుకున్నది సాధించింది. తమ ఫోన్‌లలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఎవరినో అభ్యర్థించాల్సిన పని లేకుండా తమకు కావలసింది అనుకూల సమయంలో వినగలరు. కరోనా వల్ల కొంత జాప్యం జరిగినా, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాలేషన్ ప్రకటించింది. యూజర్ రూ.40 వేలు చెల్లించి, మైక్రోసాఫ్ట్ లేదా అడోబ్‌ను పోలిన ఈ సాఫ్ట్‌వేర్‌ను ఒకసారి కొనుగోలు చేస్తే ఇక దాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, పంజాబీ, హిందీ, ఇంగ్లిషు భాషలు గ్రహించేలా సాఫ్ట్‌వేర్ రూపొందింది. ఇది ఆన్‌లైన్‌లోనే కాదు, ఆఫ్‌లైన్‌లోనూ పనిచేస్తుంది. ప్రస్తుతం కోయంబత్తూరు చుట్టుపక్కల 500 మంది దీన్ని ఉపయోగిస్తున్నారు.
కేవలం బిగ్గరగా చదివి వినిపించడమే కాదు, పరీక్ష రాసే సాఫ్ట్‌వేర్ కూడా ఇందులో అమర్చి ఉంది. ఇప్పటివరకూ చూడలేనివాళ్లకి వేరెవరో ఎగ్జాం రాసిపెట్టేవాళ్లు. ఈ సాఫ్ట్‌వేర్ ఆ సమస్యనూ తీర్చనుంది. మొదట పరీక్ష పేపరును చదువుతుంది. జవాబులు నోటితో చెబితే చాలు.. వెంటనే పీడీఎఫ్ డాక్యుమెంట్ తయారైపోతుంది. అన్ని ప్రశ్నలూ పూర్తయ్యాక ఆ పత్రాన్ని ఎగ్జామినర్‌కు పంపిస్తుంది. శాంతియాకి ఇంతటితో తృప్తి కలగలేదు. తన టీమ్‌తో కలిసి ఈ సాఫ్ట్‌వేర్‌ని మరింత అభివృద్ధి చేసే పనిలో లీనమయ్యింది.
ఇదీ చూడండి: అంధుల కోసం రూ.5తో పరికరం... వరించిన జేమ్స్డైసన్- 2020 పురస్కారం