కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్... ఇవి కొలువుల కల్పతరువులు. ఈ రంగంలో నైపుణ్యాలుంటే పిలిచి మరీ ఉద్యోగాలిస్తారు. కానీ శిక్షణనిచ్చే సంస్థలే తక్కువ. ఫీజులు ఎక్కువ. ఈ కొరత తీర్చేలా ఆన్‌లైన్ ఎడ్యుటెక్ స్టార్టప్ ప్రారంభించాలనుకున్నారు శ్రీకాంత్ వర్మ, మురళీ కృష్ణ, నవీన్ బడే, బ్రహ్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీశ్ అచ్చలు. వాళ్లు అప్పటికే కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్‌లలో పట్టు సాధించి ఎమ్మెన్సీల్లో రూ.25 లక్షల నుంచి రూ.కోటి దాకా వార్షిక వేతనంతో పని చేస్తున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివిన నేపథ్యం. పైగా గేట్ ర్యాంకర్లు. అందరి ఆశయం ఒక్కటే కావడంతో మూడున్నరేళ్ల కిందట www.appliedroots.com ప్రారంభించారు. ‘ఆరునెలలు రిస్క్ చేద్దాం.. సక్సెస్ కాకపోతే వెనక్కి వెళ్లిపోదాం’ అనే ఉద్దేశంతో.
సవాళ్లు అధిగమించి
ఏడాది కష్టపడి కోర్సు డిజైన్ చేశారు. ఆన్‌లైన్ విద్యాసంస్థకి కావాల్సిన సెటప్ తయారు చేశారు. పరిశ్రమకి ఏం కావాలో అదే సబ్జెక్టు. బయటికన్నా చాలా తక్కువగా ఫీజు నిర్ణయించారు. అయినా మొదటి ఆరు నెలలు విద్యార్థులు పెద్దగా వచ్చేవాళ్లు కాదు. నిర్వహణ కష్టంగా ఉండేది. జీతాలు తీసుకునే పరిస్థితి లేదు. సరైన మార్కెటింగ్ లేకపోతే ముందుకెళ్లడం కష్టమని మిత్ర బృందానికి అర్థమైంది. కాలేజీలు, కంపెనీల బాట పట్టారు. తమ కోర్సుల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇది కెరీర్‌కి ఎలా తోడ్పడుతుందో అర్థమయ్యేలా చెప్పారు. ఉచిత కంటెంట్ పెట్టి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం రాకపోతే ఫీజు వెనక్కి ఇచ్చేస్తాం అని ప్రకటించారు. తక్కువ ఫీజుతో మంచి నాణ్యమైన బోధన. మౌత్ పబ్లిసిటీ పెరిగింది. లెర్నర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరగసాగింది. ఇదే ఊపుతో ఇండస్ట్రీలో ది బెస్ట్ అనుకున్నవాళ్లని తీసుకొచ్చి పాఠాలు చెప్పించసాగారు.
ఇలా ఫ్లిప్‌కార్ట్, మైక్రోసాఫ్ట్, ఐఐటీ-బొంబాయి, ఐఐటీ-మద్రాస్, అమెజాన్, గూగుల్.. లాంటి ప్రఖ్యాత సంస్థలు, విద్యాసంస్థల్లో పని చేస్తున్న సీనియర్ ఉద్యోగులు, అధ్యాపకులతో క్లాసులు చెప్పిస్తున్నారు. కొందరిని పార్ట్‌టైం టీచర్లుగా తీసుకున్నారు. విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరగడంతో రకరకాల కొత్త కోర్సులు ప్రవేశపెట్టసాగారు. మొత్తానికి మూడున్నరేళ్లలోనే దేశంలోని టాప్ ఎడ్యుటెక్ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది అప్లయిడ్ రూట్స్. మూడున్నరేళ్లలో ఆన్‌లైన్ ద్వారా దాదాపు మూడులక్షల మందికి రకరకాల కోర్సుల్లో శిక్షణనిచ్చారు. ఇందులో ఇండియాతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, యూకే... పదహారు దేశాలకు చెందిన విద్యార్థులూ ఉన్నారు. దీంతోపాటు కొన్ని కంపెనీల్లోని ఉద్యోగులకు అప్‌స్కిల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు వెంటనే ఉద్యోగాల్లో నియమించుకునేలా కొన్ని కంపెనీలతో భాగస్వామ్యం చేసుకున్నారు.
తీర్చిదిద్దుతున్నారు
అప్లైడ్ మెషిన్ లెర్నింగ్: మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. విభాగాల్లో శిక్షణనిస్తారు. ఏడాది వ్యవధి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సు డిజైన్ చేశారు.
ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోర్సు: ఏడాది కోర్సు. సివిల్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు సమాయత్తం చేసేలా ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు.
అప్లయిడ్ గేట్ కోర్సు: వీళ్లంతా గేట్ ర్యాంకర్లే కావడంతో తమ అనుభవం, పరిజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేలా దీన్ని ప్రారంభించారు. గతేడాది వందలోపు 41 ర్యాంకులు వచ్చాయి.
ఆన్‌లైన్ డిప్లొమా ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి నిర్వహిస్తున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో అతిపెద్ద డిప్లొమా ప్రోగ్రాం ఇది. దీనికి యూజీసీ అనుమతి ఉంది.
గుర్తింపు
టైమ్స్ గ్రూప్, ఎకనామిక్స్ టైమ్స్ ‘మోస్ట్ ఇన్నోవేటివ్ ఎడ్యుటెక్ కంపెనీగా’ ఈమధ్యే ఎంపికైంది.
‘ఎనలిటిక్స్’ అనే మ్యాగజైన్ ఇండియాలో ఆన్‌లైన్‌లో కోర్సులు నిర్వహించే టాప్ సంస్థల్లో ఒకటిగా అప్లయిడ్ రూట్స్‌ని ఎంపిక చేసింది.
- ఇదీ చదవండి : 'కొవిడ్‌పై పోరులో బంగాల్‌కు అండగా కేంద్రం'