Singer Varam: మహబూబాబాద్‌లోని బేరువాడ అనే చిన్న పల్లెటూరిలో వ్యవసాయదారులైన ఉప్పలయ్య, కనకలక్ష్మీ కూమార్తె వరలక్ష్మీ. అయినా అందరూ వరం అనే పిలుస్తుంటారు. తనకో అన్నయ్య. ఉప్పలయ్య పద్యాలు బాగా పాడేవారు. ఆయన పాడుతుంటే విని తానూ నేర్చుకుంది. స్కూల్లో ఏ అవకాశమొచ్చినా పాడేది. గొంతు బాగుందని అందరూ మెచ్చుకుంటోంటే సంబరపడిపోయేది. అయిదో తరగతిలో ఓసారి తన టీచర్ వాక్‌మెన్ తెచ్చారు. ఓ పాట వినిపించి, పాడమన్నారు. దాన్ని రికార్డ్ చేసి వినిపించారు. దానిలోనే ఇంత బావుంటే.. సినిమాలో ఇంకెలా ఉంటుందో అనిపించింది తనకు. అలా సినిమాలో పాడటం తన లక్ష్యమైంది. కానీ ఎలా ప్రయత్నించాలి, ఎవరిని కలవాలన్నది మాత్రం తనకు తెలీదు. కొత్త పాటలు నేర్చుకుని ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొనేది.
ఆటను పక్కనపెట్టి..
ఎనిమిదో తరగతిలో కొందరమ్మాయిలు మైదానంలో హాకీ ఆడుతోంటే వరం చూసింది. ఆసక్తి కలిగి పీఈటీ దగ్గరికెళ్లి నేర్చుకుంటానని చెప్పింది. ఇంటర్‌లో హాకీ నేషనల్స్‌కీ ఎంపికైంది. కానీ రెండింటికీ సమన్వయం కుదర్లేదు. దీంతో ఆటను పక్కన పెట్టేసింది. డిగ్రీ చదవడానికి హైదరాబాద్ చేరుకుంది. సింగర్ హేమచంద్ర వాళ్లమ్మ శశికళ దగ్గర సంగీతం నేర్చుకుంది. అప్పుడే సంగీత దర్శకుడు బోలే షావలీ ‘హమ్ తుమ్’ అనే సినిమాలో అవకాశమిచ్చారు. అలా తన కెరియర్ ప్రారంభమైంది. ధనలక్ష్మి తలుపు తడితే, బంతిపూల జానకి, సాగర తీరంలో వంటి 30వరకూ సినిమాల్లో పాడి అలరించింది వరం.
జనపదాలతోనే ప్రదర్శనలిచ్చే స్థాయికి..
"సినిమా అవకాశాలు వచ్చినప్పుడు నాన్న ఎంత సంతోషించారో! ‘నా కల తీర్చావు’ అని మెచ్చుకున్నారు. కానీ నేను డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగానే నాన్న చనిపోయారు. తట్టుకోలేకపోయా. అమ్మ, అన్నయ్య నేను మామూలు మనిషయ్యేలా చేశారు. సినిమాలో పాడుతున్నప్పుడే జానపద అవకాశం మళ్లీ బోలే గారి నుంచే వచ్చింది. నాలుగు మాడ్యులేషన్స్‌లో పాడా. అది విని.. ‘నలుగురితో పాడించారా?’ అన్నారట. ఆ పాట హిట్ అయ్యి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఓ వార్తాఛానెల్ కోసమూ పాడా. అవీ ఆదరణ పొందాయి. చాలామంది సినిమా అవకాశాలున్నప్పుడు జానపదాలెందుకు పాడటం అని అడుగుతుంటారు. ఏ పాటైనా పాడగలిగితేనే కదా.. గాయనిగా నా వృత్తికి న్యాయం చేసేది? పైగా ఇవి ప్రజల పాటలు. వినేవారికే కాదు.. పాడేవారికీ ఆనందాన్నిస్తాయి. అందుకే కొనసాగిస్తున్నా. నిజానికి ఇవే ఆస్ట్రేలియా, అబుదాబి వంటి దేశాలకెళ్లి ప్రదర్శనలిచ్చే స్థాయికి తీసుకెళ్లాయి." - వరం, గాయని.
'శిలమోసే గాయాలే 'పాటతోనే..
దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఎన్నికల సమయంలో వరంతో ‘శిల మోసే గాయాలే...’ పాట పాడించారు. దీన్ని విని మణిశర్మ ఇస్మార్ట్ శంకర్, సీటీమార్, నారప్పల్లో అవకాశమిచ్చారు. ఆర్‌ఎక్స్100లోనూ పాడింది. ప్రస్తుతం ఆచార్య మోషన్ పోస్టర్ కోసం ఓ బిట్ ఆలపించింది. ఇప్పటివరకూ 200కుపైగా జానపదాలు పాడింది. ‘కోలో కోలో కోల్ కొమ్మ పూసే కోల్’, ‘పాలపిట్టల గుంపు చూడు ఓ రాసా గుమ్మడి..’, ‘తంగేడు పూలో తడి తామర పూలో...’ మొదలైనవి వరానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. బతుకమ్మ పాటలు బాగా గుర్తింపు తెచ్చాయి. ఇటీవల చరణ్ అర్జున్ సంగీత దర్శకత్వంలో పాడిన సుక్కురారమ్ మహాలచ్చిమి పాటకు మంచి స్పందన వస్తోంది.
హాకీ సీనియర్ నేషనల్స్‌కి సాధన..
"పాడటంతో పాటు చదువునూ కొనసాగిస్తున్నా. ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేశా. హాకీ సీనియర్ నేషనల్స్‌కీ సాధన చేస్తున్నా. చిన్న పల్లె నుంచి వచ్చా, పరిశ్రమలో పరిచయాలూ లేకపోయినా సాధించగలిగానంటే కుటుంబ ప్రోత్సాహమే కారణం. సినిమాల్లో పాడుతూ మంచి పేరు తెచ్చుకోవాలన్న నాన్న కోరిక తీర్చడమే నా లక్ష్యం. ఆర్థికంగా నిలదొక్కుకున్నాక సొంతంగా ఆల్బమ్స్ చేస్తా. ఆ ఆదాయంతో అనాథాశ్రమం ఏర్పాటు చేస్తా." - వరం, గాయని
ఇదీ చూడండి: